మొహమ్మద్ రఫీ...

మొహమ్మద్ రఫీ పూర్వీకులు ఇప్పటి పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన వారు.

మొహమ్మద్ రఫీ 1924 డిసెంబర్ 24న అమృత్సర్ జిల్లాలోని సుల్తాన్ సింగ్ అనే చిన్న పల్లెలో పుట్టారు.

మొహమ్మద్ రఫీ తండ్రి హాజీ అలీ మొహమ్మద్. తల్లి అలా రాఖీ.

మొహమ్మద్ రఫీ నిక్ నేం ఫీకో.

మొహమ్మద్ రఫీ తన పల్లెలో ఒక ఫకీరు పాడుతున్న పాటలను విని అతనిలాగానే పాడుతుండేవారు.

మొహమ్మద్ రఫీ కుటుంబానికి లాహోర్ లో ఓ సెలూన్ ఉండేది.

మొహమ్మద్ రఫీలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినది ఆయన అత్యంత సమీప బంధువు హమీద్.

మొహమ్మద్ రఫీ తన పదమూడో ఏట మొదటిసారిగా ఒక బహిరంగ కార్యక్రమంలో పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ఆయన పాడేందుకు అవకాశం ఇచ్చిన ప్రముఖ గాయకులు కె ఎల్ సైగల్.

మొహమ్మద్ రఫీ 1948 లో సన్ సునే ఆయే దునియా వాలన్ బాపూజీ కీ అమర్ కహానీ…… అని ఒక పాట పాడారు. ఈ పాటను రాజేంద్ర క్రిషన్ రాసారు. అది అప్పట్లో సూపర్ హిట్టైంది. భారత దేశపు ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొహమ్మద్ రఫీని తమ నివాసానికి పిలిపించుకుని ఆ పాట పాడించుకున్నారు.

మొహమ్మద్ రఫీ 1975 లో కాబూల్ సందర్శించి అక్కడ కొన్ని ఫార్సీ సోలో పాటలు, యుగళ గీతాలు పాడారు. యుగళ గీతాలను ఆయన ఆఫ్గనిస్తాన్ గాయకురాలు జిల్లాతో కలిసి పాడారు.

గాయకుడు కిశోర్ కుమార్ పై సంజయ్ గాంధి కి ఒకసారి కోపం వచ్చింది. అప్పుడు మొహమ్మద్ రఫీ కిశోర్ కుమార్ ని తనతో సంజయ్ గాంధి ఇంటికి తీసుకు వెళ్లి ఈసారికి ఆయనను మన్నించండి అని అడిగారు. అప్పటికి గానీ సంజయ్ గాంధీ కోపం తగ్గలేదట.

మొహమ్మద్ రఫీ మరణించినప్పుడు కిషోర్ కుమార్ రఫీ పాదాల దగ్గర కూర్చుని గంటల తరబడి ఓ పిల్లాడిలా ఏడ్చారు. అప్పుడు ఆయనను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదట.

మొహమ్మద్ రఫీ ఒక బీద విధవరాలికి అనేక సంవత్సరాలు మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పంపుతుండే వారు. అయితే ఆ డబ్బులు తనకు పంపుతున్నది మొహమ్మద్ రఫీ అనే విషయం ఆ పేదరాలికి ఆయన మరణించిన తర్వాత గానీ తెలియలేదట. ఆయన మరణించినప్పుడు తర్వాతి నెలలో ఆమెకు మనీ ఆర్డర్ రాకపోవడంతో ఆమె పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి తనకు డబ్బులు ఎందుకురాలేదని, ఎవరు పంపుతున్నారని వాకబు చేయగా అప్పుడు అక్కడున్న సిబ్బంది చెప్పారట ఆమెతో “మీకు ఆ డబ్బులు నెల నెలా పంపుతున్నది మొహమ్మద్ రఫీ అని” అనగానే ఆమె విస్తుపోయింది.

సంగీత దర్శకుడు నిసార్ వాజ్మీ తన కోసం ఒక పాట పాడమంటే అప్పుడు మొహమ్మద్ రఫీ కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకుని పాడారట.

