మళ్ళీ వెండితెరపై చిరు

మెగా స్టార్ చిరంజీవి ఆరేళ్ళ బ్రేక్ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న తరుణంలో చిరు ఎలాగైతేనేం ముఖానికి రంగు పూయించుకున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో శరవేగంతో సాగుతున్న బ్రూస్లీ – ది ఫైటర్ చిత్రంలో మూడు నిముషాలపాటు కనిపించేందుకు చిరంజీవి సిద్ధపడ్డారు. ఈ చిత్రంలో చిరు పాత్ర ప్రత్యేకమైనది. చిరు ప్రవేశ సన్నివేశాన్ని దర్శకుడు శ్రీను వైట్ల దగ్గరుండి చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో చిరు చిత్రీకరణ సాగుతోంది. హెలికాప్టర్లు, గుర్రాలతో పాటు మరెందరో ఆర్టిస్టులతో ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.

మొదట్లో ఈ చిత్రంలో చిరంజీవి పై ఒక పాట కూడా ఉంటుందని ఓ టాక్ వచ్చినప్పటికీ కాదు కాదు కేవలం మూడు నిమిషాల సేపు మాత్రమే చిరు కనిపిస్తారని తాజాగా వెల్లడించారు. మూడు నిముషాలు కానివ్వండి ముప్పై నిముషాలు కానివ్వండి ముఖానికి రంగేసుకుని కెమెరా ముందుకు రావడంతోనే చిరు ఇప్పుడు నటిస్తున్న ఈ చిత్రమే 150 వ చిత్రంగా ఎందుకు అనుకోకూడదని అభిమానులు అంటున్నారు.

కనుక చిరు 150 వ చిత్రానికి దర్శకత్వం వహించే అదృష్టాన్ని శ్రీను వైట్ల దక్కించుకున్నాడని చెప్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడు రామ్ చరణ్.

శ్రీను వైట్ల ట్వీట్ చేస్తూ “అంతిమంగా అనుకున్న ఆరోజు నిజమైంది…మెగా స్టార్ చిరంజీవిపై చిత్రీకరిస్తున్న అవకాశం కలగడం తలచుకుంటుంటే ఎంతో గొప్పగా గౌరవంగా ఉంది. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఈ చిత్రీకరణ చిరస్మరణీయం” అని అన్నారు.

ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన తండ్రి యాక్షన్ సన్నివేశం 150వ చిత్రానికి టీజర్ లాంటిదని అన్నారు. వెల్కమ్ బ్యాక్ మెగాస్టార్ . …అని అన్నారు.

ఈ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Send a Comment

Your email address will not be published.