మస్తు మస్తుగా "జబర్దస్తు"

ఆస్త్రేలియ తెలుగు వారి చరిత్రలో ఒక అద్భుత ఘట్టం అనే చెప్పాలి.  ఎప్పుడో ఒక రాజ బాబు, ఒక రేలంగి, ఒక రమణా రెడ్డి, ఒక  అల్లు రామలింగయ్య లను వెండి తెరపై చూడగానే నవ్వు వచ్చేది.  ఆ బంగారు యుగానికి దూరమైపోయామనుకున్న తెలుగు వారికి ఇదొక వరం గానే భావించాలి.  చలాకి చంటి, జబర్దస్త్ శ్రీను, గాలిపటాల సుధాకర్ తమ హాస్యపు జల్లులతో మెల్బోర్న్ తెలుగు వారిని కడుపుబ్బా నవ్వించారు.   చాలా మంది వారి కార్యక్రమాలను ఈటివి, యు ట్యూబ్ లలో చూసే వుంటారు.  కానీ ప్రత్యక్షంగా ఎంతో హాస్యంతో కూడిన నటన, ప్రేక్షకులను రక్తి కట్టించడం, మగవాళ్ళే ఆడవాళ్ళ వేషాలు వేసి అనుకరించడం అందరినీ ఆకట్టుకుంది.

గాలిపటాల సుధాకర్ (గాలిపటాల వారి ఇంటి పేరు కాదు, జబర్దస్తులొ ఒక కార్యక్రమం) తన నటన, గానం, హాస్య రసంతో సమ్మిళిత పరచి ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసారు.  “గాలిపటాలు” కార్యక్రమం తరువాత ప్రేక్షకులందరూ నిల్చొని కరతాళ ధ్వనులు చేయడం ఎంతో చెప్పుకోదగ్గది.  వారు పిన్న వయసులోనే  షుమారు 3500 కార్యక్రమాలను ప్రదర్సించారంటే గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి అతి చేరువులో ఉన్నారనటం అతిశయోక్తి కాదు.   గాలిపటాలను మన తెలుగు సినీ హీరోలు శ్రీ నందమూరి తారక రామ రావు గారి దగ్గర నుండి బాల కృష్ణ, నాగార్జున వరకు వారు అభినయించిన పాటలతో ఒక హాస్య నృత్య రూపకంలా అల్లి చక్కగా ప్రదర్శించడం జరిగింది.  శ్రీ సుధాకర్ గారు మెల్బోర్న్ తెలుగు వారి తరఫున మీకు మా హృదయ పూర్వక అభినందనలు.

చలాకి చంటి అపహాస్యం లేని హాస్యాన్ని ఎంతో వైవిధ్యంతో మనకందించారు.  వారు చేసిన “MLA స్పీచ్” కార్యక్రమం ప్రేక్షకులందరినీ అలరించింది.  రెండు రోజుల క్రితమే మెల్బోర్న్ వచ్చి ఈ మహా నగరం పై ఒక  హాస్యపు స్కిట్ ని చేయడం చాలా బాగుంది.  ఈ కార్యక్రమం లో శ్రీను మరియు సుధాకర్ సహాయకులుగా వుంది మంచి రక్తి కట్టించారు.  ఇది వారి సమర్ధతను, ఇప్పటి వరకూ చేసిన కృషికి నిదర్సనం.

ఎన్నో వందల కార్యక్రమాలను నిర్వహించి ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి కార్యక్రమం అదీ కళా నిలయమైన మెల్బోర్న్ నగరంలో నిర్వహించడం చాలా ఆనందంగా వుందని శ్రీ చంటి గారు చెప్పారు.  శ్రీ చంటి గారు తాను కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఇతర కళాకారులను కూడా ప్రోత్సహించి వారికి ఊతం ఇచ్చే మంచి మనిషని శ్రీ సుధాకర్ మరియు శ్రీ శ్రీను చెప్పారు.

శ్రీను  పంథానే వేరు.  ఏ స్కిట్ లోనైనా ఏ పాత్రనైనా అవలీలలగా వేయ గల సామర్ధ్యం వున్న హాస్య నటుడు.  ఒక రౌడీగా, ఒక తాగుబోతుగా, ఒక అర్ధాంగిగా, ఒక అల్లరి యువకుడుగా ఎంతో చక్కగా అభినయం చేయగల సమర్ధుడు.  అయితే ఏదేదో ఒక్క రోజులో జరగలేదని చిన్నప్పటి నుండి ఎన్నెన్నో బుల్లితెర సీరియల్స్ లో బాల్య నటుడుగా నటించి వివిధ రంగస్థల కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల నాడిని గుర్తించి అంచెలంచెలుగా ఎదిగిన కాలప్రవాహం  అని శ్రీ శ్రీను అంటారు.

వీరి ముగ్గురి కలయికతో జనరంజకమైన హాస్యం మనోరంజకంగా మన తెలుగు వారికి అందించారు.  వీరింకా ముందు ముందు మరెన్నో కార్యక్రమాలను ప్రదర్శించి హాస్యపు జల్లులు కురిపించగలరని తెలుగుమల్లి ఆశిస్తోంది.

 

Send a Comment

Your email address will not be published.