రసమయమైన రాగామృతం

భారతీయ సంప్రదాయంలోని అన్ని కళల లాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల మరియు పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.

ఇటువంటి ప్రశస్థమైన భారతీయ సంగీతాన్ని మనకున్న పరిధిలో పరిరక్షించు కోవడమే కాకుండా భావితరాలకు అందించాలన్న భావనకు రూపకల్పన చేసి రాగాలన్నీ సమ్మిళితం చేసి అమృత భాండాగారంగా అందిస్తున్న “రాగామృత” సంచాలకులు శ్రీమతి మాధురి వాస అభినందనీయులు. గత నాలుగేళ్ళుగా అన్నమయ్య సంకీర్తనలు, రామదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, దీక్షితార్ కీర్తనలు, భక్తీ పాటలు – ఇలా వివిధ రకాలైన సంగీత పరమైన శ్రావ్యమైన పాటలను ఎంతోమంది చిన్నారులకు నేర్పించి వారిచే ప్రతీ ఏటా వార్షిక కచేరీలను నిర్వహిస్తున్నారు. ఉన్నతమైన ఆశయాలతో ఆరోహణా పథంలో ప్రతీ ఏటా ఒక్కొక్క మెట్టునదిరోహిస్తూ హాపర్స్ క్రాసింగ్, టార్నీట్, పాయింట్ కుక్, ట్రూగునిన ప్రాంతాల్లోని మన తెలుగువారే కాకుండా దక్షిణ భారతదేశ రాష్ట్రాల పిల్లలకు సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు.

“రాగామృత” వారి నాల్గవ వార్షిక కచేరీ ఈ నెల 13 వ తేదీన హపెర్స్ క్రాసింగ్ లో షుమారు ౩౦౦ మంది సభికుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సంగీత విద్వాంసులు శ్రీ శ్రీధరాచారి ముఖ్య అతిధిగా విచ్చేసారు. విందం సిటీ కౌన్సిల్ మేయర్ శ్రీ పీటర్ మేనార్డ్, కౌన్సిలర్ హీధర్ మార్కస్ మరియు కౌన్సిలర్ శ్రీ గౌతమ్ గుప్త కూడా అతిధులుగా హాజరయ్యారు. అతిధులందరూ శ్రీమతి మాధురీ వాస గారి భగీరధ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయమని భారతీయ సంగీత సంస్కృతీ సాంప్రదాయాలు, విలువలు కాపాడుకుంటూ ముందు తరాలవారికి స్పూర్తినిస్తున్నారంటూ కొనియాడారు. పిల్లల్లో నిగూడమైయున్న ప్రజ్ఞాపాటవాలు వెలికి తీసే ప్రయత్నంలో సఫలీకృతులు కావాలని ఆకాంక్షించారు. ఇందులో పాల్గొన్న పిల్లలకు మరియు అతిధులకు జ్ఞాపికలు అందజేసారు.

ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఎంతోమంది కళాకారులు, స్వచ్చంద సేవకులకు, వ్యాపారవేత్తలకు, పిల్లలకు మరియు వారి తలిదండ్రులకు శ్రీ దీపక్ వాసా గారు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.

Send a Comment

Your email address will not be published.