వారసత్వ సంపదకు పెద్ద పీట

హైదరాబాద్ నగరంలోని కుతుబ్ షాహీ సమాధులతో సహా దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది చారిత్రక ప్రదేశాలను కేంద్రం వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు తన బడ్జెట్ లో కేటాయింపులు కూడా జరిపింది. ఈ ప్రాంతాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. వీటి పునరుద్ధరణ, చుట్టూ ఉద్యానవనాల ఏర్పాటు, వాటి వైభవాన్ని వివరించే నిపుణుల నియామకం, వంటి వాటికి నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని కుతుబ్ షాహీ సమాధులు చారిత్రక గోల్కొండ కోటకు సమీపంలో ఉన్నాయి. కుతుబ్ షాహీ వంశస్తులు  గోల్కొండ రాజధానిగా దక్కన్ ప్రాంతాన్ని 1518 నుంచి 170 సంవత్సరాలు పాలించారు. వారిలో కుతుబ్ షాహీతో సహా ఏడుగురు పాలకుల సమాధులను పర్షియన్, పఠాన్, హిందూ నిర్మాణ రీతులలో కళాత్మకంగా నిర్మించారు.  కేంద్రం ఎంపిక చేసిన వారసత్వ సంపద నగరాలలో వారణాసి కూడా ఉంది. ఎక్కువ సంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకోవడమే తమ ఉద్దేశమని జైట్లీ అన్నారు. అంతేకాక, విదేశీ పర్యాటకులకు వీసా కష్టాలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం 43 దేశాల పౌరులకు అందుబాటులో ఉన్న వీసా అన్ అరైవల్ సౌకర్యాన్ని 150 దేశాలకు విస్తరిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.