శివ సేన బాల థాకరే సోదరుడు అయిన కీర్తిశేషులు శ్రీకాంత్ థాకరే సంగీత దర్శకత్వంలో 1974 – 1980 సంవత్సరాల మధ్య మరాటీ కాని మరో భాషా చిత్రాల్లో రఫీ కొన్ని పాటలు పాడారు.

మొహమ్మద్ రఫీ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ వద్ద ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లిష్ లోనూ రెండు పాటలు పాడారు. ఒకటి – ఆల్దో ఉయ్ హైల్. రెండు – షీ ఐ లవ్ .

మొహమ్మద్ రఫీ వివిధ పాటల ద్వారా 517 భిన్నమైన మూడ్స్ ని వ్యక్తం చేసారు.

మొహమ్మద్ రఫీ పాటలంటే భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి చాల ఇష్టం. రఫీ పాడిన “మెయిన్ జిందగీ కా సాత్ నిభాతా చల్ గయా” పాట మన్మోహన్ సింగ్ కి చాలా చాలా ఇష్టం.ఒక సారి ఈ పాటను ఆయన లోక్ సభలో ప్రస్తావించారు కూడా.

లాహోరు రేడియో స్టేషన్ లో మొహమ్మద్ రఫీ గజల్ పాడటంతో గాయకుడిగా ఆయన కెరీర్ మొదలైంది.

మొహమ్మద్ రఫీ 1941 ఫిబ్రవరి 28న తొలి సినిమా పాట పాడారు. గుల్ బలోచ్ అనే పంజాబీ చిత్రంలో శ్యాం సుందర్ సంగీత దర్శకత్వంలో జీనత్ బేగం తో కలిసి ఆ పాట పాడారు. సోణీయే నీ, హీరియే నీ, తేరీ యాద్ నే సతాయా అనేదే ఆయన పాడిన మొదటి పాట.

జుగ్నూ(1947), సమాజ్ కో బాదల్ దాలో (1947) సినిమాల్లో ఆయన నటించారు.

మొహమ్మద్ రఫీ హిందీ, ఉర్దూ, సింధీ, పంజాబీ, మరాటీ, బెంగాలీ, కొంకణీ, గుజరాతీ, అస్సామీ, ఒరియా, తెలుగు, కన్నడం, తదితర భాషల్లో పాటలు పాడారు.

మొహమ్మద్ రఫీకి 20 ఏళ్ళ వయస్సులో నూర్ బానో తో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఆమె తన పేరును బిల్కిస్ రఫీగా మార్చుకున్నారు. రఫీ భార్య 1998 మార్చి నాలుగో తేదీన మరణించారు. రఫీ దంపతులకు నలుగురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు.

మొహమ్మద్ రఫీ భోజనప్రియుడు. వేపుడు కూరలు ఎక్కువగా తినే వారు. తీపి పదార్ధాలు అంటే ఇష్టంగా తినే వారు. మద్యపానం తాగటం, పొగ తాగటం, కిళ్ళీ వేసుకోవటం వంటి అలవాట్లు ఆయనకు లేవు.

మొహమ్మద్ రఫీ 25 సంవత్సరాలపాటు మధుమేహంతో బాధ పడ్డారు.

మొహమ్మద్ రఫీ చాలా నిరాడంబరంగా ఉండే వారు. క్రీమ్ రంగు చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకుని చాలా చాలా సాదాసీదాగా ఉండేవారు.

మొహమ్మద్ రఫీ లతా మంగేష్కర్ తో కలిసి 440 పాటలు పాడారు.

మొహమ్మద్ రఫీ దాదాపు అయిదు వేల సినిమా పాటలు పాడారు.

1980 జూలై 31బ తేదీ ఉదయం మా కాళీ (బెంగాలీ భజన్) రిహార్సల్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆరోజు రాత్రి 10.10 గంటలకు తుది శ్వాస విడిచారు.

సేకరణ – యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.