మెగా స్టార్ కి అరవై వసంతాలు

ఆగస్ట్ 22వ తేదీ….

తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు ఆంధ్రులందరికీ ఈ రోజు ప్రత్యేకమైందని విడిగా చెప్పక్కరలేదు. కారణం, ఈరోజు మన మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆరు పదుల చిరు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి నుంచే మొదలయ్యాయి.

నిన్నమొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా గడిపిన చిరు పుట్టిన రోజును ఘనంగా జరపడానికి కొద్దిరోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. చిరు అభిమానులు రక్త దాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు.

ఇప్పుడా ఎప్పుడా అన్నది చెప్పలేం గానీ చిరు 150వ చిత్రం మాత్రం ప్రజల ముందుకు రాబోతోంది. అందుకు అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. మంచి కథ కోసం చూస్తున్నామని, రచయితలతో చర్చలు సాగుతున్నాయని బుల్లితెరకు ఇచ్చిన ముఖాముఖిలో చిరు స్వయంగా చెప్పుకున్నారు. ఇక దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదని, ముందు పూరీ జగన్నాథ్ అనుకున్నప్పటికీ ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. మీకు బయటి నుంచే కాదు కుటుంబంలో నుంచే అంటే రామ్ చరణ్, బన్నీల నుంచి పోటీ ఎదురవుతోంది కదా అని అడిగినప్పుడు అది ఆరోగ్యకరమైన పోటీయే గా అని చిరు నవ్వుతూ జవాబిచ్చారు.

బాహుబలి దర్శకుడు రాజమౌళి సాహసాన్ని చిరు అన్ని విధాల మెచ్చుకున్నారు. కనీ వినీ ఎరగని భారీ బడ్జెట్ తో బాహుబలి చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించడం యావత్ ఆంధ్రులూ గర్వపడాలని, ఆ చిత్రాని నిర్మాతలు కూడా దొరకడం అదృష్టమని చెప్పారు.

దేశవ్యాప్తంగా వేల అభిమాన సంఘాలున్న చిరు 1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. ప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరు వివాహం 1980లో జరిగింది. చిరు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (రామ్ చరణ్). చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ కూడా వెండితెరకు సుపరిచితులే. ఇక చిరు బావమరిది అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత కాగా చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా హీరో అని వేరేగా చెప్పక్కరలేదు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ “చిరుత” చిత్రంతో టాలీవుడ్ లోకి రంగప్రవేశం చేసారు. ప్రారంభమైంది. అతని రెండవ సినిమా మగధీర.

ఖైదీ సినిమాతో నిలదొక్కుకున్న చిరు తనకంటూ ఉన్న ప్రత్యేక ప్రతిభతో కోట్లాది మంది అభిమానాన్ని పొందారు.

ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించిన చిరు

త్వరలోనే 150వ చిత్రంతో తమ ముందుకొస్తే చూసి ఆనందించాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

చిరు షష్టి పూర్తికి తెలుగుమల్లి శుభాకాంక్షలు.

Send a Comment

Your email address will not be published.