ముందుంది ముసళ్ల పండగ

తెలంగాణా విషయంలో ఇంతవరకూ పునరాలోచన లేకుండా ముందుకు వెడుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి బహుశా మున్ముందు సమస్యలు ఎదురు కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇక ఇతర పార్టీల ముందుకు, ప్రజల ముందుకు రావాల్సిన అగత్యాన్ని కాంగ్రెస్ నెమ్మదిగా అర్థం చేసుకుంటోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. యూపీఎ తన ఆమోదముద్రను వేసింది. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వమే మంత్రుల బృందాన్ని నియమించి విధి విధానాలను రూపొందిస్తోంది. అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ ఇవన్నీ చేయగలిగింది.

కానీ తెలంగాణా ఏర్పడాలంటే ఇంకా ఎన్నో జరగాల్సి ఉంది. ఇంతవరకూ సొంతగా, ఎవరి ప్రమేయమూ లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఇక తప్పనిసరిగా ఇతర పార్టీల మీద, ముఖ్యంగా తన బద్ధ శత్రువు బీజేపీ మీద ఆధార పడాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలన్నా, శాసనసభకు పంపించాలన్నా, అనివార్యంగా ఇతర పార్టీలు అంటే యూపీఎతర పార్టీలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ పార్టీల ఒత్తిడి ప్రకారం బిల్లులో అనేక మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. తెలంగాణా జిల్లాలతో మాత్రమే తెలంగాణాను ఏర్పాటు చేయాలా లేక అనంతపురం, చిత్తూరు జిల్లాలను కూడా కలపాలా అన్నది అప్పుడే తేలుతుంది. రాయలసీమ జిల్లాలను కలపడానికి వీల్లేదని ఇప్పటికే బీజేపీ తేల్చి చెప్పింది.

వీటన్నిటినీ బట్టి చూస్తే 2014 నాటి ఎన్నికల తరువాతే తెలంగాణా బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాసం ఉంది. యూపీఎ తనకు తానుగా బిల్లును ఆమోదింప చేసే  అవకాశం లేదు. ఈ కూటమికి పార్లమెంట్ లో అంత బలం లేదు. ఇప్పటికిప్పుడు తెలంగాణా బిల్లును ఆమోదింప చేయాలనుకుంటే మాత్రం చాలా పార్టీలను ఆశ్రయించాల్సి ఉంటుంది. బీజేపీ కూడా కాంగ్రెస్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం కోసం ఎదురు చూస్తోంది.

Send a Comment

Your email address will not be published.