మెల్బోర్న్ యువత - అపూర్వ ఘనత

“మెల్బోర్న్ యువత” నాల్గవ వార్షికోత్సవం ఈ నెల 7 వ తేదీన రోవిల్ సెకండరీ కాలేజీ లో “Discover India ” పేరున అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి షుమారు 500 మంది హాజరై ఎంతో జయప్రదం చేసారు. వీరిలో స్థానిక ఆస్త్రేలియన్ యువతీ యువకులు కూడా వుండటం విశేషం.

“యువత” పేరుతో 2010 వ సంవత్సరంలో 15 మంది భారతీయ సంతతికి చెందిన యూనివర్సిటీ విద్యార్ధులు ముఖ్యంగా తెలుగు పిల్లల నాయకత్వంలో మొట్టమొదటగా ఒక పాటల కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు. వీరిలోనే వివిధ రకాలైన వాద్యాలు వాయించే వారు, పాటలు పాడే వారు, కార్యక్రమం నిర్వహించే వారు ఇలా పలు రకాలుగా వైవిధ్యమున్న కళాకారులు అందరూ కలిసి “Colours of life ” పేరుతో మొదటి కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరిగింది. తలిదండ్రుల ప్రోత్సాహం మరియు ప్రోద్భలంతో వీరు రెండవ సంవత్సరం “Yours lovingly ” అనే సంగీత నృత్య రూపకం వారికి వారె ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని కుటుంబాల్లో జరిగే సంఘటనలు ఆధారంగా ఒక కదాంసాన్ని రూపొందించి ప్రదర్శించి అందరి మన్నలను పొందారు. 2012 లో “Through the Ages ” అన్న పేరుతో మరో నృత్య రూపకాన్ని ప్రదర్శించి మొదట 15 మందితో ప్రారంభమైన “యువత” ఇప్పుడు దాదాపు 43 మంది యువతీ యువకులు సభ్యులుగా చేరారు. వీరిలో చాలామంది ఇంకా విశ్వ విద్యాలయాల్లో చదువుతున్నవారే.

వీరు కార్యక్రమం నిర్వహించే ముందు 6 నెలలు స్క్రిప్ట్ వ్రాయడం, “టాలెంట్ హంట్” పేరుతో క్రొత్త వారిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం, రిహార్సల్స్ చేయడం తో పాటు హాల్ కుదుర్చుకోవటం, సరియైన సాంకేతిక నిపుణులను సంప్రదించి తగు ఏర్పాట్లు చేసుకోవడం, కార్యక్రమ నిర్వహణకు కావలసిని వనరులు డబ్బు సమకూర్చుకోవడం వంటి ఎన్నెన్నో పనులను చేస్తూ ప్రతి ఒక్కరూ కార్యక్రమం విజయవంతమవడానికి ఎంతో కృషి చేస్తారు.

 

ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమ మూలాలలోకి వెళ్తే కధాంశం భారత దేశంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకని వెళ్లి అక్కడి కుటుంబ వ్యవస్థ, ఆప్యాయతలు, బంధాలు అనుబంధాలకు ముగ్దుడై అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటాడు. ఈ ఇతివృత్తం చూస్తె ఇక్కడ పెరిగిన పిల్లలకు భారత దేశం పై ఉన్న మక్కువ అర్ధమౌతుంది.

 

యువత కార్యనిర్వాహక సభ్యులు నీహారిక వల్టాటి, శ్వేత ఘట్టి మరియు భార్గవ్ బొప్ప వారి యొక్క పాటలు నృత్యాలతో ఉర్రూతలూగిస్తూ యువతరానికి స్పూర్తినిస్తున్నారు.  ఈ పాటల నృత్య రూపకాలలలో భాగంగా అన్ని మతాల వారికీ గౌరవ ప్రదమైన సమున్నత స్థానాన్నిచ్చి ఎంతో సమయోచితమైన భాగాలను ఇనుమడింప చేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో తెలుగుమల్లి మీడియా పార్టనర్ గాను మరియు ప్లాటినం స్పాన్సర్ గాను పాలుపంచుకోవడం ఎంతో ముదావహం.

Send a Comment

Your email address will not be published.