వరాహా, నీకు వందనం...

విష్ణుమూర్తి అవతారాలలో మూడవది వరాహం. నిజానికి ఈ అవతారం శ్రీరామ చంద్రుడు అవతరించిన చైత్ర శుద్ధ నవమినాడే అయినా ఆ రోజు కాకుండా చైత్ర బహుళ త్రయోదశి నాడు వరాహ జయంతి జరుపుకోవడం సబబని మన పంచాంగ కర్తల అభిప్రాయం.

వరాహ అవతారంలో విష్ణువు అరివీరభీకరుడైన హిరణ్యాక్షుడిని అంతమొందించాడు.

కల్పాంతం ఒక్కసారిగా జలమయమైంది. అంతటా చీకటి అలుముకుంది. ఆ సమయంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు కొందరు ప్రార్ధించగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి మేల్కొంటాడు. వారి మొర విన్న విష్ణువు మళ్ళీ జగత్ సృష్టికి దిగాడు. చీకట్లు తొలగించి అంతటా వెలుగులు నింపడం కోసం బ్రహ్మాండాన్ని ఊర్ధ్వ, అదోముఖాలుగా రెండుగా చేశాడు. వాటినే పద్నాలుగు లోకాలుగా మార్చాడు. ఆ సందర్భంలో అనేకరకాల భారాలతో భూమాత పాతాళంలోకి కుంగిపోయింది. బురదలో చిక్కుకుని తల్లడిల్లే ఆవులా అయిపోయిన భూమాత విష్ణువుకి తన స్థితిని చెప్పి కాపాడమంటుంది. విష్ణువు అభయమిచ్చి భూమాతను ఉద్ధరిస్తాడు. భూమాత ధన్యవాదాలు చెప్పుకుంటుంది.

ఇలా ఉండగా హిరణ్యాక్షుడు ఓ రాక్షసుడు. తనకున్న బలంతో ఎప్పుడూ విర్రవీగుతుండేవాడు. అందరినీ భయపెడుతుండేవాడు. ఓమారు భూమినే ఓ చాప చుట్టినట్టు చుట్టి తీసుకుపోయి పాతాళంలో దాక్కున్నాడు. ఆ సమయంలో భూమాత తన బాధను విష్ణుమూర్తికి విన్నవించుకుంది. ఆమె బాధనంతా ఎంతో ఓపికగా విన్న విష్ణుమూర్తి వెంటనే ఓ భారీ వరాహరూపాన్ని ధరించాడు. ఆ వరాహ శరీరం అచ్చంగా ఓ నల్లటి పర్వతంలా ఉంది. అయితే కోరలు మాత్రం తెల్లటి తెలుపులో ఉండేవి. కళ్ళు పెద్ద పెద్ద జ్యోతులలా ఉండేవి. అది అరిస్తే ఉరుము ఉరిమినట్టు భీకరంగా ప్రతిధ్వనించేది.

ఆ వరాహం అనుకున్న ప్రకారం పాతాళంలో దాక్కున్న హిరణ్యాక్షుడిని డీకొంది. ఇద్దరి మధ్య భీకర పోరు సాగింది. చివరికి విజయం వరాహన్నే వరించింది. అప్పుడు పాతాళంలో నిస్సహాయస్థితిలో పడి ఉన్న భూమిని తన బలమైన కోరలతో పైకెత్తి తిరిగీ దాని పూర్వ స్థానంలో ఉంచడంతో భూమాత విష్ణుమూర్తికి కృతజ్ఞతలు చెప్పుకుంది. వేదాలను రాక్షసుల బారినుండి రక్షిస్తాడు.

భాగవతంలో ఓ చోట వరాహ అవతారాన్ని ఇలా వర్ణించాడు ….

అరయగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో
నొరగి నిమగ్నమైన ధర నుద్ధతి గొమ్మున నెత్తినట్టి యా
కిరిపతి యగ్ని కల్పుదురు ఖేలుడు నూర్జితమేదినీ మనో
హరుడు గృపావిదేయుడు సదాధ్వముల న్నను గాచుగావుతన్

సమస్త లోకాలూ కలత చెందుతుండగా మహాసముద్రంలో ఒరిగి నిండా మునిగిపోయిన భూమిని మహాదర్పంతో కొమ్ముతో పైకి ఎత్తిన ఆ వరాహపతి నన్ను కాపాడుగాక. ఆ వరాహమూర్తి అగ్నితో సమానుడు. గొప్పగా క్రీడించే వాడు. మనోహరుడు. దయాగుణానికి విధేయుడు. సర్వకాలాలలో సర్వ మార్గాలలో నన్ను రక్షించుగాక. (ఈ పద్యంలో కిరి అంటే అడవిపంది. భూమిని ముఖంతో తవ్వేది అని అర్ధం.).

విష్ణువు వరాహ అవతారం ఎత్తిన చోటే వరాహతీర్ధం అయ్యింది.

వరాహ అవతారంలోనే విష్ణుమూర్తి భూదేవిని వివాహమాడుతాడు.

వరాహ అవతారంలో వరాహమూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అనే పేర్లు కూడా ఉన్నాయి. తిరుమల తిరుపతిపై తొలుత వెలసిన స్వామి ఈ వరాహ మూర్తి కావడం గమనార్హం.

మధ్యప్రదేశ్ లోని చత్తార్ పూర్ జిల్లాలో ఖజురహో ఓ చిన్న పల్లె. ఇక్కడే వరాహ ఆలయం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి అచ్చంగా వరాహ రూపంలో దర్శనమిస్తాడు. లక్ష్మి ఆలయానికి దక్షిణంగా వరాహ ఆలయం ఉంది. వరాహ ఆలయానికి ఎదురుగా లక్ష్మణుడి ఆలయం ఉంటుంది. వరాహ విగ్రహం 2.6 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ వరాహ విగ్రహ రూపం నిండా మరెన్నో చిత్రాలు చెక్కడం విశేషం. అంతేకాకుండా ముక్కుకీ, నోటికీ మధ్య శిల్పి వీణాధారి అయిన సరస్వతి విగ్రహాన్ని చెక్కాడు. 1986 లో యునెస్కో ఈ ఆలయ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.

– అంబడిపూడి శర్వాణి శరత్

Send a Comment

Your email address will not be published.