రాజకీయాల్లోకి అరంగేట్రం

Hyma profile2015 వ సంవత్సరం స్త్రీ సాధికారత (Year of Women Empowerment) సంవత్సరంగా పరిగణించి ఆస్ట్రేలియా ప్రభుత్వం పురుషాధిక్యత గల సమాజంలో స్త్రీలు కూడా అగ్రగణ్యులుగా నిలిచి భావితరాలకు స్పూర్తి దాయకం కావాలని ఆకాంక్షించింది.  ఈ ప్రక్రియలో వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువురు మహిళలు నాయకత్వ బాటను చేపట్టి తమదైన శైలిలో సమాజానికి సేవలందించారు.

“ముదితల్ నేర్వగలేని విద్య గలదే!” అంటూ ఇదే బాటలో మన తెలుగింటి ఆడపడుచు, తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి హైమారెడ్డి వుల్పాల వచ్చే నెల 22వ తేదీన జరగనున్న Knox సిటీ కౌన్సిల్ ఎన్నికలలో Tirhatuan Ward కి సభ్యులుగా పోటీ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో భారత దేశం నుండి వలస వచ్చిన వారి సంఖ్య షుమారు 500,000. బ్రిటన్, చైనా తరువాత భారతీయ వలసదారుల సంఖ్య మూడవ స్థానంలో వుంది.  భారతీయుల్లో కూడా తెలుగువారి సంఖ్య మూడో స్థానంలో వుండడం గమనార్హం.  IT రంగంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తెలుగువారి వలస గత పదేళ్లుగా అధిక సంఖ్యలో పెరిగింది.  ఇప్పుడిప్పుడే వ్యాపార రంగాలలో అడుగిడుతూ తమ నైపుణ్యానికి పదును పెడుతూ అధిక సంఖ్యలో సాధికారతను సాధిస్తున్న తెలుగువారు రాజకీయ రంగంలో అంతంత మాత్రంగానే వున్నారు.  అందునా మహిళలు అక్కడక్కడా సమాజ సేవలో తమ సామర్ధ్యతను రుజువు చేసుకున్నా ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రావడం అరుదైన విషయం.

ప్రవాస ప్రస్థానం…

20 ఏళ్ల క్రితం న్యూ జిలాండ్ దేశానికీ వలస వెళ్లి 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాకి వచ్చిన శ్రీమతి హైమారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వాసి.  మన భాషపై మమకారంతో  తెలుగులో పట్టభద్రురాలై ఇక్కడ ఎంతోమందికి తెలుగులో పట్టం గట్టాలన్న దీక్షతో ఒక తెలుగు బడిని నిర్వహిస్తున్నారు.  అదే బాటలో ఇక్కడి స్థానికులకు మన సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెలియజేయడానికి సంక్రాంతి పండగను ఏటా జరుపుతూ తెలుగు నుడికారాన్ని, మమకారాన్ని పంచిపడుతున్నారు.  వనితల ప్రయోజనాలను కాపాడడానికి Find Yourself program అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  బహుళ సంస్కృతీ సాంప్రదాయ విలువలను కాపాడుతూ మన వారందరినీ స్థానికులతో కలవడానికి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.  ముఖ్యంగా బాలబాలికలు మన సత్సంప్రదాయకరమైన పండగలలో పాల్గొని వాటియొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి దోహదపడుతున్నారు.

Knox సిటీ కౌన్సిల్ లో తొలి భారతీయ మరియు తెలుగు మహిళగా ప్రత్యక్షంగా రాజకీయ రంగంలో అడుగిడుతున్న హైమారెడ్డి ఇంతకు ముందు అనేక సంస్థలలో పనిచేసి ప్రస్తుతం విక్టోరియా ప్రీమియర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ముందున్న లక్ష్యాలు…

  • ముందు ముందు యువతకు, వలసదారులకు సదవకాశాలను కల్పించడం
  • క్రీడారంగం పెంపొందడానికి వనరులు కల్పించడం
  • వయోవృద్ధులకు, అయోగ్యులకు (Disable persons) తగు సదుపాయాలు కల్పించడం
  • Knox సిటీ కౌన్సిల్ లో నివసిస్తున్న ప్రజల అధికారుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం
  • చిన్న వర్తక వ్యాపార సంస్థలకు సరైన ప్రోత్సహకాలు ఇవ్వడం

ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముదుకెళుతున్న శ్రీమతి హైమా రెడ్డి గారు అక్టోబర్ 22 వ తేదీన జరగనున్న ఎన్నికల్లో గెలిచి భారతీయ (తెలుగు) బావుటాను విజయోత్సాహంతో ఎగురవేస్తారని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.