తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న యాదగిరి గుట్టను తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గట్టి పట్టుదలతో ఉన్నారు. రెండు రోజుల క్రితం యాదగిరి గుట్ట నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించడానికి వెళ్ళిన కేసీఆర్ అక్కడి అధికారులతో, అర్చకులతో ఇదే విషయమై చర్చించారు. నరసింహ స్వామి క్షేత్రాన్ని ఆనుకునే ఉన్న మరో రెండు గుట్టలను కూడా కలుపుకుని ఈ గుట్టను విస్తరించాలని, చుట్టూ పక్కల చెరువులను కూడా క్షేత్ర పరిధిలోకి తీసుకు రావాలని ఆయన భావిస్తున్నారు. ఇవన్నీ కలిపితే యాదగిరి గుట్ట కింద మరో రెండు వేల ఎకరాలు చేరే అవకాశం ఉంది. ఇందులో నాలుగు వందల ఎకరాల్లో నరసింహ స్వామి అభయారణ్యాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరి గుట్టకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన ఆలోచిస్తున్నారు. మూడేళ్ళలో దీని టెంపుల్ సిటీగా మార్చడం జరుగుతుంది.
బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్ళడం ఆనవాయితీ అవుతుంది. అంతే కాదు, గోపురం ఎత్తు పెంచి, బంగారంతో తాపడం చేయించడానికి కూడా ఆయన ఏర్పాట్లు ప్రారంభించారు.