వందేళ్ళ చరిత్రలో అరుదైన గౌరవం.....

కార్య సాధనలో పట్టుదల, తోటివారికి మేలు చేయాలన్న తలంపు, అంచలంచెలుగా పైకేదగాలన్న కృషి, తన పనిలో తనకున్న నమ్మకం, ఆచరణలో ఉన్న నిబద్ధత, స్వపర బేధంలేని సేవా తత్పరత – ఇవన్నీ కలబోసిన వ్యక్తిత్వానికి పరాయి దేశంలో పట్టం గట్టి వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అరుదైన గౌరవంతో సత్కరించడం న్యూ జిలాండ్ దేశం లోని తెలుగు వారికే కాకుండా మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ సత్కారం అందుకున్న మొదటి భారతీయుడు అందులోనూ తెలుగువారు కావడం ఎంతో శ్లాఘనీయం.

న్యూ జిలాండ్ దేశంలోని Public Service Association (PSA) ఆక్లాండ్ నివాసితులు శ్రీ (బాల) వేణుగోపాల్ రెడ్డి బీరం గారికి Delegate Achievement Award నిచ్చి సత్కరించింది. ఈ సంస్థ వందేళ్ళ చరిత్రలో ఇప్పటివరకూ ఈ గౌరవ పురస్కారాన్ని అందుకున్నవారు నలుగురే. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఐదవ వ్యక్తి. Public Service Association లో 62000 మంది సభ్యులున్నారు.

శ్రీ వేణుగోపాలరెడ్డి గారి వివరాలలోకెళితే… వారు ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందినవారు. తలిదండ్రులు మహేశ్వర రెడ్డి మరియు ఈశ్వరమ్మ గార్లు. కాయకష్టం చేసే వ్యవసాయ వృత్తే వారి జీవనాధారం.

శ్రీ వేణుగోపాల్ రెడ్డి కెమిస్ట్రీ లో పట్టుభద్రులై హైదరాబాద్ లో కొన్నాళ్ళు పని చేసిన తరువాత న్యూ జిలాండ్ 1999 లో రావడం జరిగింది. అదృష్ట వశాత్తు వచ్చిన కొత్తలో ఏమీ ఇబ్బందులు పడకుండా వుద్యోగం దొరికింది. గత పదేళ్లుగా 2000 మంది ఉద్యోగులున్న AssureQuality సంస్థలో Scientific Analyst గా పనిచేస్తూ రెండు సార్లు ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక కావడం జరిగింది. ఈ సంస్థ ముఖ్యంగా అంతర్జాతీయంగా చాలా కంపెనీలకు ఫుడ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ యూనియన్ లో డెలిగాట్ గా వుండి సహ ఉద్యోగుల బాగోగుల నిమిత్తం మేనేజ్ మెంట్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి జీతభత్యాల, ఉద్యోగ నిబంధనలు విషయమై సడలింపులు చేయించి వారి అభ్యున్నతికి ఎంతో కృషి సలిపారు. ఈ కృషికి ఫలితంగా గత నెల 15 వ తేదీన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి Delegate Achievement Award నిచ్చి సత్కరించింది. అనన్య సామాన్యమైన గురుతర బాధ్యతలని నిర్వహించి ఆదర్సవంతమైన స్పూర్తి నిచ్చే పాత్రలని నిర్వహించే వారికీ ఈ సత్కారాన్ని అందజేస్తారని AssureQuality ఒక ప్రకటనలో తెలిపింది.

2008 వ సంవత్సరంలో శ్రీ రెడ్డి గారు న్యూ జిలాండ్ తెలుగు సంఘానికి అధ్యక్షులుగా పదవీ బాధ్యతలను చేపట్టి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా కూచిపూడి కళాకారులని భారతదేశం నుండి రప్పించి తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తన హయాములో తెలుగు రేడియోని పునరుద్ధరించడం జరిగింది. అంతకు ముందు రెండు మార్లు తెలుగు సంఘంలో క్రియాశీలక సభ్యునిగా కూడా పనిచేసారు.

శ్రీ వేణుగోపాల్ రెడ్డిగారి సతీమణి శ్రీమతి ప్రతిభ న్యూ జిలాండ్ సోషల్ వెల్ఫేర్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె. పేరు త్రిషా రెడ్డి. కుటుంబ సహాయ సహకారాలతో ఈ గౌరవ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా వుందని శ్రీ రెడ్డి గారు చెప్పారు. వారి శ్రీమతికి కుమార్తెకు ప్రత్యెక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఇప్పటి యువతకొక సందేశాన్నిస్తూ తోటివారికి సహాయం చేయడం ఎప్పుడూ సాధించాలన్న దృక్పధం కలిగి వుండడం చాలా ముఖ్యమని శ్రీ వేణుగోపాలరెడ్డి గారు చెప్పారు. సహ ఉద్యోగి శ్రీ కెవిన్ మేక్గ్రోయ్ కి తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

 

Send a Comment

Your email address will not be published.