పూణే నగరం స్థాయిలో వరంగల్ నగరాన్ని ఐ.టి నగరంగా తీర్చిదిద్దాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. ముంబై-పూణే నగరాలు దాదాపు జంట నగరాలుగా అభివృద్ధి చెందినట్లుగానే హైదరాబాద్-వరంగల్ నగరాలు అభివృద్ధి చెందాలని తాము గట్టిగా సంకల్పించినట్లు ఐ.టి శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. వరంగల్ నగరాన్ని టి హబ్ గా మార్చడంపై ఒక ప్రణాళిక మీద అధికారులతో సమీక్షించిన మంత్రి, ఈ నగరంలో ఐ.టి కేంద్రాలను నెలకొల్పే సంస్థలకు పెద్దఎత్తున రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ నగరం అభివృద్ధికి ఒక బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్, వరంగల్ నగరాల మధ్య నాలుగు రోడ్ల హై వే లను నిర్మిస్తామని, స్పీడ్ బస్సుల సంఖ్యను పెంచుతామని, ఇంటర్ సిటీ రైళ్ళను ఏర్పాటు చేయడానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని మంత్రి వెల్లడించారు. మరో రెండేళ్లలో వరంగల్ పూణే నగరాన్ని మించి అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన నొక్కి చెప్పారు.
ఇందుకు మొదటి దశగా ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.