రంగనాథ్ ఆత్మహత్య

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు రంగనాధ్ ఇక లేరు. ఆయన హైదరాబాద్ లోని కవాడిగూడ లో నివాసం ఉంటున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. 300పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నలు పొందిన రంగనాథ్ మానసికవేదనతో బలవన్మరణం పొందటం అందరినీ కలచి వేసింది.

1949లో చెన్నైలో పుట్టిన రంగనాధ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్‌. ఆయనకు ఒక కుమారుడు (నాగేందర్), ఇద్దరు కుమార్తెలు (నీరజ, శైలజ) ఉన్నారు. .

భార్య చైతన్యకుమారి ఆరేళ్ళ క్రితం మరణించినప్పటి నుంచి రంగనాధ్ మానసిక వ్యధకు లోనయ్యారు. భార్య గాయపడి నడుం విరిగి, కాళ్ళు చచ్చుబడిపోయి దాదాపు పద్నాలుగేళ్ళు మంచానికే పరిమితమైనప్పుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్న రంగనాధ్ ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక ఎంతగానో కృంగిపోయారు. ఆ మానసిక వ్యధే ఆయనను తుదకు ఈ లోకం నుంచి దూరం చేసింది.

ఆయన తొలుత రైల్వే లో కొంతకాలం టికెట్ కలెక్టర్ గా పని చేశారు. అయితే నటన మీద మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన నటుడిగా స్థిరపడ్డారు. ఆయన 1969 లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన మొదటి చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన “బుద్ధిమంతుడు” చిత్రం. ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం చందన. అది 1974 లో వచ్చింది. ఆయన జమీందారుగారి అమ్మాయి, దేవతలారా దీవించడి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందమె ఆనందం , చిరంజీవి , అడవి దొంగ , వేట, ముగ్గురు మొనగాళ్ళు , కలిసుందాం రా..ప్రేమంటే ఇదేరా,మన్మధుడు , నిజం తదితర చిత్రాలలో నటించారు.

ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన భాగవతంలో నటించడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైన రంగనాధ్ మరి కొన్ని సీరియల్స్ కూడా నటించారు.

మొగుడ్స్ – పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన రంగనాధ్ ఎన్నో కవితలు కూడా రాసారు.
ప్రాధమిక స్కూల్ లో చదువుతున్న రోజుల్లో తెలుగు మాస్టారు ఓ రోజు శబ్దాలంకారంలో పోతన రాసిన ఒక పద్యాన్ని వివరించి చెప్పిన తీరుకు ముగ్ధుడై రంగనాధ్ పద్యాలు రాయడం, కవితలు రాయడం అలవరచుకున్నారు. ఆయన కొన్ని గేయాలు, కథలూ కూడా రాశారు.  వారు వ్రాసిన కవిత ఇక్కడ ఒకటి ప్రచురిస్తున్నాం.

రంగనాధ్ కు అక్కినేని గారంటే యెనలేని గౌరవం. తనను అక్కినేని అభిమానిగా చెప్పుకునే రంగనాథ్ జీవితం అర్ధంతరంగా ఆత్మహత్యతో ముగియడం విషాదకరం.

అందరికీ తలలో నాలుకలా ఉండే రంగనాధ్ తాను ఉంటున్న ఇంట్లోని గదుల్లో డెస్టినీ, డోంట్ ట్రబుల్ హర్ , ఆమెకు ఇవ్వాల్సిన బాండ్స్ ఎక్కడ ఉన్నాయో, ఆమె బ్యాంక్ ఖాతా వంటివి (పనిమనిషి మీనాక్షిని ఉద్దేశించి రాశారు) రాయడం గమనార్హం. పైగా ఒక మిత్రుడికి గుడ్ బై అని ఒక సందేశం ఇచ్చారు. అంతేకాదు, రంగనాధ్ కు మరి కొన్ని గంటల్లో సన్మానం జరగాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నవేళ ఆయన వంట గదిలో కొక్కానికి ఉరి వేసుకుని చనిపోవడం ఊహించని పరిణామం.

ఆయన మృతి పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు టాలీవుడ్ పరిశ్రమకు చెందినా పలువురు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

Send a Comment

Your email address will not be published.