రాజ్యసభ కూడా ఆమోదం

తెలంగాణా బిల్లుకు రాజ్యసభ కూడా గురువారం రాత్రి ఆమోదం తెలిపింది. దాంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసినట్టు అయింది. ఇక రాష్ట్రపతి సంతకం పెట్టడం కేవలం లాంచనం మాత్రమే. దీని మీద రాష్ట్రపతి కూడా రెండు మూడు రోజుల్లో సంతకం పెట్టే అవకాశం ఉంది. రాజ్యసభలో మూజువాణీ ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. బీజేపీ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడుతో సహా కొందరు సభ్యులు ప్రవేశ పెట్టిన సవరణలు వీగిపోయాయి. సీమాంధ్రకు పదేళ్ళ పాటు స్వయం ప్రతిపత్తి, సీమాంధ్ర ప్రభుత్వ సిబ్బందికి విభజన లోగా జీతాల చెల్లింపులు, నీటిపారుదల పథకాల పరిస్థితి వంటి అంశాలపై వెంకయ్య నాయుడు సవరణలు ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వ వివరణలు, హామీల అనంతరం ఈ సవరణలు వీగిపోయాయి.

రాజ్యసభ ఆమోదం కూడా పొందడంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినట్టయింది. ఏది ఏమయినా ఈ నెలాఖరులోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడినట్టే. రాజ్యసభలో దీనిపై చర్చ, ఓటింగ్ జరుగుతున్నంత సేపూ సీమాంధ్ర సభ్యులు గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం ఇస్తుండగా కూడా  సంబంధించిన కాగితాలను చించి విసరేస్తూనే ఉన్నారు.  చించిన కాగితాలను ప్రధాని మీదకు కూడా విసిరేశారు. సంక్షిప్తంగా ప్రకటన చేసిన తరువాత ప్రధాని సభ నుంచి వెళ్లిపోయారు.  చివరి వరకూ కె.వి.పి. రామచంద్ర రావు విభజనను నిరసిస్తూ ఓ కార్డును పట్టుకుని సభలో  నేల మీద కూర్చునే ఉన్నారు. చివరికి నడుం నొప్పితో ఆయన పడిపోయే సరికి ఆస్పత్రికి తరలించడం జరిగింది. సభ రాత్రి సుమారు 8 గంటల వరకూ కొనసాగింది. కేంద్ర మంత్రి చిరంజీవి సభలో మాట్లాడుతూ, తను ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం కాననీ, అయితే విభజనపై తమను సంప్రతించక పోవడం బాధ కలిగిస్తోందని అన్నారు.

Send a Comment

Your email address will not be published.