రాయిని విసిరిన కొలను

అప్పుడెప్పుడో ఒక తమిళ పత్రిక ప్రేమ సోపానాలు అని ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. అందులో ప్రముఖులెందరో ప్రేమ మీద తమ అభిప్రాయాలు రాశారు. వాటిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కొన్ని మాటలు రాసారు.
ఆయన తన మొదటి భార్యకు దూరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రేమ గురించి ఇలా రాసుకొచ్చారు….

“ఆమె అప్పటిలాగానే ఇప్పుడు కూడా లేదు….

ఆమె నాతో లేదు…

ప్రేమ – అది ఒట్టి మాటల్లో చెప్పే విషయం కాదు. ప్రేమ పవిత్రమని అందరిలా మామూలుగా చెప్పకండి….నాకూ ప్రేమ అలాగే ఉండి ఉండవచ్చు. అందుకే ప్రేమను పవిత్రమని చెప్పి ఉండొచ్చు.

ప్రేమ సుఖమైనదని మరొకరు చెప్పొచ్చు. అది చిత్రహిమ్సే అని మరొకరు గగ్గోలు పెట్టొచ్చు. అది కాలక్షేపమని నవ్విన వాళ్ళూ ఉండొచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కోలా అనిపించవచ్చు ప్రేమ. అయితే ప్రేమను సహజంగా చెప్పుకుపోకూడదు.

అదొక అనుభవం.

అనుభవం అర్ధం కావాలంటే అనుభవించాలి. దానికి రెక్కలు పెరిగి ఉండవచ్చు. కవితలై మాట్లాడవచ్చు. జలపాతమై వర్షించనూ వచ్చు. మనసు ఎగరొచ్చు. కలలొస్తాయని ఎంత చెప్పినా అర్ధం కాదు. అనుభవించాలి. అంతకన్నా మరో మార్గం లేదు….

స్త్రీతో స్నేహం నాకో పెద్ద విషయంగా ఉండేది కాదు. ఎందరో మిత్రులు. ఎన్నో అనుభవాలు….నాకో స్నేహితురాలు ఉంది. ఆమెతోనే నేను నన్ను పూర్తిగా షేర్ చేసుకున్నాను. రోజూ చూడాలి….మాట్లాడాలి….పక్కనే ఉండాలి అనేదేమీ లేదు…కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూసినా, చూసిన ఆ క్షణంలోనే పాత స్నేహం తాజాగా అనిపించేది. అది ఆశ్చర్యకరమైన అంశం.

నేను ప్రేమించే నువ్వు – నువ్వు కాదు….నాలో ఎక్కడో ఉన్న రంగుల్లో ఒక అడవి పువ్వై పూసి ఉంటావు…ఆ నువ్వే నేను ప్రేమించే నువ్వు అని అంటాను…

శరీరంలో నిరంతరం గాయాలే కళ్ళు అని ఒక కవిత ఉంది.

ఆ కళ్ళను పక్కన పెడదాం. ఆ కంటిలోపల ఒక కన్ను ఉంటుంది. అది చూస్తుంది. అది చూపుతుంది….అది మాట్లాడుతుంది. ఆ కళ్ళు మాట్లాడనీ…

ప్రేమలన్నీ పెళ్ళితో ముగియవు. ముగియాలనే అవసరమూ లేదు. ప్రేయసిని , భార్యను ఒకే పళ్ళెంలో ఉంచడాన్ని నేను అంగీకరించను.

ప్రేమలో కోరికలు, పెళ్ళిలోని అవసరాలూ వేరు.

డిస్కో శాంతి నాకో మిత్రురాలు. ఆమె ఇంటికి వెళ్తున్నప్పుడు లత (లలితకుమారి) ను చూసాను. ఓ హలో, చిన్న నవ్వు, కూర్చోండి…అని ఒక మాట…అంతే …అంత కన్నా ఆమె మాట్లాడేది కాదు….నేనూ ఎక్కువగా మాట్లాడింది లేదు. ఏమిటో తెలీదు, ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటారా ప్రకాష్ అని లత అడిగినప్పుడు నాకు కోపం వచ్చింది. ఈమెకు నా గురించి ఏం తెలుసు ? ఏ ధైర్యంతో అలా అడిగింది? అని అనిపించింది.

ఆ తర్వాత మాట్లాడాను. నాకు మీ మీద నమ్మకం ఉంది…నచ్చారు అని సింపుల్ గా చెప్పింది లత. ఆమెకు ప్రేమ. అప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు.

అయినా ఆ తర్వాత అంగీకరించాను. నేను ఆ క్షణాలను నమ్మలేకపోతున్నాను….

అమ్మకు చెప్పడం…నిశ్చితార్ధం…పెళ్లి అంతా అయిపోయింది.

నాకంటూ ఒక అభిరుచి ఉంటుంది. ఆమెకూ అలాగే కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి. నేను చదివే పుస్తకాలు ఆమె చదవాలి. …. వాటి గురించి ఆమె మార్లాడాలి…..అని నేనెప్పుడూ అనుకోలేదు….పొద్దున్న లేవడంతోనే ఆమె దేవుడు పాటలు పాడుతూ పూజ చేసేది. కొన్ని విషయాలలో ఆమె మీద ప్రేమ ఉండేది. మాకు పూజ అనే పాపాయి పుట్టింది. అదే మా లోకం.

కానీ ఇప్పుడు లత దూరమే…నాతో లేదు….

ప్రేమ పెళ్ళిళ్ళను నేను ఆదరిస్తాను, పెళ్లి తర్వాత కూడా మీరు ప్రేమించే పక్షంలో.

ప్రేమను వెతుక్కుని జీవితాన్ని కోల్పోయిన వారి పట్ల నేను జాలిపడతాను….

ఒక్కొక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. ఏదో ఒకటి గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేసెయ్యాలని అనిపిస్తుంది. కానీ అది ప్రేమ మాత్రమే కాదు.

ప్రేయసి పక్కన ఉండటం, ముద్దు. ఆ ప్రేమ, ఆ జ్ఞాపకాలు, అన్నీనూ రాయి విసిరిన కొలనులా కాలమంతా ఉంటాయి…..ఆ శోకం, సంతోషం ఎప్పుడూ ఉంటాయి….

ప్రేమ పెళ్ళికి రిహార్సల్ కాదు.

ప్రేమతోనే ప్రపంచం ముగిసిపోవడం లేదు….

ఇంకా చెప్పాలంటే ఇలా మాట్లాడుకునే విషయమే కాదు ప్రేమ. అదొక యాక్ట్. ….అని”

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.