రస రాగ సుధ – రాగానుకూలం

ఆస్త్రేలియాలో జయనామ సంవత్సర ఉగాది సంబరాలకు మెల్బోర్న్ లో తెలుగు సంఘం శ్రీకారం చుట్టింది.

ఉగాది సంబరాలు పురస్కరించుకొని సినీ గాయకుడు శ్రీ పార్ధ సారధి గారి గాన విభావరి ఈ నెల 9వ తేదీన విలియమ్స్ టౌన్ టౌన్ హాల్ లో తెలుగు సంఘం జరుపుకొంది.  సాహిత్యపరమైన కొన్ని పాత పాటలతో పాటు ఆధునిక సంగీతపరమైన మరికొన్ని  క్రొత్త పాటలను తనదైన శైలిలో పాడి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేశారు.  అన్నమయ్య, సాగర సంగమం, సిరివెన్నెల, యమదొంగ, కన్నె వ్వయసు, మూగ మనసులు మొదలైన సినిమాల్లోని పాటలు పాడి ప్రేక్షకుల మన్ననలందుకున్నారు.

మొదటిగా తాయి ఉపాధ్యక్షులు శ్రీ శర్మ చెరుకూరి సభ్యులందరినీ స్వాగత వచనాలతో ఆహ్వానించి ఆనాటి కార్యక్రమం గురించి వివరించారు.  గత మూడు వారాలుగా శ్రీ పార్ధ సారధి గారు నిర్వహించిన శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన గాయకులు బృందగానం ఆలపించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  రెండవ అంశంగా శ్రీమతి పద్మ చిలకమర్రి చక్కటి హావ భావాలతో భరతనాట్యం చేశారు.

ఈ మధ్య కాలంలో మన తెలుగు సినీ తారలు ఎంతోమంది పరమపదించడం జరిగింది.  వారిలో పద్మ విభూషణ్ డా. అక్కినేని, శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీ ఎ వి ఎస్, ఉదయ్ కిరణ్, శ్రీ హరి మరియు అంజలీ దేవి వున్నారు.  వీరందరికీ స్మృత్యంజలి ఘటిస్తూ ఒక వీడియోని ప్రదర్శించారు.  చిరంజీవులు నిశిత, నీహారిక, భార్గవ్, అదితి మరియు శ్రీ రఘు విస్సంరాజు గార్లు మెడ్లీ పాడి అందరినీ అలరించారు.

ప్రతీ ఏట తెలుగు సంఘంలోని యువకుల సౌజన్యంతో నిర్వహించే జజ్జనక కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రస రాగ సుధ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు సంఘంలోని యువతీ యువకులు రెండు విడతలుగా మంచి నృత్యాలను అభినయించి ఎంతో చక్కగా ప్రదర్శించారు.

రస రాగ సుధ కార్యక్రమంలో విందం సిటీ కౌన్సిల్ మేయర్ శ్రీ బాబ్ ఫెయిర్ క్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  శ్రీ బాబ్ మాట్లాడుతూ తాను న్యూ జిలాండ్ నుండి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఆస్ట్రేలియా బహుళ సంస్కృతీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ విందం సిటీ కౌన్సిల్ లో సేవ చేస్తున్నట్లు చెప్పారు.  భారత సంతతికి చెందిన అనేకులు ఈ కౌన్సిల్ లో తమ నివాసమేర్పరచుకొని స్థానిక సంస్థలతో కూడి గొప్ప సేవలన్దిస్తున్నారని కొనియాడారు.  తాయి అధ్యక్షులు శ్రీ పవన్ మటంపల్లి మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో తాయి చేపట్టిన ఎన్నో సేవా తత్పరత గల కార్యక్రమాల గురించి వివరించారు.

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఏ తెలుగు సంఘానికి లేని ‘థీమ్ సాంగ్’ ని శ్రీ పార్ధ సారధి పాడగా ఆస్ట్రేలియా తెలుగు సంఘం ఈ కార్యక్రమంలో విడుదల చేయడం జరిగింది.  తెలుగు సంఘం 22 ఏళ్ల చరిత్రలో ఇదొక సువర్ణ ఘట్టమని శ్రీ పవన్ గారు అభివర్ణించారు. తరువాత శ్రీ పార్ధ సారధి గారికి సకల మర్యాదలతో సత్కరించడం జరిగింది.

తాయి సంఘం అధ్వర్యంలో ప్రచురించబడిన “తెలుగు భాషా శతకం” పుస్తకాన్ని శ్రీమతి పద్మినీ దివాకర్ల గారు ఆవిష్కరించారు.  ఈ పుస్తకం రచయిత శ్రీ చిగురుమల్ల శ్రీనివాస్ గారు ఖమ్మం వాస్తవ్యులు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేయడం జరిగింది.  తాయి కార్యవర్గ సభ్యురాలు చిరంజీవి సమంతా తంగిరాల ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమానికి మెల్బోర్న్ ఘంటసాల గా పేరొందిన శ్రీ చారి ముడుమ్బి, చిరంజీవి నీహారిక వల్టాటి వాచాస్పతులుగా వ్యహరించారు.

శ్రీమతి లత చిగురాల, శ్రీమతి లత శేషం శిక్షణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

మెల్బోర్న్ తెలుగు వారిలో అజాత శత్రువుగా పేరొందిన ధ్వని బ్రహ్మ శ్రీ మురళి బుడిగె గారు ఈ కార్యక్రమానికి శబ్ద సాంకేతిక సహాయాన్నందించారు.  వీరికి శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం, మరియు సునీల్ సిస్ట్ల తమ సహాయాన్నందించారు. శ్రీ  యోగి  వాల్తాటి స్టేజి మేనేజర్ గా వ్యవహరించారు.

శ్రీ వెంకట్ వడ్డిరాజు గారు పసందైన వంటకాలను సమృద్ధిగా అందించటంతో వచ్చిన సభ్యులందరూ విందు భోజనాన్ని ఆనందంగా ఆస్వాదించారు.

Send a Comment

Your email address will not be published.