“సుమంగళి” కి 65

టాలీవుడ్ లో ఇప్పటి వరకు సుమంగళి టైటిల్ మీద రెండు చిత్రాలు వచ్చాయి మొదటి సారి 1940 లో వచ్చింది. రెండో సుమంగళి చిత్రం 1965 లో వచ్చింది. రెండో సారి వచ్చిన చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, జగ్గయ్య తదితరులు నటించారు. అయితే మనం ఇక్కడ 1940 లో అంటే 65 సంవత్సరాల క్రితం వచ్చిన సుమంగళి చిత్రం గురించి చూద్దాం. ఈ సినిమాని తమిళంలో జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ విడుదల చేశారు.

మధ్యతరగతి వారు నిరసించిన చిత్రంగా అనిపించుకున్న సుమంగళి చిత్రం బీ ఎన్ రెడ్డి, రామనాథ్, శేఖర్ కలిసి తెరకెక్కించిన చిత్రం సుమంగళి. సుమంగళి వాహినీ పతాకంపై, బి.ఎన్.రెడ్డి నిర్మాణం, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, గౌరీపతిశాస్త్రి, గిరి, కుమారి, మాలతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చిత్తూరు నాగయ్య. ఆయనే పాటలు కూడా పాడారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు
సముద్రాల రాఘవాచార్య అందించారు.

ఈ చిత్రం ప్రారంభంలో ఇంగ్లీషులో “విధివశాత్తు యవ్వనంలోనే మాంగల్యాన్ని కోల్పోయిన సమాజ శాపం చేత జీచ్చవంలా జీవిస్తున్న దురదృష్టకర హిందూ వితంతువులకు ఈ చిత్రం అంకితం ” అనే మాటలు చూపించారు.

ఈ చిత్రంలో గిరి హీరో పాత్రలో నటిస్తే నాగయ్యకు ఇది మూడో చిత్రం. ఆయన కందుకూరి వీరేశలింగం తరహా వృద్ధ పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రకోసం ఆయనకు పారిస్ నుంచి తెల్లటి సిల్కు విగ్గుని తెప్పించి పెట్టారు. నిజానికి నెరసిన జుట్టుతో, కళ్ళజోడు ధరించి ముసలిపాత్రలో సంఘసంస్కర్తగా నటించిన నాగయ్యకు నాగయ్య మొదట్లో ఈ పాత్రలో నటించడానికి ఇష్టపడ లేదు. తానూ యవ్వనంలోనే ఉన్నప్పటికీ వాహినీ పిక్చర్స్ వాళ్ళు తనను వృద్ధ పాత్రలకు పరిమితం చేస్తున్నారని ఆయన ఫీలయ్యారు. ఆ సమయంలోనే భక్త పోతన అనే చిత్రం త్వరలో రాబోతున్నట్టు, అందులోను నాగయ్యది వృద్ధ పాత్రే అనే టాకు రావడంతో నాగయ్య ఆలోచనలో పడ్డారు. అయితే బీ నాగిరెడ్డి నాగయ్యను ఒప్పించి నటింప చేసారు. మొత్తం మీద నాగిరెడ్డి గారి సూచన మేరకు వృద్ధ పాత్రలో నటించడానికి ఒప్పుకున్న నాగయ్య నటనలో మాత్రం ఎక్కడా తమ అసహనాన్ని కానీ అయిష్టత కానీ చూపలేదు. తనకిచ్చిన పాత్రకు అన్ని విధాలా తగు న్యాయం చేసి చూపించారు నటనాపరంగా.

సంఘసంస్కరణలు, విధవరాలి వివాహం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు. మేనత్త కూతురుని పెళ్ళి చేసుకోవాలని కుటుంబ సభ్యులు అంటున్నా, ఐ.పి.ఎస్‌ పాసైన సత్యం చదువుకున్న అమ్మాయిని ప్రేమించడం, ఆమెను పెళ్ళి చేసుకుంటాననడం మేనత్త కూతురు ఆత్మహత్య చేసుకోవడం, చేసుకుంటూ బావకు నచ్చిన అమ్మాయితోనే వివాహం చేయమని కోరడం ఈ చిత్రంలోని ముఖ్య అంశాలు.

