మహానటి నవ్వే నవ్వు

ఆమె అందం, రూపం, ప్రతిభ ఆ హాలీవుడ్ నటిని కట్టిపడేశాయి. ఆమె పేరు సూసన్ హేవార్డ్. ఇంతకూ ఆమె మెచ్చుకోలు పొందిన నటి ఎవరనేగా మీ ప్రశ్న.
ఆగండి చెప్తున్నా…
ఆమె ప్రశంసలు అందుకున్న నటి మరెవరో కాదు, మన తెలుగు నటి సావిత్రి. భారత చలన చిత్ర రంగంలో సావిత్రికో ప్రత్యేక అధ్యాయం ఎప్పటికీ ఉంటుంది. ఇది అతిశయోక్తి కాదు.
విషయానికి వద్దాం…
హాలీవుడ్ నటి సూసన్ ఓ మారు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఆమె సత్యజిత్ రే, సుచిత్ర సేన్ తదితర ప్రముఖలను కలిసారు. అప్పుడు సూసన్ కు సుచిత్ర సేన్ ఒక సినిమా చూపించారు. ఆ సినిమా కన్యాశుల్కం. అందులో మధురవాణిగా నటించిన పాత్ర సూసన్ ను కట్టిపడేసింది. ఈ చిత్రంతోనే తానూ సావిత్రిని ప్రేమించడం మొదలుపెట్టానని చెప్పారు.
మధురవాణి పాత్రలో సావిత్రి ప్రతి కదలికను మెచ్చుకున్న సూసన్ ఆమె బాడీ లాంగ్వేజ్ ని, ముఖ కవళికలను, కళ్ళతో పలికించిన భావాలను ఎప్పుడూ మరచిపోలేనని చెప్పారు.
సావిత్రి పరిపూర్ణమైన నటి అని చెప్పడానికి మధురవాణి పాత్ర ఒక్కటి చాలు అని అంటూ ఉంటారు. అది ఆమె నటనకు చెక్కు చెదరని ప్రామాణికంగా అభివర్ణించారు.

కన్యాశుల్కంలో ఒక చోట అర నిమిషం పాటు మధ్యలో ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా నవ్విన నవ్వు సూసన్ ను ఆశ్చర్యపరచింది. ఆ నవ్వును నవ్వడం కోసం ఆమె ప్రయత్నించారు. అయితే ప్రతి అయిదు సెకండ్లకి ఆమే నవ్వు ఆగిపోయేది. అలా చాలాసార్లు నవ్వినా నవ్వుల అతుకులన్నింటినీ కలిపినా సావిత్రి నవ్వు ముందు తన నవ్వు ఓడిపోయినట్టు సూసన్ చెప్పుకున్నారు. అంతేకాదు సావిత్రి నవ్వును ఆమె విడిగా రికార్డు చేసుకుని వొత్తిడి ఎక్కువగా వున్న సమయాల్లో ఆ నవ్వుని విని కాస్త రిలాక్స్ అయ్యేదానినని ఆమె రాసుకున్నారు. అంతేకాదు ఆ నవ్వు ఆమెను ఎంతో ఉత్సాహపరిచేదట.
సావిత్రి నవ్వును ఆమె ఒక పాఠంలా చెప్పుకున్నారు.
భారత దేశం నుంచి తమ దేశానికి వెళ్ళిపోయినా సావిత్రి రూపం, అందం, చందం, నవ్వు ఆమె మదిలో చేరగిపోకుండా ఉండేవట.
సావిత్రి ఒక్కో సినిమాను ఆమె నాలుగైదు సార్లు చూసేవారట. ఆమె సినేమాలన్నీ తనకు స్పూర్తిదాయకమని చెప్పుకున్న సూసన్ సావిత్రి సాత్విక పాత్రలలో జీవించిన తీరు అమోఘమని అన్నారు.
దేవదాసులో సావిత్రి ఎంతో గొప్పగా నటించారని, అది ఆమె తొలి చిత్రమంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. ఆ సినిమాలో ఒక పాటలో సావిత్రి ప్రదర్శించిన చిరుకోపానికి తాను హ్యాట్స్ ఆఫ్ చెప్పకతప్పదని తెలిపారు.

ఏడుపు సన్నివేశంలో ఎందరో నటించినా సావిత్రి ఒక సినిమాలో ఏడుపు సన్నివేశంలో సుకుమారంగా ఏడ్చిన తీరు అత్యద్భుతమని చెప్పారు సూసన్.
అలాగే మిస్సమ్మ సినిమాలో ఎంతు ముద్దుగా కనిపించిన సావిత్రి నటన అపురూపమని మెచ్చుకుంటూ మాయాబజారులో ఆమె ద్విపాత్రాభినయం అద్వితీయమని అన్నారు. రెండు పరస్పర విరుద్ధ స్వభావాలను తన నటనా ప్రతిభతో పండించిన తీరుకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నానని అన్నారు.
చివరకు మిగిలేది చిత్రంలో ఆమె సంఘర్షణ సూసన్ మనసును పిండేసిందట. ఇక గుండమ్మ కథ చిత్రంలో ఆమె నటనలోని సౌమ్యత సాటి లేనిదని పొగిడారు.
నవరాత్రి సినిమాలో ఒకచోట సావిత్రి చిలిపితనం అమోఘం అని అన్నారు.
సావిత్రి నటన తెలుగు వాళ్లకు ఓ గొప్ప కానుక.
కొత్తగా వచ్చే తారలకు ఆమె నటన ఒక విశ్వవిద్యాలయం, మరచిపోలేని పాఠాలు అని సూసన్ ప్రశంసించారు.
– కళ్యాణీ రెడ్డి

Send a Comment

Your email address will not be published.