రాష్ట్రపతి పాలన తప్పదా?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమనిపిస్తోంది. తెలంగాణా బిల్లు మీద రాష్ట్ర శాసనసభలో ఏర్పడుతున్న ప్రతిష్టంభనను చూస్తుంటే, ఇక ఈ శాసనసభ జరిగేటట్టు కనిపించడం లేదు. తెలంగాణా బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పటికీ దానిపై ఇంతవరకూ చర్చ అనేది ప్రారంభం కాకపోగా, రోజూ గందరగోళ పరిస్థితులే నెలకొంటున్నాయి. ఈ బిల్లుపై చర్చించడానికే ఈ ప్రత్యేక శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని బలపరిచేవారు ఒక పక్క, సమైక్య ఆంధ్రను సమర్థించేవారు మరో పక్క వాదోపవాదాలతో సభను స్తంభింపచేస్తున్నారు. ఈ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి డిసెంబర్ 12న శాసనసభకు పంపించారు. అప్పటి నుంచి ఇంతవరకూ సభ ఒక్క రోజు కూడా సవ్యంగా నడవ లేదు. ఈ నెల 23 లోగా బిల్లుపై చర్చ ముగిసి బిల్లు మళ్ళీ రాష్ట్రపతి వద్దకు వెళ్ళాల్సి ఉంది.  తెలంగాణా విషయంలో ప్రతిష్టంభన ఇదే విధంగా కొనసాగితే, రాష్ట్రపతి పాలన విధించడం తప్ప కేంద్రానికి మరో ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, “ఈ నెల 10 తరువాత రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ సమావేశం కాబోతోంది. ఈలోగా బిల్లు రాష్ట్రపతికి చేరాల్సి ఉంది. అందువల్ల కేంద్రం  రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.

Send a Comment

Your email address will not be published.