అతి కీలకమయిన తెలంగాణా బిల్లు శాసనసభలో చర్చకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో ఇంట్లో ఉండిపోవడం చర్చనీయాంశం అయింది. కలుషిత ఆహారం తీసుకోవడంతో ఆయనకు వాంతులు అవుతున్నట్టు చెబుతున్నారు. తెలంగాణా బిల్లు మీద తమ తమ అభిప్రాయాలను చెప్పడానికి వచ్చిన సువర్ణ అవకాశం ఇది. ఈ అవకాశం చేజారితే ఆ తరువాత చెప్పడానికి ఏమీ ఉండదు. తన సీమాంధ్ర సభ్యులని కూడగట్టుకుని సభలో తన వాదనను బలంగా చెప్పడానికి ముఖ్యమంత్రి తప్పకుండా ప్రయత్నిస్తారని అంతా ఆశించారు. అయితే సభను సభ్యులకు వదిలేసి, ఆయన ఇంట్లో కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు.
సభలో కూడా ఈ బిల్లు మీద ఎక్కడా చర్చ జరగక పోగా, ప్రతి రోజూ గందరగోళం చోటుచేసు కుంటోంది. సభ ఎన్ని రోజులు సమావేశం అయినా పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. ఆ తరువాత ఈ బిల్లు పార్లమెంట్ కు వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఎవరూ ఏమీ చేయలేరు. ఈ బిల్లు మీద చర్చ జరగకుండా తెలంగాణ వాదులు ఒక పక్క, సీమాంధ్ర సభ్యులు మరొక పక్క సభలో గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన ఇష్టం లేని పక్షంలో సమావేశాలకు దూరంగా ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అగ్ర నాయకత్వం సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకత్వం చెప్పినట్టే కిరణ్ వ్యవహరిస్తున్నారు. అంతే కాదు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తెలంగాణకు వ్యతిరేకం అయినందువల్ల ఆయన స్థానంలో మల్లు భట్టివిక్రమార్క సభాపతిగా వ్యవహరిస్తున్నారు.