లోక్ సభలో బిల్లు

రాజ్యసభలో ప్రవేశ పెట్టిన తెలంగాణా బిల్లు ద్రవ్య బిల్లేనని న్యాయ శాఖ తేల్చి చెప్పింది. దాంతో, ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశ పెట్టడానికి మార్గం సుగమం అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఈ సారి లోక్ సభలోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకు మరోసారి రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకుంది. ఈ బిల్లును గురువారమే లోక్ సభలో ప్రవేశ పెట్టడానికి కేంద్రం సభాపతి మీరా కుమార్ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలిసింది. ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెడితే బీజేపీ ఏదో విధంగా అడ్డుపడే అవకాశం ఉంది. సీమాంధ్ర సంగతి తేల్చకుండా, సమ న్యాయం జరగకుండా ఈ బిల్లును యథాతథంగా ఆమోదించే అవకాశమే లేదని నిన్న కూడా అద్వానీ, వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కాగా, ఈ రోజు బీజేపీ సభ్యులకు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.

ఇది ఇలా ఉండగా, ఆరుగురు సభ్యులపై కాంగ్రెస్ పార్టీ వేసిన వేటు తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. బహిష్కరణకు గురయిన సభ్యులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాము స్వతంత్రంగా, ఎటువంటి బాదర బందీ లేకుండా బిల్లును అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారు.

కిరణ్ రాజీనామా?
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రోజున రాజీనామా చేసే ఉద్దేశంలో ఉన్నారు. తెలంగాణా ఏర్పాటు బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశ పెడుతున్నందు వల్ల ఇక తాను రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆయన ఈ విషయాన్ని తనకు సన్నిహితులయిన మంత్రులు, శాసనసభ్యులతో చెప్పినట్టు కూడా తెలిసింది. వోట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను రాజీనామా చేస్తానని ఆయన వారికి సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ వోట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ సమావేశాలు జరుపుతోంది. కాగా ఆయనకు సంఘీభావంగా మరికొందరు శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు.

Send a Comment

Your email address will not be published.