మ్యాచ్ ఫిక్సింగా?

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య క్విడ్ ప్రో కో జరిగిందని, అందుకనే ఆయనకు అక్రమాస్తుల కేసులో బెయిలు లభించిందని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. సీబీఇ అకస్మాత్తుగా మాట మార్చడానికి, ఎనిమిది క్విడ్ ప్రో కో కేసుల్లో సాక్ష్యాలు లభించలేదని చెప్పడానికి రాజకీయ కారణాలున్నాయని తెలుగుదేశం పార్టీతో సహా వివిధ పార్టీలు విమర్శలకు దిగాయి. అక్రమాస్తుల కేసులో సుమారు 16 నెలలుగా చంచల్ గూడా జెయిలులో ఉన్న జగన్ నిన్ననే బెయిలు మీద విడుదల అయ్యారు.

రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత రాష్ట్రంలో అధ్వాన పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా రాష్ట్ర సమితితోనూ, సీమాంధ్రలో జగన్ నాయకత్వంలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపి 2014 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీతో చేతులు కలపడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సిద్ధపడడంతో, కాంగ్రెస్ తన కొత్త వ్యూహానికి తెర తీసిందని సమాచారం. ఆయనను బెయిలుపై విడుదల చేయించిన తరువాత ఆయన తమ ఆలోచనకు తగ్గట్టుగా నడుచుకునేలా కాంగ్రెస్స్ కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఆయన మీద రెండు కేసులను మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంచింది. ఆయన తమ ఆలోచనకు తగ్గట్టుగా నడచుకోని పక్షంలో అంటే తమతో చేతులు కలపని పక్షంలో ఆ రెండు కేసుల కింద మళ్ళీ అరెస్ట్ చేయించే అవకాశం ఉంది. “ఆయన దారికి రాకపోతే ఈసారి తీహార్ జేయిలుకి వెళ్ళడం ఖాయం” అని సీనియర్ నాయకుడొకరు చెప్పారు.

ఆయన విడుదలకు అయిదు రోజులకు ముందు కూడా “ఆయనను విడుదల చేస్తే తన పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పిన సీబీఇ అకస్మాత్తుగా మాట మార్చి, క్విడ్ ప్రో కో జరిగిందని చెప్పడానికి సాక్ష్యాలు లేవని సీబీఇ కోర్టుకు చెప్పడం వింతగా ఉంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ, కోస్తా ఆంద్ర ప్రాంతాల్లో 18 స్థానాలకు ఇటీవలి కాలంలో ఉప ఎన్నికలు జరగగా, అందులో 15 స్థానాలను జగన్ పార్టీ చేజిక్కించుకుంది. ఆ పార్టీ ఇక సమైక్య ఆంద్ర ఉద్యమానికి నాయకత్వం వహించబోతోంది. ఆయన పార్టీకి సీమలోనూ, ఆంధ్రలోనూ ఇప్పటికీ బలం ఉన్న విషయాన్ని గమనించి కాంగ్రెస్ ఆయనతో చేతులు కలపడానికి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తండ్రి రాజశేఖర రెడ్డి మాదిరిగానే జగన్ కి కూడా తెలంగాణా ఉద్యమాన్ని నీరు కార్చే సత్తా ఉందని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.