రాముడు - భీముడు కి యాభై ఏళ్ళు

భారత దేశంలోని ప్రముఖ అగ్ర నిర్మాతలలో ఒకరైన డీ రామానాయుడు తొలి సినిమా రాముడు భీముడుకి ఇది యాభయ్యో సంవత్సరం. 1964 మే నెలలో ఇది విడుదల అయ్యింది. అప్పట్లో ఇది సూపర్ డూపర్ హిట్టు కొట్టిన చిత్రం.

అన్ని భారతీయ భాషలలోను సినిమాలు తీసిన నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల పుటలకెక్కిన డీ రామానాయుడుని మూవీ మొఘల్ అని కూడా అంటారు.

ఆయన నిర్మించిన రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్ హీరోగా రెండు పాత్రలలో నటించారు.

డీ రామానాయుడు తన ఫిలిం కెరీర్ ను దర్శకుడు తాపీ చాణక్యతో ప్రారంభించారు. రాముడు భీముడు చిత్రానికి తాపీ చాణక్యను దర్శకత్వం వహించమని డీ రామానాయుడు అడిగినప్పుడు కొందరు ఆయనను నిరుత్సాహ పరిచారు. తాపీ చాణక్య బదులు మరొకరితో సినిమా చెయ్యమని సలహా ఇచ్చారు. ఎందుకంటె తాపీ చాణక్య దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాలు అప్పట్లో వరుసగా ఫ్లాప్ కావడంతో ఆయన శ్రేయోభిలాషులు తాపీ చాణక్యతో సినిమా వద్దని సూచించారు. అయితే కొసరాజు రాములు అనే అత్యంత సన్నిహితుడు, సలహాదారు మాత్రం ఆయనను తాపీ చాణక్యతో సినిమా చెయ్యమని సూచించారు. అందుకు సరేనని ఒప్పుకున్నారు డీ రామానాయుడు. ఈ చిత్రానికి మాటల రచయితగా డీ వీ నరస రాజును ఎన్నుకున్నారు. కథ కోసం డీ రామానాయుడు వేటలో పడ్డారు. నరసరాజు, రామానాయుడు, తాపీ చాణక్య ముగ్గురికీ వేరే భాషలో వచ్చిన సినిమాలు చూడటం అలవాటు. అలా చూడగా చూడగా వాళ్ళు చివరికి ఒక చోట కూర్చుని ఒక మంచి కథకు ప్రాణంపోసేవారు. ఇది ఇలా ఉండగా, అప్పటికే నరసరాజు గారు చెప్పిన ఓ కథను నాగిరెడ్డి చక్రపాణి తిరస్కరించారు.
ఆ కథను చెప్పించుకోవడానికి రామానాయుడు నరసరాజు, తాపీ చాణక్య తో కలిసి బీచ్ కి వెళ్ళారు. అక్కడ నరస రాజు కథంతా చెప్పారు. ఆ కథ బాగుందని రాముడు భీముడిగా తీయాలని రామానాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత డీ రామానాయుడు, నరసరాజు కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తమ మనసులో మాటను చెప్పి ఎన్టీఆర్ ను అందులో నటించమని అడిగారు. ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా నటించేందుకు అంగీకరించారు. ఎన్టీఆర్ గుణాలలో తనకు నచ్చిన విషయం ఒకటుందని, తాను నటించే సినిమాకు ఎవరు దర్శకుడు అని అడిగేవారు కాదని రామానాయుడు చెబుతుండేవారు. తాపీ చాణక్య రాముడు భీముడు సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పగానే ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా నటించేందుకు సమ్మతించడం డీ రామానాయుడికి ఆనందం వేసింది.
ఆ సినిమా గొప్ప హిట్టు కొట్టడంతో రామానాయుడు ఆ తర్వాత అనేక మంచి సినిమాలు తీయడానికి మూలమైంది. రాముడు భీముడు చిత్రంలో ఎస్ వీ రంగా రావు, జమున , రేలంగి తదితరులు నటించారు.

ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వర రావు సంగీతం సమకూర్చారు. దేశమ్ము మారిందోయి పాటను కొసరాజు రాఘవయ్య, ఉందిలే మంచి కాలం ముందు ముందునా పాటను శ్రీ శ్రీ , తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే పాటను సి నారాయణ రెడ్డి రాసారు. ఈ పాటలను ఘంటసాల, పీ సుశీల పాడారు. అలాగే అదే అదే నాకు అంతు తెలియకున్నది…..పాటను సి నా రె రాయగా ఘంటసాల, పీ సుశీల పాడారు. సరదా సరదా సిగరెట్టూ …..పాటనూ, తగునా ఇది మామా … పాటనూ కొసరాజు రాసారు. ఈ పాటలన్నీ ఇప్పటికీ వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.

ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది.
నరసరాజు చెప్పిన ఈ కథను తిరస్కరించిన నాగిరెడ్డి చక్రపాణి రాముడు – భీముడు చిత్రం హిట్టవడంతో తమిళంలో తాము రీమేక్ చెయ్యడానికి ముందుకు రావడం విశేషమే. తమిళంలో ఈ సినిమా “ఎన్గల్ వీట్టు పిళ్ళై ” పేరుతో తీసారు. తమిళంలో ఎమ్జీఆర్ నటించారు. తమిళంలోనూ ఈ సినిమా హిట్టైంది. నాగిరెడ్డి చక్రపాణి, ఎమ్జీఆర్ లు కలిసి వెళ్లి డీ రామానాయుడుని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విధంగా తన తొలి సినిమా రాముడు భీముడు యాభై ఏళ్ళ క్రితం నిర్మించానని రామానాయుడు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమానే హిందీలో రామ్ ఔర్ శ్యాం గా తీసారు. హిందీలో దిలీప్ కుమార్ నటించారు.

“ఆ రోజులలో కథే హీరో. కథకున్న ప్రాధాన్యం ఇంతా అంతా కాదు” అని రామానాయుడు చెప్పారు. కథ మంచిదవడమే కాదు, సినిమా తీసేటప్పుడు ఆణువణువూ నిర్మాత తెలుసుకుని ఉండాలి అన్నది ఆయన మాట. సినిమాలో నటించే నటులు, పని చేసే సాంకేతిక యూనిట్ మధ్య సమన్వయం ఉంటేనే మంచి సినిమా రూపొందుతుందని ఆయన అంటారు. కేవలం నిర్మాతగా డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం నిర్మాత పని కాదని, ప్రతీ రోజూ ప్రతీ షూటింగ్ విషయం నిర్మాత తెలుసుకుని ఉండాలి. సెట్ లో ఉండాలి. అన్ని విషయాలు తెలుసుకుని అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం నిర్మాత బాధ్యత అని ఆయన చెప్పారు. ఒక్కొక్కప్పుడు ట్రాలీ బాయ్ రాకపోతే తానే ట్రాలీ వర్క్ చేసేవాడినని రామానాయుడు గుర్తు చేసారు. కనుక ఈ 24 ఫ్రేమ్స్ లో సమన్వయము ముఖ్యమని రామానాయుడు ఉత్తినే చెప్పలేదు. ప్రతి నిర్మాతకే కాదు చిత్ర యూనిట్ మొత్తానికి అదొక అమూల్యమైన విషయమని గ్రహించాలి.

Send a Comment

Your email address will not be published.