మువ్వల సవ్వడిలో క్షేత్రయ్య పద విన్యాసం!

Kshetrayyaక్షేత్రయ్య అనడంతోనే మువ్వగోపాలుడు అనే మాట తక్షణమే స్ఫురణకు వస్తుంది. క్షేత్రయ్య పదాలు అందుబాటులో ఉన్నవి వందలలోనే ఉన్నా అవి అన్నీనూ హృదయాన్ని హత్తుకునే పదాలే. ఆయన వొట్టి కవి మాత్రమే కాదు. సంగీతంలోను, నృత్యంలోనూ కూడా అందెవేసిన చేయి క్షేత్రయ్యది.

గొప్ప రసికుడైన క్షేత్రయ్య అసలు పేరు మొవ్వా వరదయ్య. అయితే అన్నమయ్యలాగానే ఈయన కూడా అనేక పవిత్ర క్షేత్రాలు సందర్శించి తనకు నచ్చిన పాటలు రాసి అందరి దృష్టిని ఆకర్షించిన క్రమంలో ఆయన అసలు పేరైన వరదయ్య మరుగున పడి “క్షేత్రజ్ఞుడి”గా అనిపించుకున్నాడు. ఆ మాటే కాలక్రమంలో క్షేత్రయ్యగా స్థిరపడి అందరూ ఆయనను క్షేత్రయ్యగా పిలవడం మొదలు పెట్టారు.

ఆయన పుట్టిపెరిగింది కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామం. ఆ ఊళ్ళో వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు స్వయంగా నిర్మించినట్టు చెప్తారు. ఈ ఆలయంలోని వేణుగోపాలుడు అంటే ఆయనకు బహు ఇష్టం. అందుకే తన పదాలలో చాలా చోట్ల మువ్వగోపాలుడు అనే పదప్రయోగం చేస్తూ వచ్చాడు. ఇక్కడో కథ చెప్పుకోవాలి.

క్షేత్రయ్యకు చిన్నప్పటి నుంచీ నృత్యం అంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆయన కూచిపూడిలో ఓ గురువు దగ్గర నాట్యం కూడా నేర్చుకున్నాడు. అనతికాలంలోనే ఆయన నృత్యకళలో మంచి ప్రావీణ్యం గడించాడు. ఆయనకు తన మేనమామ కుమార్తె అయిన రుక్మిణితో పెళ్లి అవుతుంది. కానీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ తనతో కలిసి నృత్యం నేర్చుకున్న మోహనాంగిపైనే ఉండేది. పేరుకు తగినట్టే చక్కని చుక్క అయిన మోహనాంగి అంటే క్షేత్రయ్యకు ఎనలేని ప్రేమ. ఆమెపై మనసు పెంచుకుంటాడు. అంతులేని అనురాగాన్ని చూపిస్తాడు. కానీ దేవదాసి అయిన మోహనాంగి ఆయన అనురాగాన్ని స్వీకరించటానికి ఇష్టపడదు. అయినా అదేదీ పట్టించుకోకుండా క్షేత్రయ్య ఓ రోజు ఆయన తనకున్న ఇష్టాన్ని చెప్తాడు. కానీ మోహనాంగి ఆలోచన వేరేగా ఉండేది. క్షేత్రయ్య తనలోని కళను మువ్వ గోపాలుడికి అంకితం చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఆమె ఆయనకు ఓ షరతు పెడుతుంది. అదేమిటంటే….
“నీకు ఎలాగూ మువ్వగోపాలుడు అంటే చాలా చాలా ఇష్టం కదా….కనుక మువ్వగోపాలుడిపై ఓ నాలుగు పదాలు రాసి చూపించు… అప్పుడే నువ్వు నాపై చూపుతున్న అనురాగాన్ని అంగీకరిస్తాను” అంటుంది.
అయితే క్షేత్రయ్య ఆమె పెట్టిన షరతుకి ఖంగుతింటాడు.

