విభజనకే కేంద్రం మొగ్గు

ఆరు నూరైనా నూరు ఆరైనా రాష్ట్రాన్ని విభజించడానికే కేంద్రం నిర్ణయించుకుంది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఆమోదం పొందినప్పటికీ, దాన్ని తాము లెక్క చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా బిల్లుకు న్యాయపరమైన చిక్కులు గానీ, అడ్డంకులు గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి, ఆమోదించడానికి శాసనసభ తీర్మానం అడ్డేమీ కాదని ఆయన అన్నారు. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, పార్లమెంట్లో ఈ బిల్లును తేలికగా ప్రవేశ పెట్టవచ్చని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును సమర్పించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

ఈ నెల 4న గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతుందని, శాసనసభలో శాసనసభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని ఆయన వెల్లడించారు. సభ్యుల  అభిప్రాయాలకు సమాధానాలు కనుగొన్న తరువాత తెలంగాణా బిల్లుకు తుది రూపం ఇస్తామని ఆయన తెలిపారు. ఆ తరువాత దీనిని రాష్ట్రపతికి పంపిస్తామని, పార్లమెంట్ కు పంపించేముందు ఒకసారి కేంద్ర మంత్రి వర్గం కూడా దీన్ని పరిశీలిస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

ఇది ఇలా ఉండగా, శుక్రవారం ఉదయం ఈ ముసాయిదా బిల్లును కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా పరిశీలించి ఆమోద ముద్ర వేసింది. ఈ కోర్ కమిటీ సమావేశం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, అంటోనీ, గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు.ఈ బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ, దాన్ని పరిగణనలోకి తీసుకోనక్కర లేదని కోర్ కమిటీ భావించింది. తెలంగాణా ఏర్పాటును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి చేయాలని కూడా కోర్ కమిటీ నిర్ణయించింది.

Send a Comment

Your email address will not be published.