మిస్ ఇండియా-ఆస్ట్రేలియా ప్రొఫెషనల్

రంగులలో కలవో యదపొంగులలో కలవో
నవ శిల్పానివో ప్రతిరూపానివో
తొలి ఊహల ఊయలవో
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యనివో
ఆమని పూచే యామినివో

మహానుభావుడు ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారిన ఈ గేయం అద్భుతమైన సాహిత్యంతో కూడుకున్నది. సాహితీ నందనవనంలో అశ్లీలం లేకుండా ఒక అపురూపమైన సౌందర్యాన్ని వర్ణించిన తీరు తెలుగువారికే చెందుతుంది. అయితే ఆస్ట్రేలియాలో ఇంతటి సౌందర్యాన్ని కలిగివున్న తెలుగమ్మాయిలు కూడా వున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2014 లో శ్రీమతి లక్ష్మి, సుబ్బరాజు ఇందుకూరి దంపతుల గారాల బిడ్డ శ్వేతా రాజ్ మిస్ ఇండియా-ఆస్ట్రేలియాగా ఎన్నికైంది.

అయితే ఈ సంవత్సరం శ్రీమతి అపర్ణ మరియు శ్రీ రాజేందర్ సనం గార్ల ఏకైక పుత్రిక మేఘన సనం ఫైనలిస్ట్ గా ఎంపికై మిస్ ఇండియా-ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ టైటిల్ ని పొందటం తెలుగువారందరికీ ఆనందదాయకమైన విషయం.

మేఘన డీకిన్ విశ్వవిద్యాలయంలో కామర్స్ & ఆర్ట్స్ లో పట్టా పుచ్చుకొని ప్రస్తుతం KPMG లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది. మెల్బోర్న్ లోని ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ చంద్రభాను గారి శిష్యురాలిగా 5 ఏళ్ల క్రితం అరంగేట్రం చేయడం మనమందరమూ ఎరిగిన విషయమే. చిన్నప్పటినుండీ నాట్యం చేయడం అంటే వల్లమాలిన ప్రేమ. ఆ దిశగానే తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవడం కోసం “జస్ట్ నాచ్” అన్న బాలీవుడ్ నాట్య పాఠశాల స్వయంగా నడిపిస్తుంది. పెళ్ళిళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుట్టిన రోజు పండగలు, ఫిట్నెస్ క్లాసెస్ మరియు కార్పొరేట్ వర్క్ షాప్స్ మొదలైన వాటికీ కొంతమంది తోటి కళాభిమానులతో తనదైన శైలిలో నృత్య రూపకాల్ని సమకూరుస్తూ దర్సకత్వ బాధ్యతలను చేపడుతుంటుంది. ఇంత చిన్న వయసులోనే తనకున్న సమయంలో బాధ్యతాయుతంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలో వున్న కళల్ని నలుగురికీ పంచి నాట్యానికే వన్నె తెచ్చింది.

తల్లిదండ్రులే తనకు స్పూర్తి అని వారు ఎనలేని ఆత్మ స్తైర్యాన్నిస్తూ తన విజయానికి కారకులుగా అభివర్ణించడం మేఘనకు తలిదండ్రులపై నున్న ప్రేమాభిమానాలకు నిదర్సనం. తమ్ముడు సన్నీని ఒక స్నేహితుడుగా పరిగణిస్తూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంటాడని చెప్పింది.

వచ్చే 5 ఏళ్లలో ప్రపంచమంతా తిరిగి నాట్యంలో క్రొత్త పంథాలు – కథక్, జాజ్, హిప్ హాప్ మొదలైన వాటిని నేర్చుకుంటానని ముందు ముందు నాట్యరంగంలో అత్యున్నత స్థానానికి ఎదిగి ఒక ప్రామాణికంగా నిలవాలని మేఘన అకాంక్షిస్తుంది. మేఘన కలలు నిజం కావాలని తెలుగుమల్లి అభిలషిస్తోంది.

 

Send a Comment

Your email address will not be published.