రాజధానిని సృష్టించడం కష్టమా?

ఒకప్పుడు విశాలాంధ్రకు హైదరాబాదును రాజధానిగా చేశారు. అయితే ఇప్పుడు ఆ నగరమే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాజధాని విషయంలో వివాదం ఏర్పడకుండా ఉండడం కష్టం. కానీ, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ఇది పెద్ద సమస్యేమీ కాదని చరిత్ర తెలుపుతోంది. హైదరాబాద్ కోసం ప్రస్తుతం సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలు ఘర్షణ పడడం చూస్తే సుమారు 55 ఏళ్ళ క్రితం నాటి విషయాలు గుర్తుకు రాక మానవు. అప్పట్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది.

వివాదాస్పద ప్రాంతాల మధ్య సరిహద్దులు, ఇతర పాలనాపరమయిన అంశాలన్నీ పరిష్కారం అవుతున్నాయి కానీ రాజధాని విషయంలో మాత్రం పీటముడి పడుతోంది. ఆంద్ర, తమిళనాడు రాష్ట్రాలు మద్రాసు కోసం పోరాడాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు బొంబాయి కోసం తలపడ్డాయి. ఆ తరువాత కాలంలో పంజాబ్, హర్యానాలు చండీగడ్ కోసం పోరాటం జరిపాయి. మొదట్లో ఈ సమస్యలు జటిలంగా కనిపించాయి కానీ కేంద్రం గట్టి నిర్ణయం తీసుకున్న తరువాత తేలికగా చల్లబడ్డాయి. కొత్త రాజధానులు బాగా అభివృద్ధి చెందాయి.

బొంబాయి విషయంలో సమస్య తలెత్తినప్పుడు, 1949లొ నెహ్రు, పటేల్, సీతారామయ్యలతో కూడిన కాంగ్రెస్ ఉన్నత స్థాయి కమిటీ బొంబాయి ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని సూచించింది. అయితే మరాఠీలు, గుజరాతీలు అందుకు ఒప్పుకోలేదు. ఈ రెండు రాష్ట్రాలు కలిసే ఉండాలని, వీటికి బొంబాయి ని ఉమ్మడి రాజధానిని చేయాలని 1955లొ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ (ఎస్సార్సీ) సిఫారసు చేసింది. ఎస్సార్సీ సిఫారసుల్ని నెహ్రూ పట్టించుకోలేదు. కేంద్రం బొంబాయి నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని భావించింది. ప్రజలు అంగీకరించ లేదు. విదర్భను , బొంబాయి నగరాన్ని కలిపి ఒక కొత్త ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజలు నిరసనలు, ఆందోళనలకు దిగారు. ఈ గొడవలకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే, బొంబాయి నగరాన్ని ఒక ద్విభాషా రాష్ట్రంగా కొనసాగించాలని చివరికి కేంద్రం నిర్ణయం చేసింది. కానీ, మహారాష్ట్ర, గుజరాత్ లను రెండు రాష్ట్రాలుగా చేయాలన్న డిమాండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బొంబాయి ప్రాంతాన్ని విభజించడం రాజకీయ అగత్యమని కేంద్రం అర్థం చేసుకుంది. మహారాష్ట్రకి బొంబాయి వచ్చే విధంగా నిర్ణయం జరిగింది. గుజరాత్ కొత్త రాజధాని కోసం 50 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 1960 మే నెల ఒకటవ తేదీన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

ఈ కొత్త రాష్ట్రాల వ్యవహారం పంజాబ్ లో కూడా కంపనాలు సృష్టించింది. హిందీ, పంజాబీ మాట్లాడే వాళ్ళను విడదీసి, వేరే వేరే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ మొదలయింది. ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోక తప్పలేదు. 50 కోట్ల రూపాయలతో చండీగడ్ ను నిర్మించారు. చదీగడ్ తమకే కావాలని పంజాబ్, హర్యానాలు ఆందోళనలు ప్రారంభించాయి. కానీ కేంద్రం చండీగడ్ ను ఉమ్మడి రాజధానిని చేసి ఆ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. తమిళులు, తెలుగువారు విడిపోతున్నప్పుడు కూడా రాజధాని సమస్య వచ్చింది. మద్రాసును తమకే ఇవ్వాలని తెలుగువారు పట్టుబట్టారు. కానీ మద్రాసు తమిళ ప్రాంతానికే రాజధానిగా ఉండాలని కేంద్రం భావించి, కర్నూలును 1953లొ తెలుగు ప్రాంత రాజధానిగా చేసింది. ఇప్పుడు చరిత్ర మళ్ళీ మొదటికి వచ్చింది. హైదరాబాదును ఈ ప్రాంతానికి రాజధానిగా ఉంచాలన్నది కేంద్రం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.

Send a Comment

Your email address will not be published.