మానసిక కుశలత

ప్రముఖ మానసిక నిపుణులు డా. శ్రీదేవి గారు  తెలుగుమల్లి  పాఠకుల  క్షేమ సమాచారాలను కోరి ఈ వ్యాసంతో తమ రచనలను మొదలుపెట్టడం ఎంతో శ్లాఘనీయం.  ఈ పరంపరలో ఈ వ్యాసం మొదటిది.  మీరు ఏవైనా ప్రశ్నలుంటే contact@telugumalli.com కి పంపగోరుతున్నాము.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మూల సూత్రాలలో “మానసిక ఆరోగ్యం” గురించి ఈ క్రింది విధంగా నిర్వచించారు.

“Health is a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity.”

మానసిక ఆరోగ్యం అనేది ఇంద్రియ శ్రేయస్సు.  ఇది మనిషిలోని అంతర్లీనమైయున్న శక్తిని గుర్తించి జీవితాన్ని సుఖమయంగా గడపడానికి మరియు ఇతర ప్రక్రియల వలన వచ్చే మానసిక ఒత్తిడులకు తట్టుకునే స్థైర్యాన్నిస్తుంది.  వ్యక్తిగతంగా మానసికారోగ్యం బాగుంటే కార్య నిర్వహణలోనూ సంబంధ బాంధవ్యాల లోనూ మనిషి ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం వుంటుంది.

మానసిక వ్యాధి అంటే ఏమిటి?

ప్రతీ వ్యక్తి జీవితంలో అన్నీ అనుకున్నట్లే జరగకపోవచ్చు.  కొన్నిసార్లు విచారకరంగా వుండే అవకాశం వుంటుంది.  ఇది తెలిసికూడా కొన్ని సమయాల్లో కొంతమందిపై “వాడు/ఆమె మెంటల్” అని ఎగతాళి చేస్తుంటాము.  నిజంగా మానసిక వ్యాధి గురించి తెలిస్తే ఇలా పరిహాసం చేయం గదా!

మానసిక అనారోగ్యం అనేది ఒక స్థితి.  దీనివలన మనిషి కొన్నిసార్లు తన ఆలోచనా సరళిని కోల్పోవచ్చు.  క్రియావృత్తి, మానసికావస్థ, ఎదుటి వారితో తన సంబంధాలు మరచిపోవటం – ఇలా ఎన్నో జరగవచ్చు.  ఒక ప్రామాణిక అభిలక్షణం ద్వారా ఈ రోగ నిర్ధారణ చేయడానికి ప్రయత్నించాలి.  ముఖ్యంగా భావగర్భితమైన వ్యాకులత, సాంఘికంగా అవరోధం, మానవ సహ సంబంధాల్లో అవరోధం, వ్రుత్తి సంబధమైన మీమాంస వంటి లక్షణాలుంటే  ఈ స్థితిని నిర్ధారించవచ్చు.  మానసిక రుగ్మత వివిధ రకాలుగా ఉండవచ్చు.  వివిధ శ్రేణుల్లో ఉండవచ్చు.

మానసిక అనారోగ్యం వేరు, మానసిక వ్యాకులత వేరు.  వ్యాకులతగా వుండడం అనారోగ్యం కాదు.  ఈ రెండిటికీ బేధం తీవ్రత, ఎంత కాలం నుండి వ్యాధి లక్షణాలున్నాయి అన్నదానిపై ఆధారపడివుంటుంది.  మానసిక వ్యాకులత సలహా సంప్రదింపుల ద్వారా, దగ్గరి బంధువుల ద్వారా నివారించవచ్చు.  మానసిక అనారోగ్యం అతి తీవ్రమైన వ్యాధి.  నిష్ణాతులైన వైద్యులు, సలహా సంప్రదింపుదారులు ఈ వ్యాధి నివారణలో ముఖ్య పాత్ర వహించవలసి వుంటుంది.

ఈ క్రింద సూచించిన లక్షణాలు మానసిక అనరోగిలో కనిపించే అవకాశం వుంది:

 1. కోపము, క్రోధము, ఒత్తిడి, కష్టతరమైన ఉద్రేకము
 2. ప్రతీ నిత్యం పాల్గొనే ప్రక్రియలు క్లిష్టంగా అనిపించవచ్చు – ఉదాహరణకు: వంట, శుభ్రపరచటం, వ్యక్తిగత పరిశుభ్రత
 3. కుటుంబ బాధ్యతలు నిర్వహించడం
 4. వుద్యోగం వెదకడం, సంపాదించడం
 5. ఇతరులతో మంచి సంబంధాలు కలిగి వుండడం

మానసిక అనారోగ్యానికి కారణాలేమిటి?

అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు.  ముఖ్యంగా చాలా కాలంగా మానసిక ఒత్తిడికి గురి కావడం, జున్యు సంబంధమైన (hereditary) విషయాలు, నిర్నాళ గ్రంథులలో ఊరే రసం (harmones), మద్యము, మాదక ద్రవ్యాల వాడకం, అభావార్థకమైన (negative) ఆలోచనలు కలిగి వుండడం, అహంభావ దురహంకార భావాలు తోడ్పడతాయి.  అయితే వీటికి తోడుగా సామాజికంగా, సాంఘికంగా అవహేళన చేయబడడం లేదా అలక్ష్యం చేయబడడం, ఒంటరితనం, ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కూడా మానసిక అనారోగ్యానికి కారణాలు కావచ్చు.

ఎవరికైనా రావచ్చు

ప్రతీ సంవత్సరం ఆస్ట్రేలియాలో ఐదు మందిలో ఒకరు ఈ వ్యాధికి గురౌతునట్లు గణాంకాలు చెబుతున్నాయి.  ప్రతీ పదిమందిలో ముగ్గురుకి తీవ్రత హెచ్చు స్థాయిలో వుంటుంది.  మాంద్యత (Depression), ఆర్ద్రత (Anxiety) ఆస్ట్రేలియాలో ఎక్కువమందికి వుంటుంది.  2020 లో ప్రపంచంలో మాంద్యత ఎక్కువమందికి ఉంటుందని అంచనా.

విస్తారమైన మానసిక అనారోగ్యం

భావ అస్తవ్యవస్త స్థితి:  మనసులోని భావాలు వికారంగా అంటే, విచారంగా, అత్యోల్లసంగా వుండడం

ఆర్ద్రత: భవిష్యత్తులో రాబోయే పరస్థితి అపాయకరంగా ఉంటుందన్న బాధ, దురదృష్టం వెంతడుతుందన్న ఆవేదన

మాదక ద్రవ్యాలు: ఎక్కువగా వాడడం వలన వచ్చే అనారోగ్య స్థితి, మతి స్థిమితం లేకపోవడం

మనోవైకల్యం: వాస్తవానికి దగ్గరగా లేకపోవడం,  ఉదాహరణకు schizophrenia

వ్యతిరేక ఆలోచనలు: ఆలోచనా సరళిని ప్రభావం చేయడం,  భ్రమ పడడం, చిత్త వైకల్యం, మతి భ్రంశం, జ్ఞాపకశక్తి తగ్గడం  (Alzheimer’s diseas)

పురోగమన శీల అవ్యవస్థ: చిరుప్రాయం నుండి యుక్త వయస్సు వరకు గుర్తుకు తెచ్చుకోవడం  (Autism, attention-deficit/hyperactivity disorder and learning disabilities)

వ్యక్తిత్వ అవ్యస్థత: ఇందులో ఒక స్థిరమైన అనుభవాలకు లోనై మనో వైకల్యానికి గురి కావడం.

వ్యాధి నివారణ

ఈ వ్యాధి ఫలసాధకంగా నివారణ చేయడానికి ఎన్నో సాధనాలున్నాయి.  ఆదిలోనే వ్యాధి లక్షణాలను మనం గమనించగలిగితే వ్యాధి నివారణ చాలా సులభతరమౌతుంది.  ఇది చాలా ముఖ్యం కూడాను.  జీవితంలో ఈ వ్యాధి లక్షణాలు ఏ కారణాల చేతనైనా ఏ వయసులోనైనా రావచ్చు.  కొంతమందికి ఒకేసారి రావచ్చు మరికొంతమందికి ఎక్కువమార్లు రావచ్చు.

ఫలసాధకమైన నివారణకు ఔషధాలు ఓడడం, మానసిక సంబంధమైన చికిత్స, మానసిక – సాంఘిక ఆదరణ, మానసిక పునరావాసం, మద్యం, మాదక ద్రవ్యాల నిషేధం మొదలైన అంశాలను అమలు చేయాలి.

మానసిక ఆరోగ్యం అభివృద్ధి ఎలా చేయాలి?

 • ఇతరులకు మాట్లాడడం / చెప్పుకోవడం
 • వ్యాయామం
 • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
 • సరియైన నిద్ర పోవడం
 • స్నేహితులతోనూ, కావలసిన వారితోనూ కాలం గడపడం
 • క్రొత్త విషయాలు తెలుసుకోవడం
 • ఇష్టమైన పనులు చేసి సేద దీర్చుకోవడం
 • అనువైన లక్ష్యాలను నిర్దేసించుకోవడం
 • వైద్యునితో సంప్రదింపులు జరపడం 

Dr.Sridevi Kolli
Clinical Psychologist | Aged Persons Mental Health Team | Monash Health

Send a Comment

Your email address will not be published.