అర్థనారీశ్వర ఆలయం

Ardhanariswaraఅర్థనారీశ్వర రూపం పురుషత్వానికి సరిసమానమైన స్త్రీత్వాన్ని చాటిచేబుతోంది. స్త్రీ పురుష సంయోగంలో సంతాన ఉత్పత్తి జరిగేందుకు అర్థనారీశ్వరుడి స్త్రీ – పురుష రూపాలుగా విడిపోవాలని బ్రహ్మ ప్రార్ధించాడు. పరమశివుడి అర్థనారీశ్వర తత్త్వం ఎప్పుడైతే ఈ జగత్తుకి తెలిసోచ్చిందో అప్పుడే సృష్టి ప్రారంభం అయినట్టు చెప్పుకోవచ్చు. ఈ తత్వంతోనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలూకా తొట్టంబేడు మండలంలో సువర్ణముఖీ నదీ తీరాన విరూపాక్షపురంలో ఓ ఆలయం వెలిసింది. దీని పేరు అర్థనారీశ్వర స్వామీ ఆలయం. ఇది ప్రాచీనమైనది.

శివుడిని అర్థనారీశ్వరుడిగా ఆలయ గోడలపైన, విమానంపైన చూడవచ్చు. మూలవిరాట్టు అయిన లింగం సైతం అర్థనారీశ్వరుడి రూపంలో వెలియడం అపూర్వం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాపివిచ్చేద క్షేత్రం అని అంటారు.

కృతయుగంలో ఈ స్వామిని సకల దేవతలూ పూజించారు. అప్పట్లో ఈ స్వామి లింగాన్ని సత్యలింగం అని చెప్పుకునే వారు. ద్వాపరయుగంలో అవంతీపురానికి చెందిన విజయ, సులభ దంపతులు ఈ స్వామిని సేవించి తరించారు.
ఉత్తర భారతంలోని అవంతీ నగరంలో విజయ దంపతులు చూడముచ్చటైన చక్కటి దంపతులుగా అనిపించుకున్నారు. విజయుడికి బాల్యం నుంచే శివభక్తుడు. ఓరోజు విజయుడు మార్కండేయుడుని దర్శించి మోక్ష మార్గం చెప్పమన్నాడు. అప్పుడు మార్కండేయుడు శివుడిని ప్రసన్నం చేసుకునే విధానాన్ని చెప్పాడు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి వెళ్లి అక్కడ ప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరులను పూజించి జన్మ తరింప చేసుకోమని సూచించాడు. అంతట విజయ దంపతులు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. విజయుడు ఓ పర్ణశాలలో ఉండి సువర్ణముఖి నదిలో స్నానం చేసి విభూది పెట్టుకుని మెడలో రుద్రాక్షలు ధరించి ఆలయానికి వెళ్లి స్వామిని సేవించాడు.

ఓరోజు విజయుడు సాయంత్రం వరకు స్వామీ సన్నిధిలో ఉండి ఇంటికి చేరుకున్నప్పుడు భార్య తన భర్తకు ఇష్టమైన పదార్థాలు చేసిపెట్టి తినిపించింది. ఆ తర్వాత విజయుడు మెనూ వాల్చాడు. భార్య సులభ సింగారించుకుని భర్త వద్దకు వచ్చింది. భార్య కోరిక అతనికి అర్థం కాలేదు. యవ్వనంలో ఉన్న సులభ చనుకట్టు విజయుడికి రెండు శివలింగాలుగా కనిపించాయి. విజయుడు వాటిపై పువ్వులు, సుగంధ ద్రవ్యాలు చల్లి వాటిని శివలింగాలుగా భావించి రాత్రంతా పూజిస్తాడు. మరోవైపు భార్య సులభ భర్త తన కోరిక తీర్చలేదని బాధపడుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున విజయుడు యథాప్రకారం గుడికి వెళ్తూ రాత్రి జరిగినదంతా ఆలోచిస్తాడు. తన భార్యను ఎలా విడిచిపెట్టాలి అని కూడా ఆలోచిస్తాడు.

ఆ రోజు రాత్రి భార్యతో ఒక్క మాటా మాట్లాడడు. మౌనంగా నిద్రపోతాడు. నిద్రలో శివుడు కనిపిస్తాడు. సువర్ణముఖి నదీ తీరాన ఉన్న అర్థనారీశ్వరుడిని సేవించి తరించమంటాడు. మరుసటి రోజు విజయుడు పొద్దున్నే లేచి నడుచుకుంటూ వెళ్లి అర్థనారీశ్వరుడిని నిష్టతో కొలుస్తాడు.

సులభ భర్త తన వల్లే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడని గ్రహించి ఆయన అడుగుజాడలలోనే నడిచి వెళ్లి స్వామిలో లీనమైపోవాలని అనుకుంటుంది. శివపూజా విధానం తెలుసుకుంటుంది. రోజు బంకమట్టితో నూట ఎనిమిది శివలింగాలు చేసి సద్భక్తితో పూజిస్తుంది. అయితే ఆమె భక్తిని మహేశ్వరుడు పరీక్షించాలని అనుకుంటాడు. శివుడు ఓ బ్రాహ్మణ యువకుడి వేషంలో వచ్చి కాలాన్ని వృధా చేయకుండా తనతో వచ్చి ఆనందంగా జీవించమని చెప్తాడు. అతను ఎన్నో మాటలు చెప్తాడు. కానీ అవేవీ ఆమె మనసుని మార్చవు. అప్పటికీ విడవని బ్రాహ్మణుడు ఆమెను సమీపిస్తాడు. బలవంతం చేస్తాడు. అంతట ఆమె “స్వామీ నన్ను కాపాడు” అని మొరపెట్టుకుంటుంది. అంతే ఆ క్షణంలోనే ఆమె ఎదుట జ్ఞానప్రసూనాంబ, శ్రీకాళ హస్తీశ్వరుడు ప్రత్యక్షమవుతారు.

“నీ భక్తిని పరీక్షించాలని నేనే అలా నాటకం ఆడాను. నీకు ఏం కావాలో కోరుకో” అంటాడు పరమేశ్వరుడు.

సులభ “ఆదిదంపతులారా! మీకు నమస్సులు. పునర్జన్మ వద్దు. నన్ను మీలో లీనం చేసుకోండి” అని కోరుతుంది. పార్వతీపరమేశ్వరులు తదాస్తు అంటారు. ఆమెను తమలో విలీనం చేసుకుంటారు. మరోవైపు భర్త విజయుడు కూడా నిత్యం పూజించే లింగంలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటామని శివపార్వతులు చెప్తారు. అప్పటినుంచే సుఖగాంబ సమేత శ్రీవిజయేశ్వర స్వామి పేరిట ఈ ఆలయం వినుతికెక్కింది.

ఈ అర్థనారీశ్వర ఆలయాన్ని తూర్పునకు అభిముఖంగా నిర్మించారు. ఇక్కడ లింగం స్వయంభూలింగం. ఈ లింగం రెండు ముఖాలు కలిగి ఉంటుంది. శివుడి భాగంగా చెప్పుకునే వైపు తెల్లగా మంచులా, దేవి భాగం పసుపురంగులో ఉంటుంది. ఈ అర్థనారీశ్వర స్వామికి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, శుక్ర, సోమవారాల్లోను, ఏకాదశి, కృత్తిక, శివరాత్రి పర్వదినాల్లో విశేషంగా పూజలు నిర్వహిస్తారు.

Send a Comment

Your email address will not be published.