క్షేత్రయ్య ఆమె మీది మనసుతో “అలాగే”నని స్వామీ సమక్షంలో కూర్చుని పాటలు రాయడం మొదలు పెడతాడు. మొదటి రెండు రోజులూ సరిగ్గా రాని ఆలోచనలు మూడవ రోజు నుంచి వేణుగోపాలుడి దయతో రాయడం ఆరంభిస్తాడు. ప్రపంచంలోని జీవాత్మలుగానీ స్త్రీలు కానీ సర్వమూ ఆ మువ్వగోపాలుడే అనుకుని అంతా ఆయన తత్వమే అని క్షేత్రయ్య పదాలు రాస్తూ వస్తాడు. ఆయన రాసే ప్రతి పదంలోనూ భక్తిరసం కనిపించేది. ప్రజల స్వభావాలను బాగా అర్థం చేసుకున్న క్షేత్రయ్య శృంగార రస భావాలను అర్థవంతంగా పండిస్తూ అనేక పదాలు రాసాడు. నాయికా నాయక లక్షణాలను చెప్పుకొచ్చాడు. ఆ పదాలకు ముగ్ధురాలైన మోహనాంగి కూడా మురిసిపోయి వాటికి అనుగుణంగా నృత్యం చేసింది.

శ్రీశైలం మల్లికార్జునుడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తదితరులపై కూడా పదాలు రాసిన క్షేత్రయ్య మొత్తం మీద నాలుగు వేలకు పైగా పాటలు రాసినట్టు తెలుస్తున్నా అందుబాటులో ఉన్నవి మాత్రం మూడు వందలు పైచిలుకు పదాలే.

తమిళనాడులోని తంజావూరు పతనమై గోల్కొండ నవాబుల పరమైంది. ఆ గోల్కొండ నవాబు సైన్యాధిపతి అయిన మీర్ జుమ్లాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. జుమ్లా క్షేత్రయ్యలోని సాహిత్యానికి ముగ్ధుడై తన నవాబు దగ్గరకు తీసుకుపోతాడు. అప్పుడు నవాబు క్షేత్రయ్యను ఎంతో ఘనంగా స్వాగతించి సత్కరించి తన ఆస్థానంలో ఉండమని కోరుతాడు. క్షేత్రయ్య అక్కడి ఆస్థానంలో చాలా కాలమే ఉన్నాడు. ఆ సమయంలో ఆయన దాదాపు పదిహేను వందల పదాలు రాసాడు.

క్షేత్రయ్య నలభై రాగాలలో పదాలు రాసాడు. త్రిపుట తాళంలోనే ఎక్కువ పదాలు రాయడం గమనార్హం. ఆయన పదకవితలు ఎందరినో ఆకట్టుకున్నాయి. క్షేత్రయ్య పదాలు నృత్యానికి సరిపోయేవి. అందుకే ఏ మువ్వలను కదిపినా క్షేత్రయ్య పదాలకు సవ్వడి చేసి అడిగిన వారిని మురిపిస్తాయి. మైమరిపిస్తాయి.

ఆయన నోటంట వెలువడిన వాటిలో మచ్చుకి ఒకటి రెండింటినైనా ఇక్కడ చూద్దాం ….
నీలాంబరి రాగంలో త్రిపుట తాళంలో క్షేత్రయ్య రాసిందే ఈ కింది పదం –

“ఎటువంటి వాడే వాడు ఓ యమ్మా వాడు
ఎన్నడు నీ వీధిని రాదు
కుటిల కుంతలా మువ్వ గోపాలుడట
నల్లని మెనూ వాడట
నయము లెన్నో చేసునట
చల్లగా మాటాడు నట సరసము వాణి సొమ్మట
కల్ల కాదట వాడు కళలంట నేర్చునట ఓ యమ్మావాడు ….”

భైరవి రాగంలో రూపక తాళంలో “అక్క చూడు వీడెంత – అగడు కాడమ్మా” అనే పదంలో …
“ కిన్నెర మీటుకొంటు నన్ను జూచి తన
కన్నుల దెలిసి సన్న సేసి నా
చన్నుల పైకొంగు చక్కదీసి తన
చిన్ని గోర నొక్కి వాడు – చీరి నాడమ్మా …
చేమంతి పూలచెండు చేతికిచ్చి నా
సేవ సేసే నంటు వాడు చేరి కొలిచి నా
మోవి తేనె లివ్వనంటే మ్రొక్కి నాడమ్మా ఉన్న
తావు చూచి వచ్చేనంటు తక్కిడి కాడమ్మా
పొగడ మాని కొనలలోని సొగసు గెలలోని
చిగురు శయ్య మీద నన్ను వగలు చేసేనమ్మా
నగుచు పెరుం దేవి నాయకుండమ్మా
పొగడి పొగడి నన్ను వాడు పొందినాడమ్మా”

ఏదేమైనా క్షేత్రయ్య పదాలు రసవంతం. సాహిత్యం, నృత్యం, సంగీతం ఉన్నంతకాలమూ ఆయన పదాలు చిరంజీవియే. నిత్యస్మరణీయం.
యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.