విశ్వవిద్యాలయాలలో సి సి కెమెరాలు

తెలంగాణాలోని అన్ని విశ్వవిద్యాలయాలలోను, అన్ని విశ్వవిద్యాలయ హాస్టళ్ళలోను ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని కె సి ఆర్ ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.

తెలంగాణాలో మొత్తం పదకొండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల ఇంచార్జ్ వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్లతోను తెలంగాణా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమావేశమై అన్ని విశ్వవిద్యాలయాలలోని మౌలిక వసతులపై సమీక్షించారు. సమావేశం తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో మౌలిక వసతులు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం గత పాలకులే అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం వరకు శ్రద్ధ చూపిన గత పాలకులు ఆ తర్వాత నిధుల కేటాయింపులోగానీ నియామకాలు చేపట్టడంలో కానీ తగినంత ఆసక్తి చూపలేదన్నారు. ఈ కారణాల వల్లే గత రెండు దశాబ్దాలుగా ఆయా విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియామకాలు జరగలేదని మంత్రి వాపోయారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల ఆస్తులు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని, కనుక ఇప్పటికైనా ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు విశ్వవిద్యాలయాల ఆస్తులు, భవనాలు, ఫర్నిచర్ లపై ఒక పత్రం తయారు చేయాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయ భూముల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాలని అధికారులకు సూచించారు. విశ్వవిద్యాలయాలలో ఈ – లైబ్రరీలు, ఇంటర్ నెట్ వసతులు, వై ఫై సదుపాయాలూ కల్పించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా విద్యార్ధులకు కల్పించే అన్ని సేవలనూ ఆన్ లైన్ చేయబోతున్నట్టు కూడా ఆయన వివరించారు.

ఇదిలా ఇండగా, మూడు నెలలకు ఒకసారి విశ్వవిద్యాలయాల పనితీరుపై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని కడియం శ్రీహరి తెలిపారు.

Send a Comment

Your email address will not be published.