మోడీ ప్రభంజనం

1984 సంవత్సరం ఇందిరా గాంధీ హత్యకు గురైన తరువాత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 411 స్థానాలను కైవసం చేసుకొని ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన రీతిలో శ్రీ నరేంద్ర మోడీ సరిగ్గా 30 సంవత్సరాల తరువాత విజయ దుందుభి మ్రోగించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ను గెలిపించారు.  ఈ ఫలితాలు రాక ముందు నుండే చాలా ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నా ఇంతటి ఆధిక్యం వస్తుందని ఎక్కువ మంది ఊహించలేదు.

పరిపాలనా దక్షత కలిగి స్వప్రయోజనాలకు తావు లేకుండా స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చి దిద్ది మంచి పేరుని సంపాదించిన శ్రీ మోడీ హస్తినాపురంలో తన బాణీని కొనసాగిస్తారా?  రాష్ట్ర పరిపాలనకీ దేశ పరిపాలనకీ చాలా తేడా వుంటుంది.  రెండు విభిన్నమైన పరిస్థితులు.  అయితే భారత వోటర్లు అనూహ్యమైన రీతిలో భారతీయ జనతా పార్టీకి స్వతహాగా తన కాళ్ళపై నిలబడేట్టు ద్రుఢమైన గెలుపుని అందివ్వడం ద్వారా తగినంత శక్తినిచ్చి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలకు ఎవరిపైనా ఆధారపడనవసరం లేదు.

కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకుపోయింది.  పదవీ వ్యామోహం, సుపుత్ర పట్టాభిషేకం, ఆత్మ వంచన, అధికార వాంఛ ఇత్యాది ఆలోచనలకు పాలుపోసి ప్రజా శ్రేయస్సును మరచిపోయిన ప్రతీ పార్టీ ఈ విధమైన రుచినే చవి చూసిందని రామాయణ, మహాభారత కాలం నాటి నుండి చదువుకున్నవే, వింటున్నవే.  గత పది సంవత్సరాలుగా స్కాములు మీద స్కాములతో కాంగ్రెస్ పార్టీ వందిమాగధులను రక్షించుకుంటూ దేశ పురోభివృద్ధికి తిలోదకాలిచ్చింది.  వంద సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఒక జాతీయ పార్టీకి ఇంతటి దుర్గతి పట్టిందంటే పార్టీ అధినాయకత్వం, అందులోని సన్నిహిత సలహాదారులు ఎంతటి ఘనులో చెప్పొచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ ని  రెండు రాష్ట్రాలుగా విడగొట్టి లబ్ది పొందాలన్న దురాశ సీమంధ్రలో అటు లోక్ సభకి గానీ ఇటు అసెంబ్లీకి గానీ ఒక్క సీటు కూడా దక్కకుండా పోవడానికి దారితీసింది. “తెలుగుమల్లి” లో గత వారం వ్రాసిన ఈ సంగతి అక్షరాలా నిజమైంది.  తెలంగాణాలో అంతంత మాత్రమే.  వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంతటి దుస్థితికి దిగజారడానికి కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదు.  ప్రజా ప్రయోజనాలను పట్టించుకోని ఎంతటి గొప్ప సంస్థ గానీ వ్యవస్థ గానీ ఇదే గతి పడుతుంది.

Send a Comment

Your email address will not be published.