మూవీ మొఘల్ మరి లేరు

మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు 2015 ఫిబ్రవరి 18వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమారులు హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, కూతురు లక్ష్మి ఉన్నారు. నాగచైతన్య, రానా ఆయన మనవళ్ళే. ఆయన మృతి పట్ల ఆంద్ర పరదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, గవర్నర్ నరసింహన్ లతోపాటు పలువు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

పదిహేను భాషల్లో 150కి పైగా చిత్రాలు సమర్పించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన రామానాయుడు 1936 జూన్ ఆరవ తేదేన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు.

ఆరుగురు హీరోలను, పన్నెండు మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను, పదుల దర్శకులను వెండి తెరకు పరిచయం చేసిన రామానాయుడు ఒకే వ్యక్తిగా శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.

మూవీ మోఘల్ గా వినుతికెక్కిన ఆయనకు సినీ పరిశ్రమలోని 24 ఫ్రేములలోను పట్టు ఉంది.

నిర్మాతగా కొనసాగుతూనే ఎందరో వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచిన రామానాయుడు తన సంపాదనలో అధిక శాతం సినీ రంగానికే ఖర్చు చేసారు.

స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, పంపిణీ, పోస్టర్లు, ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి అవసరమైన సకల సదుపాయాలు సమకూర్చిన రామానాయుడు 1999 లో లోక్ సభకు బాపట్ల నుండి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే తదుపరి ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూసారు.

సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.

రైతు కుటుంబంలో పుట్టిన రామానాయుడు తండ్రి పేరు వెంకటేశ్వర్లు.ఆయనకు ఒక అక్కయ్య, ఒక చెల్లీ ఉన్నారు. ఆయన తన మూడో ఏట తల్లిని కోల్పోయారు. పినతల్లి వద్ద ఎంతో ముద్దుగా పెరిగిన రామానాయుడు బంధువు అయిన బి.బి.ఎల్.సూర్యనారాయణ ఇంట్లో ఉండి స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నారు. ఆ తర్వాత డిగ్రీలో మొదటి ఏడాది పరీక్షలు తప్పడంతో ఆయనను తండ్రి తీసుకువచ్చి చీరాలలోని ఒక కళాశాలలో చేర్పించారు.

ఇద్దరు స్నేహితులతో కలిసి పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ నెలకొల్పారు.

ఆయన 1962 జూన్ 24న కారంచేడు నుండి మద్రాస్ వెళ్లి అనేక చిత్రాలు నిర్మించారు.

ఆయన తీసిన తొలి చిత్రం ‘అనురాగం’. ఇక సురేష్ ప్రొడక్షన్స్ మీద ఆయన తీసిన మొదటి చిత్రం రాముడు భీముడు. 1962 లో ఆయన ఏదో ఒక వ్యాపారం చెయ్యాలనే మద్రాస్ వెళ్ళారు. కానీ ఆయన మస్సుకి ఏ వ్యాపారం కుదరలేదు. అప్పుడు ఆయన సినీ రంగంలోకి దిగాలనుకుని ఆనాటి దర్శకుడు రామినీడు దర్శకత్వంలో నలుగురు మిత్రులతో కలిసి అనురాగం సినిమా తీశారు.

ఆయన తీసిన ద్రోహి సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇలా అన్నారు… “అది ఆడకపోవడం నిజంగా పెద్ద దెబ్బే. అయితే ఫెయిల్యూర్ కి భయపడి పారిపోకుండా ప్రేమ నగర్ చిత్రం ప్రారంభించాను. ఈ చిత్రంతో అటో ఇటో తేలాలని నిర్ణయించుకున్నాను. ఆ చిత్రం పూజనాడే పత్రికల వారికి చెప్పాను. నేను మద్రాసులో ఉండాలా లేక కారంచేడు వెళ్ళిపోవాలా అన్నది ప్రేమ నగర్ జయాపజయాల మీద ఆధారపడి ఉంది. నేను ఆ మాట అనుక్షణం అనుకుంటూనే తీశాను. ప్రేమ నగర్ చాలా పెద్ద హిట్ అయ్యింది. రాముడు భీముడు విజయం నా జీవితంలో తొలి మలుపు. అయితే ప్రేమ నగర్ నన్ను పరిశ్రమలో నిలబెట్టింది. ఆ విజయం తో నేను ఎంత ఆనందించానో అంత భయపడ్డాను. అక్కడి నుంచి ప్రతి చిత్రం నాకో పబ్లిక్ పరీక్షలాగా భావించాను. అలాగే తీశాను…”

విశ్రాంతి అంటే ఆయనకు గిట్టేది కాదు. ఏ పనీ పాటా లేకుండా కూర్చోవడం ఆయనకు నచ్చేది కాదు. కస్టపడి కట్టుకున్న స్టూడియో చూసుకుంటూ సినీ రంగంతోనే ఎక్కువ సమయం గడిపిన ఆయన శత చిత్ర నిర్మాతగా గిన్నిస్ బుక్కులోకి ఎక్కినప్పుడు ఆయన ఇలా అన్నారు…

“శత చిత్ర నిర్మాతగా రికార్డు సృష్టించినంత మాత్రాన నా బాధ్యత తీరిపోలేదు. వృద్ధులకు ఆశ్రమం కట్టించినంత మాత్రాన నా ఆశయాలన్నీ నేరవేరవు. ఇంకా ఎన్నో చెయ్యాల్సి ఉంది” అని.

పద్మభూషణ్ గ్రహీత రామానాయుడు ఖాతాలో ఉత్తమ జాతీయ చిత్ర పురస్కారం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (2010), ఫిల్మ్‌ఫేర్ పురస్కారము తదితర ఎన్నో అవార్డులు ఉన్నాయి.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడికి ప్రార్ధిద్దాం.

Send a Comment

Your email address will not be published.