రాజేంద్రుడే "మా" రాజు

“మా” (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా నటుడు రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు.

ఆయన తన ప్రత్యర్ధి జయసుధపై యాభైమూడు ఓట్ల తేడాతో  విజయం సాధించారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను 392 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే రాజేంద్రప్రసాద్‌ ఆధిక్యం కొనసాగింది. మొత్తం ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 53 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు ప్రకటించారు. రాజేంద్రుడి విజయంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు.

ఈసారి ఎంతో ఆసక్తికరంగా,సాధారణ ఎన్నికలు తలపించే రీతిలో ఎన్నికల బరిలో ఉన్న రాజేంద్రుడి వర్గం, జయసుధ వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని రసవత్తరమైన పోటీకి ఆస్కారం కల్పించిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి గెలుపెవరిది అనే దానిపై తెలుగు ప్రజల దృష్టి మళ్ళింది.  బుల్లి తెర మీదే కాకుండా ప్రింట్ మీడియా లోను ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చర్చలు సాగాయి. పరిస్థితులు  జ‌య‌సుధ‌కు అనుకూలంగా ఉన్నాయని అందరూ అనుకున్నారు.  అయితే పోలింగ్ పూర్తైన తర్వాత మాత్రం రాజేంద్రుడు విజయం సాధిస్తారని చెప్పుకున్నారు.

హాటు హాటుగా మారిన నాట‌కీయ ప‌రిణామాల మధ్య సాగిన “మా” ఎన్నికల్లో చివరికి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. అయితే ఆయన అనుకున్న దానికనా ఎక్కువ తేడాతో ఎలా గెలిచార‌నేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  పోలింగ్ కి ముందు రోజు ఏవైనా ఊహించని  పరిణామాలు చోటు చేసుకున్నాయా అనేదే ప్రశ్న. జ‌య‌సుధ‌కు సీనియ‌ర్‌న‌టుడు ముర‌ళీమోహ‌న్ మద్దతు ఇస్తే రాజేంద్ర‌ప్రసాద్‌కు నాగ‌బాబు అండగా  నిలిచారు. నాగేంద్ర‌బాబు వల్ల రాజేంద్రుడికి చిరంజీవి మద్దతు కూడా ఉన్నట్టే అయ్యింది. ఈ కారణంగానే రాజేంద్రుడు గెలిచినట్టు అనుకుంటున్నారు. ఈ విజయంలో నాగబాబు పాత్ర ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు. పైగా కొందరు  సీనియ‌ర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం కూడా రాజేంద్రుడి విజయానికి దోహదపడినట్టు అనుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.