మెల్బోర్న్ లో బంగారు బతుకమ్మ

“మనది” అనే భావం కలగాలంటే గుండె లోతుల్లో అణగారి వున్న భావాలకు ప్రేరణ కలగాలి. మనం చూసే దృశ్యం గత స్మృతులను స్పురణకు తేవాలి. మనలో అంతర్లీనమైయున్న ఆలోచనలకు ఒక రూపం చూడగలగాలి. చరిత్రాత్మకమైన ఘట్టాలతో ముడిపడి ఉండాలి. మన సాంప్రదాయ విలువలకు పట్టం కట్టాలి. మాతృభూమి మమకారం పొంగిపొరలాలి.భాషా సంస్కృతులు వెల్లివిరయాలి.రాగం, తానం, పల్లవి రసమయం కావాలి.అన్న, తమ్ముడు, అక్క, బావా, అత్త, మామబంధాలు బలపడాలి.తదేక ధ్యానంతో సంయుక్తంగా పనిచేయాలి.తనివితీరా ఆనందించాలి.

ఈ నెల మెల్బోర్న్ నగరంలో రెండు తెలంగాణా సంఘాలు దసరా పర్వదినాలు సందర్భంగా “బతుకమ్మ” పండగని పెద్ద ఎత్తున జరుపుకున్నారు. భారతదేశం నుండి ముఖ్య అతిధులుగా ఆలూరు శాసనసభ సభ్యరాలు శ్రీమతి సునితా రెడ్డి గారు మెల్బోర్న్ తెలంగాణా ఫోరం కార్యక్రమానికి, ప్రముఖ ఆంకర్, నటి, గాయని శ్రీమతి ఉదయ భాను గారు మరియు మోనాష్ సిటీ మేయర్ Cr Paul Klisaris, హోబ్సోన్స్ బే మేయర్ Cr Collen Gates, Cr Jason Price, Cr Sandra Wilson ఆస్ట్రేలియా తెలంగాణా సంఘ కార్యక్రమానికి రావడం జరిగింది. రెండు కార్యక్రమాలు షుమారు 15 నిమిషాల ప్రయాణ దూరంలో వుండడం వలన చాలామందికి రెండు కార్యక్రమాలకు వెళ్లి తిలకించే భాగ్యం కలిగింది. ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం కార్యక్రమం శ్రీమతి ఉదయ భాను గారు స్వయంగా నిర్వహించారు. మెల్బోర్న్ తెలంగాణా ఫోరం కార్యక్రమానికి Marsha Thompson(MP Footscray), Tim Watts(MP Gellibrand) హాజరయ్యారు.

బతుకమ్మ పాటలతో పాటుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

విందు భోజనం:

రెండు కార్యక్రమాలు టిక్కెట్లు లేకుండా ఉచితంగా కార్యక్రమాన్ని నిర్వహించి భోజనం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది.అటాయి సంస్థ వారు స్వయంగా వంటలు చేసి తెలంగాణా వంటల రుచిని భళే పసందుగా చవి చూపించారు.మెల్బోర్న్ తెలంగాణా ఫోరం వారు ఫుడ్ పాక్స్ ఇవ్వడం జరిగింది.

ఉత్తమ బతుకమ్మలు:

ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం వారు మొదటి మూడు ఉత్తమ బతుకమ్మలకు బంగారు, వెండి నాణాలు బహుమతులుగా ఇచ్చారు.బహుమతులు గెలుచుకున్నవారి వివరాలు:

తెలంగాణా ఫోరం:
మొదటి బహుమతి ట్రిప్ టు తాస్మానియా రాణి తౌట్ రెడ్డి
రెండవ బహుమతి ట్రిప్ టు అడిలైడ్ స్వాతి
అటాయి:
మొదటి బహుమతి 3 గ్రాముల బంగారు నాణెం నిర్మల ఉల్పాల
రెండవ బహుమతి 2 గ్రాముల బంగారు నాణెం రచన పెల్లి
మూడవ బహుమతి 1 గ్రాము బంగారు నాణెం మృదుల తోల
మిగిలిన వారందరికీ అటాయి లోగోతో వెండి నాణేలు ఇవ్వడం జరిగింది.

గమనించవలసిన విషయం:

చాలామంది రెండు కార్యక్రమాలకు వెళ్లి ఆనందించడం జరిగిందనడం నిర్వివాదాంశం.అయితే రెండు చోట్లకు వెళ్లి కొంత ఇబ్బంది పడటం – కొంతమంది వ్యక్తం చేయకపోయినా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.వినాలని లేకపోయినా గుసగుసలు మాత్రం వినిపించాయి.ఒకే ఉద్దేశ్యంతో చేసిన కార్యక్రమానికి రెండు వేదికలను ఎన్నుకొని నిర్వహించడం అవసరమా? అంటున్నారు చాలామంది.ఇది నిజంగా కొంతమంది తమ మధ్య ఉన్న విభేదాలకు సంకేతమే కానీ సభ్యుల మనస్తత్వాలకు అనుగుణంగా జరిగింది కాదనేది తేటతెల్లమౌతుంది.వ్యాపారవేత్తలు, మేధావులు,స్థానిక సంస్థలు కూడా ఇదేం విడ్డూరమని ముక్కుమీద వేలు వేసుకుంటున్నాయి.ఇది అనైక్యతకు సంకేతమా?ఆధిపత్య నిరూపణకు మార్గమా?

ఇక్కడ పుట్టి పెరిగిన కొంతమందికి అవగతం కావడం లేదు. “మీరు మాకు నేర్పించేది క్రౌర్యము, కార్పణ్యం, హేళన, క్రోధము” అంటున్నారు. ముందు తరాల వారు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది అందరూ తప్పకుండా గమనించాలి. ప్రపంచంలో అత్యున్నతమైన సత్సాంప్రదాయానికి వారసులం. ఈ సంస్కృతిని నిలబెట్టుకోవాలన్న తపనలో తప్పుటడుగులు వేస్తున్నాం అన్నది గమనార్హం. ప్రజాపక్షం అనుసరించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందడుగు వేసిన పాలక పక్షాలు చరిత్ర పుటల్లో ఎన్నింటినో చూసాం. రెండు పక్షాల నాయకులు పెద్ద మనసు చేసుకుని సభ్యుల మనోభావాలకు అద్దం పట్టే ఒక చారిత్రాత్మిక నిర్ణయంతో ఒకటిగా కాగలరని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.