మెల్బోర్న్ లో బతుకమ్మ ఉయ్యాల

పార్వతీ దేవిని వివిధ రూపాల్లో వివిధ దశల్లో భారత దేశమంతటా ముఖ్యంగా మన ఆంధ్ర ప్రదేశ్ లో భక్తి పారవశ్యంతో శక్తి కొలదీ పూజలు చేయడం వేల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం. ఉత్తరాంధ్రలో గౌరమ్మ పండగలు చేసినట్లే తెలంగాణా ప్రాంతంలో “బతుకమ్మ” ఒక ప్రశస్థమైన పండగ. ఈ పండగకు చారిత్రాత్మకంగా పురాణ ఇతిహాసాల్లో ఎన్నో కధలు వున్నా పర్యావరణ పరిశుద్ధత కోణంలో చూస్తే ఈ పండగకు మంచి విశిష్టత ఉందనిపిస్తోంది.

సాధారణంగా పల్లెల్లో ఎక్కువుగా లోతు లేని చెరువులు, కుంటలు వుండి వుంటాయి. అయితే జూన్, జూలై నెలల్లో తొలకరి వానలు కురియడంతో ఇవన్నీ నిండిపోతుంటాయి. ఈ నీరు ఎక్కువ కాలం అంటే షుమారు 3 నెలలు నిల్వ ఉండటంతో అంటువ్యాధులు ప్రభలటం, కలరా మరియు మలేరియా వంటి మహమ్మారి వ్యాధులు రావడం పరిపాటి అయింది. దీనితో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వ్యాధులకు గురై అస్వస్థత పాలవడం మరికొంత మంది చనిపోవడం జరుగుతుండేది.

అయితే తెలంగాణా ప్రాంతంలో వున్న ఎంతోమంది ఆయుర్వేద పండితులు ఈ మహామ్మరీలకు కారణాన్ని కనుగొని కుంటలు, చెరువులలో నిల్వ వున్న నీటిలోని విషపూరితమైన క్రిమికీటకాదులను చంపడానికి కొన్ని రకాలైన ఔషధ గుణాలున్న పుష్పాలను నీటిలో వేయడం ప్రారంభించారు. ఈ కారణంగా బాక్టీరియా చనిపోయి నీరు శుద్ధి జరుగుతుంది. కాలానుగుణంగా ఈ ప్రక్రియ దసరా పండుగ రోజుల్లో రావడంతో ఒక హైందవ సంప్రదాయంగా రూపు దిద్దుకుంది. భారత దేశంలో దైవ సంబంధమైన పనికి ఎక్కువ ప్రాముఖ్యత నివ్వడం కాలక్రమేణ అది ఒక ఆచార సంప్రదాయాల్లో భాగం కావడం తరతరాల నుండి వస్తున్నదే. ఇలా ఈ బతుకమ్మ పండగ హిందూ పండగలలో అతి ముఖ్యమైన పండగ దసరాకు ఆపాదించడం జరిగిందని అనుకోవచ్చు.

ఈ ఉత్సవానికి వాడే పూలల్లో గునుక, తంగేడి, గుమ్మడి, బీర, కట్ల మొదలైన రకాల పూలు వుంటాయి. ఈ పూలతో కిరీటాకృతిలో “బతుకమ్మ” ను తయారుచేసి ఇంట్లోని స్త్రీలు జానపదాలు పాడుతూ చుట్టూ నృత్యం చేయడం ఒక ఆనవాయితీ. ఈ పండుగకు ముఖ్యంగా ఇంటి ఆడపడుచులను పిలుపు చేసి తీసుకురావడం వారికి విభవము కొలది మర్యాదలు చేయడం గొప్ప సంప్రదాయం.

ఈ కోవలోనే రోగనివారణ శక్తి గలిగిన సమతుల్య పౌష్టికాహారం తయారుచేసి ఇంట్లోని వారందరూ కలిసి సద్దుల ఫలహారం సేవిస్తారు. ఈ ఫలహరంలో ముఖ్యంగా బియ్యం, పెసర పిండి, దోస ముక్క, నువ్వుల పిండి మొదలైన వాటితో చేసిన పొడులు నేతిలో వేయిస్తారు.

ఈ బతుకమ్మ పండగ ప్రపంచీకరణలో భాగంగా ఎల్లలు దాటి మెల్బోర్న్ నగరంలోని బ్రూక్లిన్ లో ఈ నెల 6వ తేదీన మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్వర్యంలో షుమారు 700 మంది తెలుగు వారు సాంప్రదాయ బద్ధంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా శ్రీ తెలంగాణ ప్రకాష్ గారు భారత దేశం నుండి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఇటువంటి సంబరాలు విదేశాల్లో జరగడం ఎంతో అభిలషనీయమన్నారు.

తెలంగాణా ఫోరం అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున మెల్బోర్న్ లో ఈ పండగ జరగడం ఇదే మొదటిసారని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన స్పాన్సర్స్ మరియు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

https://www.youtube.com/watch?feature=player_embedded&v=vByKFLOJFRY#t=29

1 Comment

  1. Dear,
    Mr. Rao Gaaru Namasthe Thank you for your support as our MTF Media Partner to do big success and Great (The Festival of flowers) Bathukamma Event on Sunday 6th October 2013 in Melbourne City organized by Melbourne Telangana Forum Inc., Our MTF Team Members sincerely Appreciate your high quality published news about our Telangana Telugu cultural Bathukamma Event message to Telugu and other community People in Telugumalli.com , Thank you Again sir.
    Regards,
    Venkateshwar Reddy Nookala President, Melbourne Telangana Forum Inc,

Send a Comment

Your email address will not be published.