వచ్చిందోయ్...పెద్ద పండగ

దేశవ్యాప్తంగా అందులోను ముఖ్యంగా దక్షిణాదిలో జరుపుకునే పండుగలలో భోగీ, సంక్రాంతి, కనుమ ….పెద్ద పండుగే.

చంద్ర మాసం పాటించే మన తెలుగు వాళ్ళం సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో భోగీ ఒకటి. అయితే మిగిలిన పండుగలలా భోగీ తిథి ప్రధానమైన పర్వం కాదని తెలుసుకోవాలి.

భోగీ
భోగీ పండుగ దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు. భోగ భాగ్యాలు అనుభవించడానికి ముఖ్యంగా రైతులకు వీలు కలిగించే పండుగ కనుక దీనికి భోగీ పండగ అనే పేరు వచ్చింది. భోగీ పండుగ ఇంద్రుడి గురించి చేసుకునే పండుగ. మేఘానికి అధిపతి ఇంద్రుడు. మేఘాల పనులలో ఒకటి వర్షాలు కురిపించడం. పంటలు పండటానికి వర్షాల అవసరం ఎంతైనా ఉంది. వర్షం కోసం ఇంద్రుడిని పూజించే ఆచారం ఏర్పడింది. అలాగే భోగీ బలిచక్రవర్తి అణగిన రోజుగా కొందరు చెప్పుకుంటారు. అందుకే కొన్ని చోట్ల వామన నామస్మరణ చేస్తారు. అలాగే బలి చక్రవర్తి ప్రస్తుతి చేయడం కూడా సహజం.

భోగీ రోజు ఇంకా చీకటి తెరలు తొలగక ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేస్తారు. దానిని విధాయక కృత్యం అంటారు. ఆ స్నానంతో భోగీ పీడ వదులుతుందని నమ్మకం. మంటలు వేస్తారు. డప్పు వాయిస్తారు. ధనుర్మాసం నెల రోజుల్లో అమ్మాయిలు తయారు చేసిన గొబ్బి పిడకలు ఈ మంటల్లో వేస్తారు. వీటిని భోగీ మంట అంటారు.

అలాగే కొన్ని చోట్ల ఇరుగుపొరుగు వాళ్ళను పిలిచి ఇంట్లో చిన్న పిల్లలకు కొత్త బట్టలు వేసి, తిలకం దిద్ది, ఒక చోట కూర్చో బెట్టి రేగిపళ్ళు, పైసలు, చెరకు ముక్కలు, బంతి పువ్వులు వంటివి కలిపి వాళ్ళ శిరస్సు పై పోస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆయుస్సు వృద్ధి చెందుతుందని తెలుగు వారి విశ్వాసం.

సంక్రాంతి
Makar-Sankranti-దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటి రోజు సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో వస్తూ మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విధంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని, మకర సంక్రాంతి అని అంటారు. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనం అని వ్యవహరిస్తారు. దక్షిణాయనంలో వర్షాలు తెగ కురుస్తాయి. ఉత్తరాయణంలో వానలు తగ్గి చలి, ఎండ కలగలసి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రకృతిలో కొత్త తేజం కనిపిస్తుంది. ఉత్తరాయణంలో సూర్యుడి గతి కాస్త మందంగా ఉంటుంది. అందువల్ల పగలు దీర్ఘంగా ఉంటుంది. సాధారణంగా జనవరి నెలలో పంట చేతికి వస్తుంది.

ఇలా ఉండగా, సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతిగా చెప్పుకోవాలి. ఈ సంక్రమణ కాలాన్నే రవి సంక్రమణ దినం అని కూడా అంటారు. ఈ మకర సంక్రమణ కాలంలోనే అయ్యప్ప దేవుడి దివ్య నేత్రాలు తెరచుకుంటాయని ప్రతీతి. అప్పుడు ఆకాశంలో జ్యోతి దర్శనమిస్తుంది.
కేరళ ప్రాంతంలోని శబరిమలలో ఈ మకర జ్యోతిని విశేషంగా చెప్పుకుంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వారందరూ ఈ జ్యోతిని తప్పక దర్శనం చేసుకుంటారు.

ఈ పండుగ మరో గొప్పదనం….వాకిట్లో వేసే రంగవల్లులతో ఇళ్ళకు ఓ కళ వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సంవత్సరాలుగా రంగవల్లుల పోటీలు పెట్టి కానుకలు ఇవ్వడం జరుగుతోంది. సంక్రాంతి నెల ముందు నుంచి రంగవల్లులు వేయడం మొదలు పెడతారు. ఈ నెల రోజుల్లో రకరకాల ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయడం ఒక కళ. సాధారణంగా ఈ ముగ్గులు వేసే ముందు పేడ నీళ్ళతో అలికి శుభ్రం చేస్తారు. గుల్ల సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ, ముగ్గులోని కాల్షియం క్రిమికీటకాల సంహారానికి దోహదపడతాయి. అయితే భోగీ , సంక్రాంతి రోజులలో మాత్రం పద్మాల ముగ్గు వేయడం ప్రధానం. మకరసంక్రాంతి రోజు సాదరంగా రధం మీద వీడ్కోలు చెప్పినట్లుగా ఉండే రధం ముగ్గు వేస్తారు.

కనుమ
మకర సంక్రాంతి వెళ్ళిన మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. కొన్ని చోట్ల ఆ రోజు ఆవులను శుభ్రం చేసి కొమ్ములకు రంగులు పూసి, వాటి పైన నిమ్మకాయలు గుచ్చి అగరవత్తులు వెలిగించి ఆ నిమ్మకాయలలో పెడతారు. వాటిని ఆరోజు ఇళ్ళ ముందుకు తీసుకు వస్తారు. తెలుగు రాష్ట్రాలలో కంటే తమిళనాడులో ఈ ఆవుల పండుగను పెద్ద ఎత్తున చేస్తారు. మన గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు ఎలా భారీ ఎత్తున జరుపుకుంటారో తమిళ నాట జల్లికట్టు అనే వేడుక నిర్వహిస్తారు. డబ్బు ఒక గుడ్డలో పెట్టి వాటిని ఎద్దుల కొమ్ములకు చుడతారు. ఆ ఎడ్లను పట్టి వాటి కొమ్ములకు కట్టిన డబ్బు మూటను ఎవరైతే విప్పుతారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ విషయమై పందాలు కాస్తారు కూడా.

ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో తీరున సంబరాలు జరుపుకుని ఈ పెద్ద పండుగ అందరికీ శుభం కలుగజేయాలని ఆశిద్దాం.

– చౌటపల్లి నీరజ , కైకలూరు

Send a Comment

Your email address will not be published.