మెల్బోర్న్ లో గణేష్ ఉత్సవాలు

నేను పెరిగిన ఊరు, నేను తిరిగిన వీధి, నేను నడచిన గట్టు, నేనెక్కిన చెట్టు, నేను కొట్టిన తేనె పట్టు, నేను చదివిన బడి, నాకు నేర్పిన గురువు, నేను ఈదిన కొలను, నేను కూర్చున్న అరుగు, నేను పాడిన పాట, నేనాడిన ఆట, నన్ను తరిమిన గిత్త, నేను నడిపిన బండి, నేను దున్నిన పొలము, నన్ను మెచ్చిన తాత – ఎన్నెన్ని గత స్మృతులు, తలచుకుంటే కంటినిండా అశ్రువులే!!!

చిన్నప్పటి నుండి కొన్ని ఆచార వ్యవహారాలు, సత్సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు వారి జీవన విధానంలో జీర్ణించుకుపోయాయి. ఆ మట్టి సువాసనలు పరదేశం వచ్చినా వదులుకోలేక మనకున్న వనరుల్లో భావి తరాల వారికి మంచిని పంచుదాం అన్న గొప్ప ఆశయంతో 8 ఏళ్ల క్రితం ఒక ఇంటి గరాజ్ లో అది దేవుడు గణపతి పూజకు శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పట్లో 7 కుటుంబాలు ఈ క్రతువుకు పూనుకొని నిరాడంబరంగా జరిపిన పూజా కార్యక్రమం ఇప్పుడు షుమారు 100 కుటుంబాలు కలిసి చేస్తున్న సంబరంగా మారింది. డేన్డినాంగ్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని మన తెలుగువారు మరియు కొందరు కన్నడిగులు ఈ సంవత్సరం ఎంతో భక్తీ శ్రద్ధలతో ఈ నెల 20వ తేదీన మెల్బోర్న్ లోని నోబుల్ పార్కులో కన్నులపండువుగా జరుపుకున్న వినాయక చతుర్ధి ఉత్సవాలు అత్యంత శోభతో కూడుకున్నవి.

ఈ ప్రక్రియలో పిల్లలకు మన సంస్కృతిని నేర్పించడమే పరమావధి. పిల్లల చేతే అన్ని కార్యక్రమాలు చేయించడం ఇందులోని విశేషం. పతి ఆగమనానికి పరమానంద భరితమైన పార్వతీదేవి సున్నుపిండితో చేసిన చిన్ని గణపతి విగ్రహాలు చిన్నారుల చేతుల మీదుగా ఎన్నెన్ని రూపాలో!. మన దేవుళ్ళు గణపతి, విష్ణువు, రాముడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, శివుడు – ఇలా అందరి ఫోటోలకు రంగులు దిద్దటం మరో సందడి. ప్రతీ చిన్నారుల కళ్ళల్లో ఏదో సాధించామన్న తృప్తి. ఇందులో తెలియకుండానే మన సంస్కృతిపై కలుగుతున్న ఆసక్తి. మనది అన్నది నేర్చుకున్నామన్న సంతోషం.

ఉదయం పది గంటలకు మొదలైన పూజా కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ సాగింది. ఈ పూజా కార్యక్రమం క్రమ పద్ధతిలో కధా వివరణలతో నిర్వహించింది శ్రీ మూర్తి గారు. వారు ఓం సాయి మందిరంలో అర్చకులుగా పని చేస్తారు.

దాదాపు 200 మందికి పైగా విచ్చేసిన భక్త జనావళికి ఉచితంగా భోజనం ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం. దానాలలో అన్ని దానాలకు మించినది అన్నదానం అంటారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చిన వారు శ్రీ మీసాల వెంకటరమణ గారు. భోజనానంతరం చాలామంది చిన్నారులు భరత నాట్యం, కూచిపూడి మొదలైన నృత్యమాలికలతో పాటు దేవాది దేవునిపై భక్తీ పాటలు ఆలపించారు.భరత” నాట్యాలయ వారు ప్రత్యేకంగా వారి విద్యార్ధులచే షుమారు ఒక గంట నృత్య గీతాల కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి నీలిమ గారు వాచస్పతిగా వ్యవహరించారు. ఎంతో చక్కగా సభనలంకరించిన ప్రేక్షకులను వాక్పటిమతో మంత్ర ముగ్దులను చేసారు.
మెల్బోర్న్ నగరంలో తెలుగు వారు పండగ చేసుకుంటున్నారంటే మన ధ్వని బ్రహ్మ శ్రీ మురళి బుడిగె గారు అక్కడ లేకపోతే ఆశ్చర్య పడాల్సిన విషయం. వారు అందించిన సహకారమే ఈ కార్యక్రమ విజయానికి సోపానం.

సాయంత్రం 3 గంటల సమయంలో వినాయకునికి సాదరంగా నిమజ్జనోత్సవం జరిగింది.

Send a Comment

Your email address will not be published.