మెల్బోర్న్ లో సంక్రాంతి

కార్యక్రమం చేయాలంటే భాష రానక్కర్లేదు. అభిమానం ఉంటే చాలు. మన సంస్కృతీ పట్ల అవగాహన ఉండాలి. మనది అని ఆలింగనం చేసుకోవాలి. ‘మనం’ అన్న బంధం పెరగాలి. మాతృ భూమిపై మమకారం ఉండాలి. కన్న తల్లి పేగు బంధం స్ఫురణకు రావాలి. కార్య దీక్ష ఉండాలి. కార్యోన్ముఖులు కావాలి. మేధో మధనంతో కదం త్రోక్కాలి.

భిన్నమైన కధనం…
1970 లో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వలస రావడంతో షుమారు 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడే చదువుకొని స్థిరపడ్డారు శ్రీమతి భారతి సుసర్ల గారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సీత మరియు భగవంతం దశిక గార్లు. మెల్బోర్న్ నగరంలో వీరిని ఎరుగని వారుండరు.

భారతి గారు పేరుని సార్ధకం చేసుకుంటూ పలుమార్లు తల్లిదండ్రులతో పాటు భారత దేశం వెళ్లి రావడం జరిగింది. భారతీయత పట్ల అనన్యమైన అభిమానం. భారతీయ సంగీతం అంటే చెవి కోసుకుంటారు. స్వయంగా తెలుగు, హిందీ పాటలు పాడతారు. తనతో పాటు పిల్లలకు కూడా సంగీతం నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు.

సంక్రాంతి సమయంలో ఒకమారు భారత దేశం వెళ్లి వారి స్వగ్రామంలో ఈ సంబరాన్ని తిలకించి ఒక అపురూప ఘట్టంగా అనుభూతి చెంది అప్పటి నుండి గత 20 ఏళ్లుగా వరుస తప్పకుండా ప్రతీ ఏట వారి ఇంట్లోనే బొమ్మల కొలువు ఏర్పాటు చేసి తెలిసిన కుటుంబాల నందరినీ ఆహ్వానించి రెండు రోజులు పాటు తెలుగువారి సంస్కృతిని తు.చ. తప్పకుండా సంక్రాంతి పండగను జరుపుకుంటూ వచ్చారు. ఆదరణ ఎక్కువై పిల్లలకు కూడా అవగాహన కలగాలనే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం కొంతమంది సన్నిహిత కుటుంబాలతో కలిసి గత మూడు నెలలుగా ప్రణాళికలు తయారు చేసుకొని ఒక హాలునే అద్దెకు తీసుకొని సంక్రాంతి కార్యక్రమం రెండు రోజులు నిర్వహించారు. షుమారు 150 మంది వచ్చిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

ఇక ముందు…
ముందు ముందు ఈ కార్యక్రమం మెల్బోర్న్ నగరంలోని తెలుగువారందరూ కలిసి చేసుకునే కార్యక్రమంగా తీర్చి దిద్దాలని ఊహా రచనలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన ఆలోచన తనదైనా కార్యరూపం దాల్చడానికి చాలామంది కృషి చేసారని వారందరికీ ఫలితార్ధం చెందుతుందనీ శ్రీమతి భారతి గారు చెప్పారు. వీరిలో ముఖ్యులు:

శ్రీమతి రమణి బొమ్మకంటి, శ్రీమతి విజయ మాగంటి, శ్రీమతి శిరీష్ దురానీ, శ్రీమతి భానుశ్రీ ఎల్లాప్రగడ, శ్రీమతి సత్య అన్నవరపు, శ్రీమతి లక్ష్మి పేరి, శ్రీమతి శిరీష సుసర్ల, శ్రీమతి రేణుక తెన్నేటి మరియు శ్రీమతి విజయ లక్ష్మి.

పిల్లల కార్యక్రమం…
ముందుగా చాలా మంది పిల్లలు వారు నేర్చుకున్న పాటలు, నృత్యాలు – ఇలా వారికి తెలిసిన బాణీల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతికే శోభ తెచ్చారు. సంక్రాంతి అనగానే రధం ముగ్గులు గుర్తుకురావడం కద్దు. చాలా మంది పిల్లలు ముగ్గులు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. పిల్లలందరూ బొమ్మలు కొలువు తీర్చిదిద్దటంలో మంచి ప్రావీణ్యం చూపించారు.

కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలలకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అభినందనీయం. దీని ద్వారా ఒక సంస్కృతికి ఆయుర్దాయం పెరిగినట్లౌతుంది. పిల్లలు మనం చెప్పే మాటలు వినకపోయినా మనం చేసే పనులు అనుకరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మన సంస్కృతికి అద్దం పట్టే పండగలు నిర్వహించాలి.

గానా భాజానా…
పసందైన విందు భోజనం తరువాత పిల్లలు పెద్దలు అందరూ పాటలు పాడటం, కవితలు చెప్పడం జరిగింది.

సాధారణంగా జనవరి నెలలో ఇక్కడ వేసవి సెలవులు కారణంగా చాలా మంది భారత దేశం కానీ విహార యాత్రలకు గానీ వెళ్ళడం మూలాన సంక్రాంతి పండగకు ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఎడారిలో వయసిస్సులా శ్రీమతి భారతి గారి బృందం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టం గట్టి బహుళ సంస్కృతులకు పెద్ద పీట వేసే ఆస్ట్రేలియా దేశంలో మన బావుటాని ఎగురవేయడం చాలా ముచ్చటగా వుంది.

ఈ కార్యక్రమ నిర్వహణకు చాలామంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చేయూతనిచ్చారు.  వారందరికీ పేరు పేరునా శ్రీమతి భారతి గారు సంక్రాంతి బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.

 

Send a Comment

Your email address will not be published.