రమేష్ నాయుడు తీరు..

చివరి వరకు తనకు సంగీతం రాదని చెప్పుకున్న సంగీత దర్శకులు రమేష్ నాయుడు.

ఆయన చిన్నతనంలో ఏ ఉద్దేశంతో ముంబైకి వెళ్ళిపోయారో తెలీదు. ప్రఖ్యాత హిందీ నటుడు, నిర్మాత, దర్శకుడు కిషోర్ సాహు రమేష్ నాయుడికి మున్ముందుగా అవకాశం ఇచ్చారు. 1954 లో  వచ్చిన హేమ్లెట్ తన సినిమాకు  కిషోర్ సాహు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పాటలు రికార్డు అవుతుండగానే కొత్త సంగీత దర్శకుని  (రమేష్ నాయుడు)  ప్రజ్ఞా పాటవాలు పైకి  పొక్కి అమీయ చక్రవర్తిలాంటి వాళ్ళు అతన్ని బుక్ చేకున్నారు. కానీ రమేష్ నాయుడు సంగీత దర్శకత్వానికి పురిట్లోనే అనుకోని బ్రేక్ పడింది. ఆ చిత్రం విడుదల కావడం, వచ్చినట్లు జనానికి తెలిసే లోగా ఆ సినిమాను  ఎత్తేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత తన అనారోగ్య కారణం చేత బుక్ అయిన చిత్రాలనుంచి కూడా రమేష్ నాయుడు తప్పుకోవలసి వచ్చింది.

తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా ఘంటసాలను పరిచయం చేసిన  అభినేత్రి, నిర్మాత సి కృష్ణవేణి రమేష్ నాయుడిని తన దాంపత్యం చిత్రానికి సంగీత దర్శకత్వం అవకాశం ఇచ్చి టాలీవుడ్ కి పరిచయం చేసారు.  ఆ సినిమా 1957 లో వచ్చింది. ఈ చిత్రంలో ఆరుద్ర పాటలు రాసారు. వాటికి రమేష్ నాయుడు తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేలాంటి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఆయన కృషి, శ్రమ ప్రజానీకానికి తెలియకపోయినా పరశ్రమకు తెలిసింది. ఈ  చిత్రం తర్వాత మరో రెండు మూడు సినిమాలకు సంగీతం సమకూర్చిన రమేష్ నాయుడు దాదాపు దశాబ్ద కాలం ఎవరికీ కనిపించలేదు.

ఆ తర్వాత ఆయనకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చిన చిత్రం అమ్మ మాట. అది 1971 లో వచ్చిన సినిమా. ఆయన స్వరపరచిన పాటలలో  చాలా వరకు గుర్తుండి పోయేవే. అందులో అనుమానం లేదు.

పాట సాహిత్యం విన్న వారికి వెంటనే తెలియాలని, పాటలోని భావం సంగీతం ద్వారా వెంటనే తెలియాలన్నది రమేష్ నాయుడు అభిమతం. అంతేతప్ప ఫలానా రాగం, ఫలానా తాళం వంటి  క్లిష్టమైన సంగతి ఆయనకు ముఖ్యం కావు. పాటలోని సన్నివేశం రంగు ప్రేక్షకులకు తెలియాలి అనే ధోరణిలోనే ఆయన సంగీత ప్రపంచం సాగింది.

Send a Comment

Your email address will not be published.