ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయం మీద మెల్ల మెల్లగా సస్పెన్స్ తొలగుతోంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రమంగా గుప్పిట తెరుస్తోంది. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా క్రమంగా తన మనసులో మాట బయటపెడుతోంది. విజయవాడ దగ్గరే రాజధానిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన బలపడుతోంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి ప్రతిఘటన వస్తుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంగతిని ఒక పట్టాన బయటపెట్టడం లేదు. తాజా విశేషం ఏమిటంటే, అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి స్థాయిలో రాజధానిని ఏర్పాటు చేసుకునే లోగా విజయవాడను తాత్కాలిక పరిపాలనా కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అతి త్వరలో ప్రభుత్వ కార్యాలయాలను మెల్ల మెల్లగా విజయవాడ నగరానికి తరలించడం జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ తిరగడం ఇబ్బందికరంగా ఉందని భావించిన చంద్రబాబు నాయుడు ఇప్పటికే గన్నవరం లోని మేధా టవర్స్, లైలా టవర్స్ భవనాలలో సుమారు 80 కార్యాలయాలను పెట్టవచ్చని గుర్తించారు. అక్కడే ఉన్న విమానాశ్రయాన్ని కొద్దిగా అభివృద్ధి చేస్తే అది అంతర్జాతీయ స్థాయికి ఎదగగలదని కూడా భావిస్తున్నారు. కేంద్రం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ కూడా విజయవాడ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.