వి హెచ్ పి – నాల్గవ వార్షికోత్సవం

సమాజ నిర్వహణ – ఆస్ట్రేలియా బలోపేతం అన్న నినాదం తో విశ్వహిందూ పరిషత్ విక్టోరియా విభాగం నాల్గవ వార్షిక సదస్సును ఈ నెల 26 వ తేదీన మెల్బోర్న్ నగరంలో నిర్వహించారు. విక్టోరియా పార్లమెంటు సభ్యులు మరియు విక్టిరియా డిప్యూటీ ప్రీమియర్ కి పార్లమెంటరీ కార్యదర్శి జుడిత్ గ్రేలీ ఈ సదస్సును ప్రారంభిస్తూ హిందువులు ఓర్పు సహనాలకు మారు పేరనీ, విద్య వినయాలకు పట్టుకొమ్మలనీ అభివర్ణించారు. లేబర్ పార్టీ ప్రభుత్వం భారతీయుల కోసం మెల్బోర్న్ లో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పాలనే ధృడ సంకల్పంతో $500, 000 (AUD) గ్రాంట్ ని ఇస్తున్నట్లు ప్రకటించారు.

విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం రామ మూర్తి గారు తన స్వాగతోపన్యాసంలో ఆస్ట్రేలియాలో విశ్వ హిందూ పరిషత్ స్థానిక సంస్థలతో కలిసి సమాజాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. విశ్వ హిందూ పరిషత్ ఉప అధ్యక్షులు (విక్టోరియా విభాగం) మాట్లాడుతూ ఆస్త్రేలియాలో హిందువుల గణాంకాలు, ఆస్ట్రేలియా ఆర్ధికాభివృద్ధికి హిందూ ప్రజల తోడ్పాటు, ఇతర స్థానికి బహుళ సంస్కృతీ సంస్థలతో పోలిస్తే హిందువుల అభివృద్ధి గురించి సవివరంగా తెలిపారు. 2006 నుండి 2011 మధ్య కాలంలో ఆస్ట్రేలియాలోని హిందూ ప్రజల సంఖ్య అపారంగా అంటే షుమారు 86 శాతం పెరిగిందని శ్రీ ఆస్థాన పేర్కొన్నారు. విద్యా పరంగా, ఆర్ధిక పరంగా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన హిందువులు అనేకమైన ఉన్నత పదవుల్లో కూడా రాణిస్తున్నారని శ్రీ ఆస్థానా చెప్పారు.

విక్టోరియా విభాగం అధ్యక్షులు శ్రీమతి గీతా దేవి గారు “Vision for Australian Hindu Society” పై కీలకోపన్యాసం చేసారు. ఎన్నో ఇతర దేశాలనుండి హిందువులు ఆస్ట్రేలియాకు వలస వచ్చి ఇక్కడ విద్యా, సాంకేతిక, ఆర్ధిక, ఆరోగ్య, పరిపాలనా సంబంధమైన విభాగాల్లో తమవంతు కృషి చేసి ఆస్ట్రేలియా దేశానికీ సేవలందిస్తున్నారని చెప్పారు. హిందువులందరూ హిందూ సత్సాంప్రదాయాలను గౌరవించి ఉన్నత స్థానాన్ని కల్పిస్తే హిందూ సమాజం పూర్వ వైభవాన్ని అందుకోవడానికి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి శ్రీ కెవిన్ రడ్ విశ్వ హిందూ పరిషత్ సాధించిన విజయాలను కొనియాడినట్లు గుర్తు చేసారు.

ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా మరియు న్యూ జిల్యాండ్ దేశాలనుండి షుమారు 50 కి పైగా హిందూ సంస్థల సభ్యులు పాల్గొని వారు చేపడుతున్న కార్యక్రమ వివరాలు విశదీకరించారు.

కంబోడియా నుండి వచ్చిన ప్రతినిధులు పాణిని భాషలో ప్రార్ధన చేయడం అందరినీ ఆకట్టుకుంది. షుమారు పదిమంది పిల్లలు అనర్గళంగా సంస్కృత శ్లోకాలు పద ఉచ్చారణలో తేడా లేకుండా ప్రార్ధనా కార్యక్రమానికి శుభారంభం చేయడం గుర్తించవలసిన విషయం.

ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై చర్చించి పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. వీటిలో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలతో పని చేయడం మరియు వాటినుండి సహాయం అందుకోవడం అన్న అంశంలో విక్టోరియా మల్టీ కల్చరల్ కమీషనర్ శ్రీ శ్రీని, శ్రీ వాసన్ శ్రీనివాసన్ – ఆస్ట్రేలియన్ మల్టీ కల్చరల్ కమిషన్ సభ్యులు, పోలీస్ సంస్థ నుండి శ్రీ అంతోనీ సిల్వ, విందం సిటీ నుండి క్రిస్ మెకీ పాల్గొన్నారు.

రెండవ చర్చా వేదికకు శ్రీ స్వామీ విజ్ఞానంద అధ్యక్షత వహించి HOTA (Hindu Organizations, Temples and Associations) ను ప్రారంభించారు. ఈ సంస్థకు శ్రీ శర్మ బెతనభట్ల కార్యదర్శిగా ఉండడానికి స్వచ్చందంగా అంగీకరించడం జరిగింది.

మధ్యాహ్నం జరిగిన “ప్రపంచ వ్యాప్తంగా హిందువుల సేతుబంధనం” చర్చా కార్యక్రమానికి డా.జయంత్ బాపట్ ఓం గారు అధ్యక్షత వహించారు. ఇందులో ఫిజీ, నేపాల్, శ్రీలంక మొదలగు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ సొసైటీ నుండి శ్రీ రాంప్రసాద్ వేముల గారు ప్రాతినిధ్యం వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎప్పుడో ఇక్కడికి వలస వచ్చిన వారు అనుభవాలను పంచుకొని హిందూ సమాజానికి వారందించిన సేవలను సింహావలోకనం చేసారు. యువతను సమాజ సేవా కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించడానికి ప్రోత్సహించాలని అందరూ ప్రతిన పూనారు.

వచ్చినవారంతా ఆస్ట్రేలియాలో హిందూ సమాజోన్నతికి పాటుపడాలనీ కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు రావాలనీ ఆకాంక్షించారు. రక్షా బంధన్ పండగను ప్రతీ ఏటా జరపాలని నిశ్చయించారు.

విందం సిటీ కౌన్సిలర్ శ్రీ గౌతమ్ గుప్త ఈ కార్యక్రమానికి హాజరై కౌన్సిల్ తరఫున శుభాశీస్సులు అందజేసారు.

శ్రీమతి అకిల రాజారత్నం రాబోయే కాలంలో ఎలా ముందడుగు వేయాలన్నది వివరించారు. విశ్వ హిందూ పరిషత్, విక్టోరియా విభాగం కార్యదర్శి శ్రీమతి కృష్ణ బెతనభట్ల కృతజ్ఞతాభినందనలు తెలపడంతో సమావేశం ముగిసింది.

Send a Comment

Your email address will not be published.