మానవతను బోధించే రంజాన్

దివ్యమైన ఖురాన్ అవతరించిన మాసం రంజాన్. నెలవంక దర్శనంతో ఈ మాసం ఆరంభమవుతుంది. చాంద్రమానంలో ఇది తొమ్మిదో మాసం. ముస్లింలకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నా భక్తిశ్రద్ధలతో వారు దీక్షలు పాటిస్తారు. రంజాన్ మాసంలో రోజూ అయిదుసార్లు నమాజ్ చేస్తారు. ఖురాన్ పారాయణం చేస్తారు. దానధర్మాలు చేస్తారు. కోపతాపాలు చూపరు. ఆవేశాలకు ఆమడ దూరంలో ఉంటారు.

ఈ నెలలో రోజూ సహర్ తో ఆరంభమయ్యే ఉపవాసదీక్ష సాయంత్రం ఇఫ్తార్ తో ముగుస్తుంది. ఉపవాస సమయంలో ఒక్క చుక్క నీరు కూడా సేవించారు. అంతదాకా ఎందుకు లాలాజలాన్ని సైతం మింగరు. ఒక వైపు ఇంత కఠోరంగా దీక్ష పాటిస్తూనే మరో వైపు తమ తమ విధులను ఏమాత్రం విసుగు కనబరచకుండా చేసుకుంటూ పోతారు. సమయపాలనను కచ్చితంగా పాటిస్తారు. పేదలైతే ఉప్పుతో దీక్ష విరమిస్తారు. నమాజులో వయో భేదం లేకుండా పిల్లలు మొదలుకుని పెద్దలదాకా అందరూ పాల్గొంటారు. మహిళలు సైతం సామూహికంగా ప్రార్ధనలు చేస్తారు. ముస్లింలు తమ సంపాదనలో రెండున్నర శాతం దానధర్మాలకు ఖర్చు చేస్తారు.

ఖురాన్
దేవదూత జిబ్రయిల్ ఇస్లాం మత చివరి ప్రవక్త మొహమ్మద్ ద్వారా ప్రపంచానికి తమ సందేశం అందించారు. మక్కా పట్టణంలో అబ్దుల్లా, బీబీ అమీనా పుణ్య దంపతులకు హజరత్ మొహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లిం జన్మించారు. ఈయన అరవై మూడేళ్ళు జీవించారు. ఆయన చివరి ప్రవక్తగా మానవులకు దిశానిర్దేశకులుగా ఇస్లాం మతాన్ని స్థాపించి వ్యాప్తి చేసారు. ఇస్లాం అంటే శాంతి. మనోవికారాలను అదుపు చేసుకుని నిత్యం భగవంతుడిని స్మరించే పవిత్ర మార్గం. ఆయన చేసిన దివ్య సందేశాన్ని ఖురాన్ అని అంటారు. సమసమాజ స్థాపనన కోసం మానవతా విలువలు, మానవుల మధ్య సంబంధాలు, దానధర్మాలు, పాపపుణ్య భేదాలు, వాటి ఫలితాలు, స్వర్గం, నరకం, మరణానంతర జీవితం, సత్యం, నీతి నియమాలు వంటివి ఈ పవిత్ర ఖురాన్ లో ఉన్నాయి. ఇందులోని విషయాలను విధిగా పాటించాలని ప్రవక్త బోధ. అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్ లో మొత్తం 30 పర్వాలు, 114 నూరాలు, 6666 వ్యాఖ్యలు ఉన్నాయి.

నమాజు …..
ఇది అయిదు రకాలు. ఉదయం అయిదు గంటలకు ఫజర్, మధ్యాన్నం ఒకటిన్నర గంటలకు జొహర్, సాయంత్రం 5.15 గంటలకు అనర్, రాత్రి ఏడు గంటలకు మఘ్ రిబ్, రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇషా ప్రార్ధనలు చేస్తారు. ప్రతి ముస్లిం కోపతాపాలు ప్రదర్శించరు. అబద్ధమాడరు. వీటిని పాటించడం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి ప్రగాడ విశ్వాసం. రోజా పాటించేవారు తెల్లవారకముందే లేచి భోజనం చేయాలి. దీన్నే సహర్ అంటారు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి నీళ్ళు సైతం సేవించరు.

ఇఫ్తార్
కులమతవర్గాలకు అతీతంగా ఎంతో ఆనందంతో ఉల్లాసంతో జరుపుకునేదే ఇఫ్తార్. ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఇఫ్తార్ లో పాల్గొంటారు. ఎవరి స్థాయికి తగినట్లు వారు ఇఫ్తార్ జరుపుకుంటారు. సమైక్యత చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం.

హలీమ్
రంజాన్ అనగానే హరిస్, హలీమ్ అనేవి గుర్తుకు వస్తాయి. ఈ నెల పొడవునా నోరూరించే హలీమ్ విక్రయ కేంద్రాలు వెలుస్తాయి. హరిస్, హలీమ్ లకు ఈ నెలలో విపరీతమైన గిరాకీ ఉంటుంది.

ఖర్జూరం
ఈ నెలలో అనేక రకాల ఖర్జూరాలు దొరుకుతాయి. భారత దేశానికి వివిధ దేశాలనుంచి ఇవి దిగుమతి అవుతాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అరవై రకాల ఖర్జూరాలు పండుతాయి. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద ఖర్జూర మార్కెట్ ఉండటం విశేషం. ఇక్కడ హోల్ సేల్ దుకాణాల్లో భారీగా ఖర్జూరాలు దొరుకుతాయి. సౌదీ అరేబియా, ఇరాన్ ఖర్జూరాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఖర్జూరాల్లో అజ్వా రకం ఖరీదైంది. ఈ రకం ఖర్జూరం సౌదీలోని మదీనాలో గల ఎడారి ప్రాంతంలో పండుతాయి. ఈ రకం ఖర్జూరం కిలో ధర వేలల్లో ఉంటుంది. ఒక హైదరాబాదులోనే రంజాన్ మాసంలో అయిదు వందల టన్నుల వరకు అమ్ముడవుతాయి. ఖర్జూరాలతోపాటు బాదంపప్పు, కిస్మిస్, జీడిపప్పు, తర్బూజా, సేమియా, రకరకాల పండ్లు అమ్ముడవుతాయి. అలాగే నూతన వస్త్రాలు, అత్తర్లు, పాదరక్షలు కూడా ఈ నెలలో కొనుగోలు చేస్తారు.

ఖురాన్ గ్రంధంలోని విషయాలను భక్తిశ్రద్ధలతో చదివి ఆ నీతి నియమాలను నిష్టతో పాటిస్తే జీవితాలు సమూలంగా మారిపోతాయనే ప్రగాడ విశ్వాసంతో ఉండే ముస్లిం సోదరసోదరీమణులందరకూ రంజాన్ హార్దిక శుభాకాంక్షలు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.