ముఖ్యమంత్రి పదవిని కోట్ల సూర్యప్రకాశ రెడ్డికి కట్టబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. తెలంగాణా బిల్లు శాసనసభలో సునాయాసంగా నెగ్గడానికి వీలుగా కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించి, సూర్యను ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి కేంద్రం ప్రయత్నం చేసిందని, అయితే సూర్య అందుకు ఒప్పుకోలేదని సూర్య సన్నిహితులు చెబుతున్నారు. కర్నూలుకు చెందిన సూర్య ప్రస్తుతం కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నారు. మంత్రి పదవి నుంచి తప్పుకోనందుకే మండిపడుతున్న సీమాంధ్ర ప్రజలు తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇప్పుడు ఏమాత్రం సహించరని ఆయన అధిష్టానానికి చెప్పినట్టు తెలిసింది. ఆయనను ముఖ్యమంత్రిని చేసిన తరువాత సీమాంధ్ర ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ఎదురైనా తాము పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ ఆయన అంగీకరించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.