నిన్నొక కార్య సాధకుని కధ, మొన్న ఒక క్రీడాకారుని గాధ, అటు మొన్న ఒక వ్యాపారవేత్త కధాంశం, నేడొక విద్యావర్ధకుని కధనం. వీరందరిదీ ఒకే వంశం. అదే భరత వంశం. వీరందరిదీ ఒకే భాష. అదే తెలుగు భాష. వీరందరిదీ ఒకే ధ్యాస. అదే కార్య దీక్ష. బహుళ సంస్కృతీ సంప్రదాయంలో మేము కూడా ఒక ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులమని నిరూపించారు. మన తెలుగువారి సత్తా చూపించారు.
ప్రభాకర్ “అగ్రజ” – పేరులోనే వున్న పెద్దరికం పనిలో కూడా చూపించాడు. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్ మెంట్ (AIM) మేనేజెర్ అఫ్ ది ఇయర్ ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియన్లను మెప్పించాడు. తెలుగుతల్లిని పులకరింపజేసాడు. తెలుగుదనాన్ని మురిపింప జేశాడు. మన కీర్తి బావుటాని రెపరెప లాడించాడు. మన యువతకు స్పూర్తినిచ్చాడు.
తెలుగుభాషంటే ప్రేమ, తెలుగు వాళ్ళంటే అభిమానం. తన భావాలకు చక్కని పదాల అల్లికతో మంచి కవితలుగా రూపు దిద్ది అక్షర రూపం ఇవ్వగలడు. భావోద్వేగంతో తన గొంతు నుండి జాలువారే పాటల పల్లకితో కన్నీళ్ళు తెప్పించగలడు. తనకున్న సామాజిక స్పృహతో నలుగురినీ ఉద్రేకపరచగలడు. అరమరికలు లేని మాటలతో మెప్పించగలడు.
అగ్రజుని వివరాల్లోకేల్తే – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రనుఖ పుణ్యతీర్థం తిరుపతి నగరానికి చెందినవారు. వీరి తాతగారు శ్రీ బ్రహ్మశ్రీ అగ్రజ సత్యనారాయణ శాస్త్రి గారు. తిరుపతి దేవస్థానంలో శాస్త్రి గారు ప్రధాన పండితులుగా 1965-2002 మధ్య బాధ్యతలు నిర్వహించారు.
గత పదిహేనేళ్ళుగా వివిధ సంస్థల్లో అనేక కీలకమైన పాత్రలను చేపట్టి ప్రముఖంగా విద్యా రంగానికి ఎనలేని సేవ చేస్తున్నారు. వీరు మెల్బోర్న్ నగరంలో తన భార్య ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నారు. శ్రీ ప్రభాకర్ నార్త్ మెల్బోర్న్ కళాశాల వ్యవస్థాపక సభ్యులు. ఈ సంస్థకు చీఫ్ ఎక్సిక్యుటివ్ ఆఫీసర్ గా పని చేసారు. ప్రముఖంగా Vocational Education and Training విభాగంలో ఎంతో కృషి చేసి అసాధారణమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి ప్రస్తుతం ప్రత్యెక సలహాదారుగా మరియు ఆడిటర్ గా విద్యా రంగంలో తన సేవలనందిస్తున్నారు. స్వయంగా మేనేజ్మెంట్ స్టడీస్ లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. తనకున్న డిగ్రీలు, డిప్లొమాలు కోకొల్లలు.
ప్రభాకర్ “అగ్రజ” గారికి అవార్డులు క్రొత్త కాదు. ఇంతకు మునుపు Melbourne Indian Business Club వారు 2013 లో బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రధానం చేసారు. వివిధ భాషల్లో (తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ) పాటలు పాడి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. గత సంవత్సరం మెల్బోర్న్ తెలుగు సంఘం నిర్వహించిన వాయిస్ అఫ్ ఆస్ట్రేలియా కార్యక్రమంలో ఫైనలిస్ట్ గా ఎంపిక కావడం విశేషం.
శ్రీ ప్రభాకర్ గారు మరెన్నో ఉన్నత శిఖరాలనదిరోహించి తెలుగువారి కీర్తి బావుటాని ఎగురవేయాలని తెలుగుమల్లి అభిలషిస్తోంది.