వసుదైక కుటుంబం

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు కాల పరిమితులు లేనివి.  హైందవ ధర్మం ఒక జీవన విధానమే గానీ మతం కాదన్నది నిర్వివాదాంశం.  మాతృదేశం లోనే అంపశయ్యపై పవళిస్తున్న మన సత్సంప్రదాయ విలువలను, పరభాషా సంస్కృతితో సహజీవనం చేస్తూ ఒక వినూత్న పద్ధతిలో స్థానికులకు పరిచయం చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ విక్టోరియా సంస్థ ప్రయత్నం ఎంతో కొనియాడదగ్గది.  మాతృ దేశానికీ కొన్ని వేల మైళ్ళ దూరంలో వున్నా “జగమంతా ఒక వసుదైక కుటుంబం” అన్న నినాదంతో బహుళ సంస్కృతికి పట్టంగడుతున్న ఆస్ట్రేలియా ఖండంలో భరతమాత గర్వించేలా మన జీవన విధానంలో భాగమైన వివిధ అంశాలను కధా వస్తువులుగా తీసుకొని మన భాష, జ్యోతిష్యం, ఆయుర్వేదం, భారతీయ నృత్యం ఇలా ఎన్నెన్నో అమూల్యమైన సంస్కృతీ సంపదలను కలబోసిన కార్య గోష్టి ఈ వేదిక – వేదిక్ విలేజ్ .

భాష పరిణామ క్రమం, యోగ మరియు ధ్యానం, జ్యోతిశాస్త్రము మొదలైన అంశాలపై మన తెలుగువారు శ్రీ ఉమామహేశ్ సెనగవరపు మరియు శ్రీ కర్రా భాస్కర శర్మ గారు గోష్టులను నిర్వహించారు.  శ్రీ కర్రా భాస్కర శర్మ గారు ఆస్ట్రేలియా కాల ప్రమాణాలకు సరిపోయే పంచాంగాన్ని ప్రతీ సంవత్సరం తాయారు చేసి మన భారతీయులందరికీ ఉచితంగా పంచిపెడుతూ వుంటారు.  జ్యోతిశాస్త్రంలో అందె వేసిన చేయి.

తెలుగు సంఘం తరఫున “గోకులం” నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.  ఈ ప్రదర్శన అద్భుతంగా వుంది.  ఇందులో శ్రీయుతులు ప్రసాద్ పిల్లుట్ల, రామారావు మునుగంటి, చైతన్య చావలి, కాశీ రాం కాట్నేని, కవిత కాట్నేని, కృష్ణ వేముల, నీరజ వేముల,  లక్ష్మి పేరి, మమతా దాస్, మరియు శ్రీదేవి మద్దాల పాల్గొన్నారు.  శ్రీమతి అనూరాధ మునుగంటి వారి అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  పంజాబీ నృత్యం, కేరళ డ్రమ్స్ ఈ కార్యక్రమానికి శోభను తెచ్చి పెట్టాయి.

ఈ కార్యక్రమ నిర్వాహక కార్యవర్గంలో మన తెలుగు వారు చాలామంది వుండటం ముదావహం.  ఇందులో శ్రీమతి గీతాదేవి మద్దిపట్ల ప్రముఖ పాత్ర వహించారు.  శ్రీమతి కృష్ణ మరియు శర్మ బేతనభట్ల, సౌమ్య చావలి సహాయ సహకారాలందించారు.

ఈ కార్యక్రమానికి బ్రూస్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అలెక్స్ హాక్ ముఖ్య అతిదిగా వచ్చారు.  శ్రీ అలెక్స్ మాట్లాడుతూ రెండు విభిన్నమైన చరిత్రలు గల భారత ఆస్ట్రేలియా దేశాల మైత్రీ బంధం ఒకే విలువలకు కట్టుబడి ఉండటం వలన  దినదినాభివృద్ధి చెందుతూ ఆర్ధిక వ్యాపార రంగాలలో పురోగతిని సాధిస్తున్నాయని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.