ముదురుతున్న సంక్షోభం

ఉద్యమాలు, ఆందోళనల కారణంగా అటు తెలంగాణాలోనూ, ఇటు రాయలసీమ, ఆంద్ర ప్రాంతాలలోనూ తీవ్ర స్థాయిలో ఆర్ధిక సమస్యలు తలెత్తుతున్నాయి. రాజధానికి ఆంద్ర, సీమ ప్రాంతాల నుంచి రావాల్సిన బిల్లులు రావడం లేదు. అల్లాగే తెలంగాణా ప్రాంతం నుంచి మిగిలిన రెండు ప్రాంతాలకు వెళ్ళాల్సిన బిల్లులు వెళ్ళడం లేదు. ఆంద్ర, సీమ ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు వారాలుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఫలితంగా ఆర్ధిక సంబంధమయిన కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఈ సమ్మె ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు.

వచ్చే నెల జీతాలు ఎలా ఇవ్వాలన్నది ప్రభుత్వానికి ఓ సమస్యగా మారింది. సుమారు అయిదు వేల కోట్ల రూపాయలు వివిధ పన్నులు, చెల్లింపుల రూపంలో ప్రభుత్వానికి ప్రతి నెలా ప్రభుత్వానికి అందవలసి ఉంది. ఆంద్ర ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కారణంగా చెల్లింపులేవీ జరగడం లేదు. హైదరాబాదులో కూడా ఈ రెండు వర్గాల మధ్య సంకుల సమరం జరిగే వాతావరణం నెలకొని ఉంది. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా తలెత్తింది. జీతాల సమస్యతోపాటు వివిధ అభివృద్ధి పనులకు, పథకాలకు డబ్బులు చెల్లించడం వచ్చే నెల నుంచి సాధ్యం కాకపోవచ్చు.

సీమ, ఆంద్ర ప్రాంతాలలో ఎంతలేదన్నా రోజుకు 153 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. తెలంగాణా ప్రాంతం కంటే మిగిలిన రెండు ప్రాంతాలలో వ్యాపారం చాలా ఎక్కువ. ఇక సచివాలయం, విద్యుత్ సౌద, జల సౌధాలలో ఉద్యోగులు లేక, ఉన్నా పని చేయక పనులన్నీ ఆగిపోయి, పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థల లావాదేవీలు దెబ్బతింటున్నాయి. అనేక సాఫ్ట్ వేర్, ఐ టి సంస్థలు ఈ సమ్మె విరమణకు త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడకపోతే బెంగళూరు, చెన్నైలకు వెళ్ళిపోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించాయి.

Send a Comment

Your email address will not be published.