వక్రతుండం ఓంకార ప్రతీక

Ganesh Chaturthiహిందూ దేవతా మూర్తులలో వినాయకుడికి ఉన్న ప్రత్యేకత తెలియంది కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దేవుడిని ఆరాధించినా ఏ శుభకార్యం విషయానికి వచ్చేసరికి ముందుగా కొలిచే దేవుడు గణపతి దేవుడినే. గణపతి గురించి రుగ్వేద కాలంలోనే ప్రస్తావన ఉంది. ఆ కాలంలో గణపతి అనే నామాన్నే బ్రహ్మణస్పతి అని వ్యవహరించారు. అంతేకాదు ఒకటి రెండు మంత్రాలలోను గణపతి ప్రస్తావన ఉంది. వినాయకుడినే మహాగణపతి అని సంభోదించడం జరిగింది. గణపతి పరబ్రహ్మం. సర్వోత్తముడు. గణపతి గురించి ఎన్నో విషయాలను గణేశ పురాణం, ముద్గల పురాణం చక్కగా వివరించాయి. ఈ రెండు పురాణాలలో గణేశ పురాణం మొదటగా వచ్చినట్టు తెలుస్తోంది. పదిహేడవ శతాబ్దిలో ఈ పురాణం వ్యాప్తిలోకి వచ్చింది. గణపతినే ఈ రెండు పురాణాలు పరబ్రహ్మమని వర్ణించాయి. శివ రహస్యంలో వినాయకుడి వృత్తాంతం ఉంది. స్కాంద, లింగ, వామన, పద్మ పురాణాలలోను గజముఖుడి గురించి ప్రస్తావన ఉంది.
తన మానసపుత్రుడికి అన్ని చోట్లా పూజలు జరగాలన్న పార్వతి మాటగానే త్రిమూర్తులకు కూడా గణపతి పూజనీయుడు అయ్యాడు.

ముద్గల పురాణంలో గణపతికి ముప్పై రెండు పేర్లు ఉన్నాయి.
అవి – బాల గణపతి, తరుణ, భక్త, వీర, శక్తి, ద్విజ, సిద్ధ, ఉచ్చిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మీ, మహాగణపతి, విజయ, వృత్త, ఊర్ధ్వ, ఏకాక్షర, వర, త్ర్యక్షర, క్షిప్రా, ప్రసాద, హరిద్రా, ఏకదంతా, సృష్టి, ఉద్దండ, ఋణ మోచన, దుండి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గా, సకస్త హర గణపతి అన్నవే ఆ పేర్లు.
వీటిలో మొదటి పదహారూ అత్యంత మహిమాన్వితమైనవి. వాటిని షోడశ గణపతి అంటారు.

కొన్ని ప్రతిమలు…
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ దక్షిణ భాగంలోని గోడపై అపూర్వమైన గణపతి ప్రతిమ ఉంది. ఇక్కడ వేణువు వాయిస్తున్న గణపతిని చూడవచ్చు.
తమిళనాడులోని మదురైలో గల సుందరేశ్వర ఆలయంలో ద్వారం వద్ద గణపతి శిల్పంలో ఏనుగు తల, రెండు చేతులు గల స్త్రీ దేహం, నడుము నుంచి కింది వరకు పులి కాళ్ళు, తోక కనిపిస్తాయి.
గోకర్ణంలో అతి ప్రాచీన గణపతి క్షేత్రం ఉంది.
కోలారు జిల్లాలోని కురుడుమలె అనే ప్రాంతంలో సుప్రసిద్ధ గణపతి క్షేత్రం ఉంది.
మన ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకుడి ఆలయం గురించి అందరికీ తెలిసిందే కదా.
తమిళనాడులోని తంజావూరులోని తిరునల్లూరులో గణపతి సాలగ్రామానికి పూజ చేస్తారు.

గణపతి వక్రతుండం ఓంకార ప్రతీక. అతని లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. ఇది ఆకాశ తత్వ శూచకమని పలువురి పెద్దల అభిప్రాయం.

గణపతికి ఇష్టమైన ప్రసాదం లడ్డు. దీనినే మోదకం అని అంటారు. అలాగే కుడుములు, నూగులు, చెరకుగడలు, కొబ్బరికాయలు, మాదీ ఫలాలు, అరటిపండ్లు ఎంతో ప్రియమైనవి.
గణపతి వాహనం ఎలుక. అయితే అతనికి సింహం, నెమలి, సర్పం, కుండలినీ శక్తి సంకేతం.

శివపార్వతుల ఇద్దరు కుమారులలో పెద్ద వాడిన గణపతికి ఇద్దరు భార్యలు. వారి పేర్లు సిద్ధి, బుద్ధి. అయితే కొన్ని పురాణాలు గణపతికి ఎనిమిది మంది భార్యలని పేర్కొన్నాయి. ఈ ఎనిమిది మంది భార్యలు అష్ట సిద్ధులకు ప్రతీకలు.

గణపతిని లింగ రూపంలోను, సాలిగ్రామ, యంత్ర, కలశ, లేదా విగ్రహ రూపంలో పూజించే సంప్రదాయం కూడా ఉంది.
శ్రీ గణేశ యంత్రం సర్వ శ్రేష్టమైనది. గణపతి వ్రతాలలో సంకష్ట హర గణపతి వ్రతం మిక్కిలి విశేషమైనది.

వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు మట్టి ప్రతిమను పూజించడం ముఖ్యం. పూజ తర్వాత ప్రతిమని బావి లేదా చెరువులో విసర్జించాలి.

శ్రావణ శుద్ధ చతుర్ధి నాడు ప్రారంభించి భాద్రపద శుద్ధ చతుర్ధి వరకు వరద చతుర్ధి వ్రతం చేయాలి. భాద్రపద శుద్ధ చవితి రోజు ఇరవై ఒక్క దూర్వా దళాలతో పూజ చేయాలి. ఇరవై ఒక్క నమస్కారాలు చేయాలి. ఇరవై ఒక్క కుడుములు సమర్పించాలి.

పురాణాలలో కపర్ది వినాయకవ్రతం, వట గణేశ వ్రతం, అంగారక చతుర్ధీ వ్రతం, సత్య వినాయక వ్రతం తదితర వ్రతాల గురించి ప్రస్తావించడం జరిగింది.
ఏది ఎలా ఉన్నా అందరం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి అతని కృపకు పాత్రులు కావడం ప్రధానం.

Send a Comment

Your email address will not be published.