ఈ చిత్రంలో రామనాధం సాంకేతికపరంగా ఉపయోగించిన కొన్ని అంశాలు అందరూ మెచ్చుకునేలా నిలిచాయి. ఈ సినిమాను చూసి కొన్ని టెక్నిక్స్ ని ఇప్పటి కెమెరామెన్ కూడా నేర్చుకోవలసిన అంశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం. అందుకేనేమో భారతీయ చిత్రపరిశామలోనే మేరుపర్వతం అని అనిపించుకున్న వీ శాంతారాం కూడా ఈ చిత్రాన్ని తెగ పొగిడారు. రైలు కిటికీ లో నుంచి పరుగెత్తే ల్యాన్ స్కేప్ ని షార్ప్ ఫోకస్ లో చూపించిన తీరు అమోఘమని చూసిన వారందరూ కొనియాడారు. రామనాధం తమ వద్ద ఉన్న ఒక పాత ప్రొజెక్టర్ ని ఒక గడియారపు మేకానిజానికి అమర్చి గ్లిజరిన్ లో ముంచిన ఆర్గండీ స్క్రీన్ ని ఉపయోగించిన టెక్నిక్ లో కె వి రెడ్డి సహకారం కూడా ఉంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో సింబాలిక్ దృశ్యాలు వారేవా అనిపించుకున్నాయి.

అప్పట్లోనే బీ ఎన్ రెడ్డి లక్ష రూపాయలకు పైగా వెచ్చించి ఈ చిత్రంలో ఎన్నో ప్రయోగాలు చేసినా ప్రేక్షకులు పెద్దగా స్వాగతించలేదు. ఆరోజుల్లోనే వై వీ రావు సమర్పించిన మళ్ళీ పెళ్లి చిత్రానికి విశేష ఆదరణ లభించింది. వై వీ రావు గారు తాము సమర్పించిన చిత్రానికి బీ ఎన్ రెడ్డి ఖర్చుపెట్టిన సొమ్ములో సగం మాత్రం ఖర్చు పెట్టి తీసిన చిత్రం సూపర్ హిట్టయ్యింది. బీ ఎన్ రెడ్డి గారు విడుదల చేయడానికన్నా ముందే వై వీ రావు గారి చిత్రం ప్రజల ముందుకు రికార్డ్ టైములో వచ్చింది.

సుమంగళి చిత్రం ఆడకపోవడానికి బహుశా వితంతువు పెళ్లి చేసుకోవడమనేది మధ్యతరగతి ప్రేక్షకులకు నచ్చకపోవడమే అని అనుకుంటున్నానని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన గిరి అన్నారు. పైగా మాలతి గాజులు బద్దలు కొట్టిన సన్నివేశంలో నటించడానికి కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఒప్పుకోలేదట.

ఈ చిత్రంలో ఎక్కువ భాగం రాత్రి పూటే చిత్రీకరించారు. ప్రశాంత వాతావరణంలో తీయడం కోసం రాత్రి వేళలనే ఎంచుకున్నారు.

ఇక్కడే ఓ విషయం చెప్పుకోవలసి ఉంది.

సుమంగళి చిత్ర నిర్మాణ సమయంలో బి.ఎన్.రెడ్డి స్నేహితులు ఒకరు సినిమాని చెన్నై ప్రాంతంలో పంపిణీ చేయడానికి ముందుకువచ్చారు. అయితే రేటు విషయంలో ఓ ఒప్పందం కుదరకపోవడంతో వారి మధ్య మాటలు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు, ఆ పంపిణీదారు మద్రాసు నగరపాలక సంస్థ నుంచి మద్రాసు మొత్తం మీద స్తంభాలకు వెదురు దట్టీలు కట్టి ప్రకటన పోస్టర్లు అంటించి ప్రచారం చేసే హక్కు పొందారు. కనుక తనకు సినిమా పంపిణీ ఇవ్వలేదన్న కోపంతో మద్రాసులో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడానికి వీలు లేదని తగవు పెట్టుకున్నాడు. అయితే పబ్లిసిటీ లేకుండా విడుదల చేయడం కష్టం కనుక బి.ఎన్.రెడ్డి సోదరుడు బి.నాగిరెడ్డి ఓ ఆలోచన చేసి కార్పొరేషన్ ముద్రలు ఉన్న పోస్టర్లను వెదురుదట్టికి కుట్టిన గోనెసంచులకు అతికించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలకు కట్టారు.

ఈ చిత్రం అనుకున్న రీతిలో విజయం సాధించకున్నా విమర్శకుల నుంచి మాత్రం ప్రశంసలు బాగానే దక్కాయి.

– నీరజ, కైకలూరు

Send a Comment

Your email address will not be published.