విరసం చలసాని అస్తమయం

విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన చలసాని ప్రసాద్ ఇక లేరు. ఆయన గుండెపోటుతో జూలై 25వ తేదీ ఉదయం (శనివారం) విశాఖపట్నంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ప్రజలకు సంబంధించిన పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకుని తాను నమ్మిన సిద్దాంతానికి రవ్వంత పక్కకు జరగకుండా ముందుకు సాగిన చలసాని ప్రసాద్ మరణించారన్న సమాచారం సాహితీలోకాన్ని విషాదసాగరంలో ముంచెత్తింది. గుండెపోటుకు లోనైన చలసానిని ఆస్పత్రికి తరలించడం కోసం అంబులన్స్ వచ్చేలోపు ఆయన కన్నుమూశారు.

ఆయన వయస్సు 83 ఏళ్ళు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చలసాని భార్య విజయలక్ష్మి 2003 లో మరణించారు.

సాహితీవేత్త, శ్రీశ్రీ ఆత్మ, స్నేహశీలి, నిరాడంబరుడు, నైతిక విలువలకు కట్టుబడ్డ వ్యక్తి, నిబద్ధుడు వంటి వాటన్నింటికీ అక్షరసత్యం అనిపించుకున్న చలసాని మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నామని విరసం ప్రతినిధులు తెలిపారు.

మహాకవి శ్రీశ్రీ సాహిత్యం ముద్రణలో ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాదు, 1970 లో శ్రీశ్రీ అరవై ఏళ్ళ వేడుకను ఘనంగా నిర్వహించడంలోను ఆయనదే ముఖ్యభూమిక.

ఆయన చనిపోయిన శనివారం నాడే విరసం వార్షికోత్సవం కావడం గమనార్హం. సాయంత్రం జరగవలసి ఉన్న ఓ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించాల్సి ఉంది కూడా. అయితే ఈలోపే ఆయన భౌతికంగా దూరమయ్యారు.

కృష్ణ జిల్లా భట్లపెనుమర్రులో 1932 డిసెంబర్ 8వ తేదీన బసవయ్య, వెంకట నరసమ్మ దంపతులకు జన్మించిన చలసాని చల్లపల్లిలో స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. గుడివాడలో డిగ్రీ ప్యాస్ అయిన ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం ఎలో పొలిటికల్ సైన్స్ చదివారు. 1957 – 59 సంవత్సరాల మధ్య మత్స్య శాఖలో ఉద్యోగం చేసిన చలసాని ఆ తర్వాత రైల్వేలో గుమాస్తాగా చేరారు. ఇక 1968 నుంచి 1992 వరకు ఏ వీ ఎన్ కాలేజీలో లెక్చరర్ గా పని చేశారు.

ఉదయమ సమయాల్లో తరచూ వారి ఇంటిపై దాడులు జరుగుతుండేవి. ఇలా ఓమారు జరిగిన కాల్పుల్లో చలసాని బాబాయి జగన్నాధ రావుతో పాటు మరో ఇద్దరు చనిపోయారు. ఈ కాల్పుల సంఘటన ఆయన మీద తీవ్రప్రభావం చూపింది. ఆయన జీవితాంతం తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి నడచుకోవడానికి కూడా ఈ కాల్పుల సంఘటనే ముఖ్య కారణమైంది.

ఎమర్జెన్సీ సమయంలో చలసాని రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ ఆయన మార్క్సిస్ట్ భావజాలాన్ని వీడలేదు.

రచయితలు రావి శాస్త్రి, రంగనాయకమ్మ తదితరులతోను ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి.

ఆయనకు పుస్తకాలంటే వల్లమాలిన మాలిన ప్రేమ. ఆయన ఇంటినిండా కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి.
వాటిలో కొన్ని పుస్తకాలు చాలా అరుదైనవి కూడా. ఆయన ఎన్నో అంశాల మీద చాలా లోతుగా మాట్లాడగల దిట్ట. ఏదైనా పుస్తకం చదివినప్పుడు దానిమీద తనకు అనిపించిన విషయాన్ని చెప్పడంలో ఆ రచయిత ఎంత పెద్దవారైనా తడబదేవారు కాదు. అదేసమయంలో ఓ చిన్న రచయిత మంచిగా రాస్తే ఆ రచయితను ప్రశంసించడంలోనూ ఆయన ముందుండేవారు. సమాజానికి హాని కలిగిస్తుందనే రచనలు ఆయన దృష్టికి వస్తే దుయ్యబట్టడంలో ఆయన ఆలోచించే వారు కాదు. ఆయన వామపక్ష వాదే అయినా ఇతర రచయితలు రాసిన పుస్తకాలను కూడా విరివిగా చదువుతుండేవారు. విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య కార్యక్రమానికి సైతం ఆయన హాజరయ్యేవారు. ఆయన రచనలంటే చలసానికి చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం ఆయన రచనలపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత కూడా వహించారు.

చలసాని మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులతోపాటు పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

Send a Comment

Your email address will not be published.