వనితా మండలి సిడ్నీ తెలుగు అసోసియేషన్

వనితా మండలి సిడ్నీ తెలుగు అసోసియేషన్

మన తెలుగువారు ఆస్ట్రేలియా వచ్చి ఏభై ఏళ్లకు పైబడింది. చాలామందికి వయసు పైబడి ఉద్యోగ విరమణ చేసి మనవళ్ళతో కాలం గడిపే కాలం వచ్చింది. కాలగమనంలో వయసుతోబాటు కొంత మంది కాన్సెర్ వ్యాధి బారిన పడడం కూడా జరిగింది. అయితే ఈ ప్రక్రియ అసాధారణమేమీ కాదు. కాన్సెర్ కౌన్సిల్ సంస్థ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వారు కాన్సెర్ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా వుంటుంది. కొన్ని సంతతుల్లో వంశపారంపర్యంగానూ, వాతావరణ పరిస్థితుల ప్రభావంగానూ ఇంకా ఎన్నో ఇతర కారణాల వలన ఈ వ్యాధి రావడం జరుగుతుంది. దీనికి మనవారు కూడా అనర్హులు కారు.

కాన్సెర్ వ్యాధి బారి నుండి ప్రతీ ఏట కొన్ని వేల మంది చనిపోతున్న సంగతి క్రోత్తేమి కాదు. గణాంకాలు చూసుకుంటే గత పది పదిహేనేళ్ళుగా ప్రతీ ఏట షుమారు 40 వేల మందికి పైగా ప్రజలు చనిపోతున్నారన్నది నిర్వివాదాంసం. ఆస్ట్రేలియాలో 2014 లో 128,290 (72,110 పురుషులు, 56,180 పురుషులు) మంది కాన్సెర్ వ్యాధి తో బాధపడుతున్నవారిగా నిర్ధారించబడ్డారు. 2020 లో ఈ సంఖ్య 149,990 కి పెరగనున్నది. లింగ భేదాలు లేకుండా స్త్రీలు మరియు పురుషులు కూడా ఈ కాన్సెర్ వ్యాధిని పడడం సహజమే. రాష్ట్ర విభాగాలతో కలిసి కాన్సెర్ కౌన్సిల్ సంస్థ చేస్తున్న పరిశోధనా ఫలితాల మూలంగా గత 30 ఏళ్లుగా చూసుకుంటే వ్యాధిగ్రస్తులు ఎక్కువైనా దీనిమూలంగా చనిపోతున్న వారి సంఖ్య బాగా తగ్గిందనే చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతీ సంవత్సరం కాన్సెర్ వ్యాధి నుండి బాధ పడే వారికోసం షుమారు నాలుగున్నర బిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు పెడుతోంది. ఈ మొత్తం ఆరోగ్య శాఖ అంచనాలలో (బడ్జెట్) 6.9 శాతం.

ఈ పరిశోధనా రంగానికి తోటి పౌరులుగా మానవతా దృష్టితో మేము సైతం చేయూతనిస్తామని సిడ్నీ తెలుగు అసోసియేషన్ వనితా మండలి గత శనివారం 13 వ తేదీన సిడ్నీ లోని ఎర్మింగ్టన్ లో ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లలు పెద్దలు ఇంకా ఎంతోమంది సిడ్నీ తెలుగు అసోసియేషన్ ప్రముఖులు విచ్చేసి ఈ మహమ్మారి బారిన పడిన వారి గాధలు పంచుకోవడమే కాకుండా ఈ కార్యక్రమం ప్రతీ ఏట తెలుగు అసోసియేషన్ నిర్వహించాలని ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంప్రదాయపు విలువలున్న నృత్యాలు, పాటలు, తెలుగు భాషా మరియు సంస్కృతులపై క్విజ్ నిర్వహించడం జరిగింది. తెలుగు సంఘ సభ్యులందరికీ ప్రవేశం ఉచితం. విందు భోజనం నుండి వసూలైన సొమ్మంతా షుమారు 2500 డాలర్లు కాన్సెర్ కౌన్సిల్ కి అందజేయడం జరిగింది. హాలు మరియు ఇతర నిర్వహణ ఖర్చులు సిడ్నీ తెలుగు అసోసియేషన్ భరించింది.

“దశ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలన్న” చందంగా స్థానిక సంస్థలకు సాయం చేయడం ఒక ఎత్తైతే మన తరువాతి తరానికి దానం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమన్న సందేశాన్ని పిల్లలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ద్వారా సాధించారు.

కార్యక్రమంలో కాన్సెర్ కౌన్సిల్ నుండి ముఖ్య అతిధిగా శ్రీ తఫేరి అబిబి గారు రావడం ప్రత్యేకం. శ్రీ అబిబి గారు మాట్లాడుతూ వనితామండలి నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో శ్లాఘనీయమనీ ముందు ముందు ఇటువంటి సహాయం కాన్సెర్ పరిశోధనా రంగానికి ఎంతో తోడ్పడుతుందని ప్రశంసించారు.

అమెరికా వాస్తవ్యులు శ్రీ డొక్కా ఫణి గారు నిర్మించిన “పల్లవి” తెలుగు చిత్రాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించాలని అనుకున్నారు. అయితే అమెరికా నుండి DVD సరైన కాలానికి రాణి కారణంగా ఈ ప్రదర్సన జరగలేదు. ఈ చిత్రానికి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు ఉచితంగా పాటలు పాడడం మరియు సంగీత కూర్పును సమకూర్చారు.

ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి వనితామండలి సమన్వయకర్త శ్రీమతి శోభ వెన్నెలకంటి గారు మరియు వారి బృందం ఎంతో కృషి చేసారని తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శివ శంకర్ పెద్దిభొట్ల గారు చెప్పారు. వాచస్పతులుగా శ్రీ భాస్కర్ మలపాక మరియు మాధవి ముదునూరు గార్లు ఆద్యంతమూ ప్రేక్షకుల్ని రసపట్టులో వుంచి సమయస్పూర్తితో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Send a Comment

Your email address will not be published.